
కృష్ణతత్వం
పాండవుల బలం గురించి మాటిమాటికీ అడుగుతూ ఉండే ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పిన కృష్ణతత్వం అనంతం. ‘జగాలన్నీ ఒక ఎత్తు, కృష్ణుడు ఒక్కడూ ఒక ఎత్తు. అతని ముందు ఎన్నున్నా ఏవున్నా దుర్బలాలు. అతని సంకల్పాన్ని బట్టి సృష్టి, పుష్టి, నష్టి కలుగుతూ ఉంటాయి. సత్యమూ, ధర్మమూ స్థిరంగా ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. అక్కడే జయమూ ఉంటుంది. అన్ని లోకాలూ తానే అయి అన్ని జీవులలో ఆత్మగా ఉంటూ విహరిస్తూ ఉంటాడు. మాయను స్వీకరించి ఈ లోకంలో ఏదో రూపాన పుట్టి దుష్టశిక్ష, శిష్ట రక్ష చేస్తూ ఉంటాడు. పాండవుల కష్టాలు పోగొట్టాలనే నెపంతో ధర్మబాహ్యులైన నీ కొడుకులను నిగ్రహించడానికే ఆయన వచ్చా’డంటాడు సంజయుడు.
‘ఆ దేవుని తత్వం ఏ మాత్రం తెలిసిన వారైనా సరే ఆయన్ని ఆశ్రయిస్తారు. హాయిగా బతుకుతారు. విద్య, అవిద్య అని రెండున్నాయి. అవిద్యకు లొంగినవాడు తామసుడై విష్ణువును తెలుసుకోలేడు. విద్వావంతుడే తెలుసుకోగలడు. విద్య అంటే ఎలాంటిదంటే, సత్వ రజ స్తమో గుణాల వికారాలకు లొంగక ధర్మాన్ని అనుష్ఠిస్తూ భావశుద్ధి కలిగి ఉండటమే. విష్ణువును తెలుసుకోవడానికి ఎవరికైనా ఇదే దారి. విద్యా లక్షణాలకి విరుద్ధమైన పద్ధతి అవిద్య’ అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడిని ‘ధర్మపరుడవై కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే నువ్వూ నీ తమ్ములూ సుఖంగా బతకొచ్చు’ అంటాడు. కానీ దుర్యోధనుడికి ఆ మాటలు రుచించవు. గాంధారితోనూ చెప్పిస్తాడు ధృతరాష్ట్రుడు. కానీ వింటేగా దుర్యోధనుడు! అన్నిటిలో తాను ఉంటూ అన్నిటినీ తనయందు ఉంచుకుంటాడు... ఇదే ‘వాసుదేవ’ నామానికి అర్థం. దీనిని సరిగ్గా తెలుసుకున్నవారు శుభ ఫలితం పొందుతారు.
– యామిజాల జగదీశ్