కవితత్త కథ

Kavitatta Kathalu Kavitha Special Story - Sakshi

చదువు అర్ధంతరంగా ఆగిపోయింది. అత్తగారింట్లో అడుగుపెట్టడం కోసమే ఆమె పుస్తకాలు అటకెక్కాయి. తండ్రి అనారోగ్యం ఆ నిర్ణయానికి కారణమైంది. అత్తగారిల్లు పూర్తిగా కొత్త... అక్కడి వాతావరణం కొత్త... ఈ సమస్య ఏ అమ్మాయికైనా ఉండేదే. అయితే ఈ అమ్మాయికి భాష కూడా కొత్త. తెలుగమ్మాయి మరాఠా కుటుంబంలో అడుగుపెట్టింది. వాళ్లు తెలుగు మాట్లాడేవాళ్లే అయినా ప్రతి ఆచారం, సంప్రదాయం మరాఠా పద్ధతిలోనే జరిగేది. ఈ తెలుగమ్మాయికి మరాఠా సంప్రదాయం కాదు కదా పెళ్లి నాటికి తెలుగు సంప్రదాయాలు కూడా పెద్దగా తెలియవు.

అలా బేలగా అత్తగారింట్లో అడుగుపెట్టి... రెండు సంప్రదాయాలను కలబోసుకుంటూ తనను వ్యక్తిగా మలుచుకుని ఒక శక్తిగా నిర్మించుకున్న రేణిగుంట కవిత పరిచయం ఇది. ఇప్పుడామె సామాజికంగా వెనుకబడిన యువతులకు జీవితం విలువ తెలియ చేస్తున్నారు. అనవసరమైన అపోహలతో అత్తగారింటి పట్ల, అత్తింటి వారి పట్ల దూరం పెంచుకుంటున్న యువతులకు తన జీవితాన్ని ఒక పాఠంలా వివరిస్తున్నారు. అలాగే పిల్లలకూ కథలు చదివి వినిపిస్తున్న ఈ ‘కవితత్త’ కథ ఇది.

భర్తతో కవిత
‘‘పుట్టింట్లో పదిహేనేళ్లు చదువుకున్నాను, ఆపేసిన చదువును అత్తగారింట్లో పదహారేళ్లపాటు కొనసాగించగలిగాను. నాన్న సింగరేణి ఉద్యోగి. రామకృష్ణాపూర్‌లో ఉద్యోగం. ఐదవ తరగతి వరకు సింగరేణిలోనే చదువుకున్నాను. ఆరవ తరగతికి జవహర్‌ నవోదయ విద్యాలయకు వెళ్లాను. ఇంటర్‌ వరకు నవోదయలో చదివాను. పరిస్థితులకు అనుగుణంగా మెలగగలిగే నేర్పు నాకు నవోదయ విద్యావిధానమే నేర్పించింది. ఆ విద్యావిధానం వల్ల జీవితాన్ని చూసే దృష్టి కోణం మారిపోతుంది. ఇంటర్‌ తర్వాత బీఫార్మసీలో సీటు వచ్చింది. అయితే అదే సమయంలో నాన్న ఆరోగ్యం దెబ్బతిన్నది. నేను పెద్దదాన్ని. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు. ఆడపిల్ల బాధ్యత తీర్చుకుంటే చాలన్నట్లు హడావుడిగా నాకు పెళ్లి చేసేశారు. అలా 1998లో ఇరవై ఏళ్లకు సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌లో అత్తగారింట్లో అడుగుపెట్టాను. వాళ్లది మరాఠా సంప్రదాయ కుటుంబం. మా వారు గవర్నమెంట్‌ టీచర్‌. ఉమ్మడి కుటుంబంలో కొత్త సంప్రదాయాల మధ్య ఊపిరిసలపని మాట నిజమే.

మానసికంగా పెళ్లికి సిద్ధంగా లేకపోవడంతో అమ్మవాళ్లు నాకు ఇంటి పనులేవీ నేర్పించలేదు. బలహీనంగా ఉన్నానని బాగా గారం చేస్తూ ఏ పనీ చేయనిచ్చేవారు కాదు. అత్తగారింట్లో అలా కుదరదు కదా! అయితే అన్నింటినీ తట్టుకుని నిలబడి నన్ను వాళ్లు అర్థం చేసుకునే వరకు ఎదురు చూశాను. నా విజయ రహస్యం అదే. ఇంట్లో వాళ్లు నన్ను ఆదరించడంతోపాటు నాకు చదువుకోవాలని ఉందనే కోరికను కూడా గౌరవించారు. నేను పరీక్షలకు ప్రిపేరవుతుంటే మా అత్తగారు భోజనం ప్లేట్‌లో పెట్టి ఇచ్చేవాళ్లు. అత్తగారు పోయాక మామగారు కూడా అంతే ఆదరంగా చూశారు. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో క్లాసులకు వెళ్లినప్పుడు, పరీక్షలకు వెళ్లినప్పుడు మా మామగారు మా ఇద్దరబ్బాయిలకు స్వయంగా వండిపెట్టి మరీ, పిల్లల బాగోగులు చూసుకున్నారు. అత్తగారింటితో మనల్ని మనం మమేకం చేసుకోగలగాలి. మన జీవిత నిర్మాణంలో అత్తగారిల్లు ప్రధానమైన పునాది అని మర్చిపోకూడదు’’ అని అన్నారు కవిత. పెళ్లి తర్వాతే ఆమె ఎం.ఎ. ఇంగ్లిష్, ఎమ్మెస్సీ సైకాలజీ, సైకాలజీలో డాక్టరేట్‌ చేశారు. 

