
ఆకర్షణీయ ప్రాంతాలుగా అభివృద్ధి
మ్యూజియాలు, కల్చరల్ సెంటర్లుగా మార్చే యోచన
వారసత్వ పరిరక్షణతోపాటు పర్యాటకాభివృద్ధి
తొలిదశలో పన్నెండు ప్రాంతాల్లో..
హైదరాబాద్ నగరంలోని వారసత్వ కట్టడాలను ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నగరంలో చాలా చారిత్రక భవనాలు, ప్రదేశాలు, స్మారక చిహ్నాలు తదితర వారసత్వ కట్టడాలు ఉన్నాయి. పట్టించుకునేవారు లేక అవి మరుగున పడిపోతున్నాయి. వాటిని పరిరక్షించి నేటి ప్రజలకు, సందర్శకులకు నచ్చేవిధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా వాటికి తగిన గుర్తింపు లభించడమేకాక పర్యాటక ప్రాంతాలుగానూ అభివృద్ధి చెందుతాయని భావిస్తోంది. తొలిదశలో 12 ప్రాంతాల్లోని కట్టడాలను తీర్చిదిద్దాలనుకుంటోంది.
అందుకుగాను ఆయా ప్రాంతాల్లోని వనరులు, సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక మ్యూజియాలను ఏర్పాటు చేయాలని, లేదంటే కల్చరల్ సెంటర్లుగా మార్చాలని యోచిస్తోంది. ఈ రెండూ కుదరకుంటే ప్రజలకు ఉపయోపడే మరో రూపంలోనైనా అభివృద్ధి చేయాలనుకుంటోంది. తద్వారా ఓ వైపు చారిత్రక, వారసత్వ ప్రదేశాల పరిరక్షణతోపాటు సందర్శకులతో అవి పర్యాటక ప్రాంతాలుగానూ అభివృద్ధి చెందుతాయని భావిస్తోంది.
ఈ దిశగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ల రూపకల్పనకుగాను టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఆ యా కట్టడాలు, ప్రదేశాల పరిరక్షణ, పునర్వినియోగం, అభివృద్ధి అంశాల ప్రాతిపదికన ఆయా ఏజెన్సీ డీపీఆర్‌లు రూపొందించాల్సి ఉంటుందన్నారు.
వారసత్వ పరిరక్షణ.. పర్యాటక ఆకర్షణ
పాత కట్టడాలను కొత్తగా తీర్చిదిద్దడం ద్వారా సద రు నిర్మాణాల జీవితకాలాన్ని పెంచడం, నగర సాంస్కృతిక వారసత్వాన్ని, శిల్పకళా వైశిష్ట్యాన్ని కాపాడినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

టెండర్లు పిలిచిన కట్టడాలు
⇒ రోనాల్డ్ రోస్ భవనం, సికింద్రాబాద్
⇒ చెన్నకేశవస్వామి ఆలయం, చాంద్రాయణగుట్ట
⇒ రేమండ్ సమాధి, మూసారాంబాగ్
⇒ పురానాపూల్ దర్వాజా, హుస్సేనీ ఆలమ్
⇒ ఖజానా భవనం, గోల్కొండ
⇒ షంషీర్ కోట, గోల్కొండ
⇒ గగన్‌ఫౌండ్రీ, అబిడ్స్
⇒ మసీద్–ఇ–మియాన్ మిష్క్, జుమ్మెరాత్ బజార్
⇒ టోలి మసీద్, కార్వాన్
⇒ హయత్ బక్షి బేగం మసీద్, హయత్‌నగర్
⇒ షేక్‌పేట్ మసీద్, షేక్‌పేట్
⇒ ఖైరతాబాద్ మసీదు, సమాధి, ఖైరతాబాద్

ఎంపికయ్యే ఏజెన్సీ ప్రతి స్థలాన్ని సమగ్రంగా పరిశీలించి, చారిత్రక ప్రాముఖ్యత, ప్రస్తుత పరిస్థితులను డాక్యుమెంట్ చేయాలి. ప్రతి స్థలానికి సంబంధించిన సాంస్కృతిక, చారిత్రక, శిల్పకళ, పర్యావరణ ప్రాముఖ్యతను వివరించాలి. ప్రాజెక్ట్ నిర్వహణ, డిజైన్, పర్యవేక్షణ, చారిత్రక నేపథ్యం, భౌతిక సంరక్షణ, ప్రజల సందర్శన.. ఆర్థిక అవకాశాలు వంటి అంశాలను డీపీఆర్‌లో పొందుపరచాలి.