‘నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని’

Kerala Transwoman Story Jinu Sasidharan Turns Into Priya - Sakshi

ఆమె తన నాడి చెప్పినట్టు విన్నది

తిరువనంతపురం : తల్లిదండ్రులు అతన్ని సైకియాట్రిస్ట్‌ల దగ్గరకు తీసుకువెళ్లారు. ‘ఈ అబ్బాయికి పిచ్చి లేదు’ అని డాక్టర్లు చెప్పారు. మరేంటి ఇతని సమస్య? ‘నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని. నా నాడీ అదే చెబుతోంది’ అన్నాడా అబ్బాయి. ఆయుర్వేద మెడిసిన్‌లో ఎం.డి చేశాడా అబ్బాయి. డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ‘అయినా సరే నన్ను నేను అబ్బాయిగా అనుకోలేకపోతున్నాను’ అన్నాడు. ఇప్పుడు డాక్టర్‌ ప్రియగా మారి వైద్యవృత్తి కొనసాగిస్తున్నాడు. కేరళ తొలి ట్రాన్స్‌ఉమన్‌ డాక్టర్‌ కథ ఇది. జిను శశిధరన్‌ను వొదులుకోవడమే పెద్ద సమస్య ప్రియకు. ప్రియ ఇప్పుడు ప్రియగాని... పుట్టినప్పుడు పేరు జిను శశిధరన్‌. కేరళలోని త్రిసూర్‌ అతనిది. తల్లిదండ్రులిద్దరూ నర్సులుగా పని చేస్తున్నారు. ఇద్దరు కొడుకులు వారికి. శశిధరన్‌ పెద్దకొడుకు. ‘ఇద్దరినీ డాక్టర్లు చేయాలని మా తల్లిదండ్రులు భావించారు’ అంటుంది ప్రియ.

అయితే ప్రియకు తాను ప్రియను అని తనకు మాత్రమే తెలుసు. అబ్బాయి దేహంలో చిక్కుకుపోయిన అమ్మాయిని తాను అని ప్రియ అనుకునేది. కాని చెప్పడం ఎలా? చెప్తే ఏమవుతుందో. ఎన్ని అవమానాలు భరించాల్సి వస్తోందో. తల్లిదండ్రులు ఏమవుతారో... అన్నీ సందేహాలే. టీచర్‌ కావాలని ఉన్నా తల్లిదండ్రుల కోరిక మేరకు త్రిసూర్‌లోనే ఆయుర్వేదంలో 2013లో బేచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేద చేసింది ప్రియ. ‘పెళ్లి చేయాలని నా తల్లిదండ్రులు భావించారు. అది తప్పించుకోవడానికి మంగళూరు వెళ్లి ఆయుర్వేదంలో ఎం.డి చేశాను’ అంది ప్రియ. ఎం.డి. చేస్తున్న సమయంలో తాను మానసికంగా పూర్తిగా స్త్రీగా మారినా అందరి కోసం మగవాడిలా కనిపించడానికి మగవాడిలా నడవడానికి మాట్లాడటానికి చాలా శ్రమ పడింది ప్రియ. ‘అదంతా పెద్ద సమస్య’ అయ్యింది నాకు అందామె. 2018లో ఎం.డి పూర్తి చేసుకొని త్రిసూర్‌ వచ్చి అక్కడి హాస్పిటల్‌లో పని చేయసాగింది ప్రియ. (చదవండి: పంచాయతీ ప్రెసిడెంట్‌ అయిన స్వీపర్‌!)

‘ఆ సమయంలోనే నేను జెండర్‌ రీఅసెస్‌మెంట్‌ సర్జరీ గురించి తెలుసుకున్నాను. ఖర్చుతో కూడిన పని. రిస్క్‌ కూడా ఉంటుంది. అయినా నేను అమ్మాయిగా మారదలుచుకున్నాను. మా తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాను. వారు చాలా బెంగపడ్డారు. అయితే మా అమ్మ ఆ తర్వాత నన్ను సపోర్ట్‌ చేసింది. నా పక్కనే ఉండి నాకు అవసరమైన ఆరు సర్జరీలలో సాయం చేసింది’ అంది ప్రియ. కాని ఆమెకు తను పని చేస్తున్న హాస్పిటల్‌లో ఏమంటారో, తాను ట్రీట్‌ చేస్తున్న పేషెంట్లు ఏమంటారో అనే భయం కూడా ఉండేది. ‘వారికి చెప్పాను. హాస్పిటల్‌లో నా నిర్ణయాన్ని ఆహ్వానించారు. పేషెంట్లు కుతూహలంగా ప్రశ్నలు అడిగారు. నేను అబ్బాయిగా వెళ్లి అమ్మాయిగా తిరిగి వస్తాను అని హాస్పిటల్‌లో చెప్పి తిరిగి వచ్చాక నాకు స్వాగతం చెప్పారు. ఇప్పుడు నేను నా మనసు శరీరం నాకు ఇష్టమైనట్టుగా మార్చుకుని కొత్త జీవితం ప్రారంభించాను’ అంది ప్రియ. ప్రియకు ఇంకా గొంతుకు సంబంధించి, కాస్మొటిక్స్‌కు సంబంధించి రెండు సర్జరీలు ఉన్నాయి. వాటి కోసం ఎదురు చూస్తోంది. – సాక్షి ఫ్యామిలీ 


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top