‘షీరోజ్‌’ ఆవిర్భావం
నాకు గవర్నమెంట్‌ టీచర్‌ ఉద్యోగం వచ్చినప్పుడు ఏదో సాధించాననే సంతృప్తి కలిగింది. అప్పటి వరకు నా లక్ష్యం ఏమిటి? అనేది తెలియకుండా... ఇద్దరు బిడ్డల తల్లిగా పిల్లల్ని పెంచుకుంటూ, అర్ధంతరంగా ఆగిపోయిన అక్షర ప్రయాణాన్ని కొనసాగించడంలో మునిగిపోయాను. టీచర్‌ ఉద్యోగంలో చేరిన తర్వాత నన్ను నేను నిలబెట్టుకోగలిగాననే ఆత్మసంతృప్తి కలిగింది. ఆ తర్వాత ఇంకా ఏదో చేయాలనే ఆసక్తి పెరిగింది. కథల పుస్తకాల సేకరణ సమయంలో ఒక అవసరం తెలిసింది. మా తరంలో పిల్లలున్న ఇళ్లలో చందమామ కథల పుస్తకాలు కనిపించేవి. ఇప్పుడు పిల్లలకు కథల పుస్తకాల అలవాటు తప్పి పోయింది. కొంతమంది పిల్లల కోసం ఇంగ్లీష్‌ కథల పుస్తకాలు తెప్పించుకుంటున్నారు. కానీ తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారనిపించింది.

తెలుగులో చదవడం రాని పిల్లల తరం తయారవుతోంది. అందుకే పిల్లలకు కథలు వినిపించే బాధ్యత తీసుకున్నాను. ‘కవితత్త కథలు’ పేరుతో నీతి కథలు చెప్పి రికార్డు చేశాను. వాటికి ఫీజు చెల్లించాల్సిన పని లేదు, ఉచితంగా వినవచ్చు. ఇక మా మంచిర్యాల వంటి అభివృద్ధి చెందని పట్టణాలు, గ్రామాల్లో అమ్మాయిలకు కెరీర్‌ అవకాశాల పట్ల అవగాహన ఉండడం లేదు. వారికి గైడెన్స్‌ ఇచ్చే వాళ్లు కూడా తక్కువే. అందుకే రెండేళ్ల కిందట ‘షీరోజ్‌’ సంస్థను స్థాపించాను. ఇది మా మంచిర్యాల దాటి బయట ప్రపంచం పెద్దగా తెలియని వాళ్లకు అవగాహన వేదిక. 

యూఎస్‌ కల... కలగానే
మా తమ్ముళ్లిద్దరూ యూఎస్‌లో స్థిరపడ్డారు. నన్ను కూడా వచ్చేయమన్నారు. నాక్కూడా యూఎస్‌ క్రేజ్‌ బాగానే ఉండేది. ఎండాకాలం సెలవుల్లో పిల్లల్ని మా అమ్మ దగ్గర పెట్టి, నేను హైదరాబాద్‌లో వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌లో ఉండి మరీ టెస్టింగ్‌ టూల్స్‌ వంటి కోర్సులు చేశాను. అవకాశం అంది వచ్చింది. కానీ మా వారికి పెద్దగా ఇష్టం లేకపోయింది. వద్దని చెప్పలేదు కానీ, నీ యిష్టం అనే మాటను మనస్ఫూర్తిగా చెప్పడం లేదనిపించింది. ‘లక్షలాది మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణుల్లో ఒకదానివిగా ఉండడం కంటే, మంచి టీచర్‌గా పేరు తెచ్చుకోవడం ఇంకా బాగుంటుంది కదా! నీ లాగ ఉత్సాహం ఉన్న వాళ్లు మహిళల కోసం ఏదైనా చేయవచ్చు కూడా’’ అన్నారు. ఇక యూఎస్‌ ఆలోచన మానుకున్నాను. మా వారి సూచనలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ‘షీరోజ్‌’. ఇక నేను సైకాలజీ చదివాను కాబట్టి పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కూడా చేస్తున్నాను. మహిళల కోసం చేస్తున్న సేవకు ఒక వ్యవస్థగా నిర్మించాలనేది ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. దీనిని చేరుకున్న తర్వాత మరో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాను’’ అన్నారు కవిత చిరునవ్వుతో.

– వాకా మంజులారెడ్డి, ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు: ఎం. సతీశ్‌ కుమార్, పెద్దపల్లి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top