Jagannath Rath Yatra శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ | Jagannath Rath Yatra Sacred Rituals of 'Khali Lagi' | Sakshi
Sakshi News home page

శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ .. ఎలా చేస్తారు?

Jun 24 2025 2:33 PM | Updated on Jun 24 2025 3:44 PM

Jagannath Rath Yatra Sacred Rituals of 'Khali Lagi'

భువనేశ్వర్‌: జగన్నాథుడిని యాత్రకు సిద్ధం చేసేందుకు గోప్య సేవకుల వర్గం తలమునకలై ఉంది. గత 13 రోజులుగా స్వామి సోదరీ సోదరులతో కలిసి తెర చాటున గోప్య సేవలు పొందుతున్నాడు. ఆషాఢ కృష్ణ పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని స్వామి వారికి ఖొల్లి లగ్గి సేవ నిర్వహించారు. రాత్రి పూట ఈ సేవని చేపట్టారు. జ్వరం నుంచి ఉపశమనం పొందడంతో శారీరక దారుఢ్యం కోసం పలు లేపన సామగ్రి గోప్య మండపానికి తరలించడం ఖొల్లి లగ్గి సేవలో భాగం.    

శుద్ధ సువార్‌ సేవకుల ఇంటి నుంచి ఈ సామగ్రిని తీసుకుని వెళ్లడం ఆచారం. ముందు రోజు ద్వాదశి నాడు చీకటి పడిన తర్వాత శ్రీ మందిర సముదాయం విమలా దేవి పీఠం ఆవరణలో ఉన్న బావి నుంచి నీరు తోడుకుని పోయి స్వామి చికిత్స కోసం అవసరమైన లేపనాలు తయారు చేశారు. బాజా, తురాయి, ఘంటానాదంతో శుద్ధ సువార్‌ ఇంటి నుంచి శ్రీ మందిరానికి ఊరేగింపుగా ఔషధ సామగ్రిని సోమవారం తరలించారు. ఈ లేపన సామగ్రిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని శ్రీ అంగాలకు పూర్తిగా అద్దుతారు. దీనితో శరీరం వజ్ర దారుఢ్యంతో మెరుస్తుంది. 

రూపుదిద్దుకుంటున్న జగన్నాథుని రథం ఈ నెల 27 నుంచి తొమ్మిది రోజుల పాటు జరగనున్న రథాయాత్ర కోసం రథం నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రథం తయారీలో భాగంగా రంగులు అద్దే పనుల్లొ కళాకారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల రుపాయలను వెచ్చించి రథాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నహాలు చేస్తుంది. స్థానిక పాతబస్టాండు సమీపంలోని గుండిచా మందిరంలో పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటుగా జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతా మూర్తులు గుండిచా మందిరంలో ఉండి భక్తులకు దర్శంన ఇస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్‌ ప్రియదర్శిని స్వయి తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొమ్మిది రోజుల యాత్రలో భాగంగా గుండిచా మందిరానికి ఆనుకుని ఏర్పాటైన స్టాల్స్‌ వద్ద భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు పూర్తిగా ఉంటుందని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement