ఓ మహిళ 'మానవ పిల్లి'లా..అందుకోసం ఏకంగా శరీరాన్ని 20కి పైగా మార్పులు..

Italian Woman Wants To Become A Human Cat - Sakshi

వెర్రీ వెయ్యి రకాలు..పైత్యం పలు రకాలు అనే సామెతను మన పెద్దలు ఎందుకన్నారో గానీ కొందరూ మనుషులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. బహుశా పిచ్చి ఆలోచనలు కలిగిన వ్యక్తుల చూసే అన్నారు కాబోలు. మొన్నటికి మొన్న ఓ మనిషి మానవ కుక్కలా కనపడాలని ఆరాటపడటం వార్తలో హాట్‌టాపిక్‌గా మారింది. లక్షలు ఖర్చు పెట్టి మరీ నిజం చేసుకున్నాడు. అది మరువక మునుపే ఇప్పుడో మహిళ మానవ పిల్లిలా కనిపించాలనుకుంటోంది. దేవుడిచ్చిన రూపం కంటే జంతువుల్లా ఉండటానికి ఇష్టపడటం విడ్డూరం అనుకుంటే అందుకోసం వీళ్లు చేసే ప్రయత్నాలు చాలా జుగప్సకరంగా ఉంటాయి. కుక్కలా మారాలనుకున్న వ్యక్తి జస్ట్‌ కుక్కలా కనిపించే కాస్ట్యూమ్స్‌ ధరించాడంతే. కానీ ఈమె అచ్చం ఆడ పిల్లిలా కనిపించేందుకు ఎంతకు తెగించిందో వింటే కంగుతినండ ఖాయం!

ఇటాలియన్‌కు చెందిన 22 ఏళ్ల చియారా డెల్‌ అబేట్‌​ సోషల​ మీడియాలో మంచి క్రేజ్‌ ఉన్న టిక్‌టాకర్‌. మరెందుకు అనిపించిందో గానీ ఆడ పిల్లిలా కనిపించాలనేది ఆమె ప్రగాఢ కోరిక. అందుకోసం తల దగ్గర నుంచి కాలి వరకు 20కి పైగా మార్పులు చేసింది. ప్రతి అంగాన్ని పిల్లిలా ఉండేలా మార్చింది. వామ్మో!.. ఇదేలా సాధ్యం అని అనుకోకండి!. ఎందుకంటే అసమంజసమైన కోరికను నిజం చేసి పాపులర్‌ అవ్వాలన్నదే ఆమె బలమైన కాంక్ష. ఈ కోరిక చిన్నినాటి నుంచి ఉందట. శరీరాన్ని పిల్లిలా మార్చుకునేందుకు శరీరంపై ఎన్ని కుట్లు పడ్డాయో చెబితే షాక్‌ అవుతారు. 

11 ఏళ్ల వయసు నుంచి శరీర ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రకియను మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఇలా ఇప్పటి వరకు శరీరంపై 72 కుట్లు పడ్డాయి. ముక్కు రంధ్రాల నుంచి, పైపెదవి వరకు చాల కుట్లు పడ్డాయి. కనురెప్పలపై అదనంగా ఉన్న చర్మం తొలగించుకునేలా కాస్మెటిక్‌ సర్జరీ, ప్రతి చేతికి 10 సబ్‌డెర్మల్‌ ఇంప్లాంట్లు, ఆఖరికి బ్రెస్ట్‌, అంతర్గత జననేంద్రియాలను  కూడా వదలలేదు. వాటిని కూడా ఆడ పిల్లికి ఉన్నట్లుగా మార్పులు చేయించుకుంది. తాను ఏదో కామెడీగా కార్టూన్‌లో కనిపించే పిల్లిలా కనిపించాలనుకోవడం లేదని అచ్చం "మానవ పిల్లిలా" కనిపించడమే తన ధ్యేయం అని తెగేసి చెబుతోంది చియారా.

అందుకే ఆమె అక్కడితో ఆగకుండా పూర్తిగా ఆడ పిల్లిలా కనిపించేలా..బాదం ఆకారంలో ఉండే పిల్లి కళ్లు, దంతాలు, పైపెదవి, తోక తదితర మార్పులు కోసం కాంటోప్లాస్టీ అనే కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతోంది. పైగా తన శరీరం ఆయా మార్పులకు అనుగుణంగా ఫిట్‌గా ఉంటుందని ధీమాగా చెబుతోంది చియారా. ఇలాంటి ఆలోచన రావడమే విచిత్రం అనుకుంటే అంతలా సర్జరీలు చేయించుకోవడానికి కూడా మంచి గట్స్‌ ఉండాలేమో!. చిన్న సర్జరీకే బెంబేలెత్తిపోతాం. ఏకంగా 20 సార్లు శరీర మార్పులు చేయించుకోవడమేగాక ఇంకా కొన్ని సర్జరీలు చేయించుకునేందుకు రెడీ అయిపోతోంది చియారా. పిచ్చి పీక్స్‌లో ఉంటే ఎంతకైన తెగిస్తారంటే ఇదేనేమో!.

(చదవండి: అద్భుతమైన డెవిల్స్‌ బ్రిడ్జ్‌! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top