వేడి ఒత్తిడి నివారణ ఎలా? | Heat stress significantly reduces milk production in dairy cows and buffaloes | Sakshi
Sakshi News home page

వేడి ఒత్తిడి నివారణ ఎలా?

May 12 2026 6:25 AM | Updated on May 12 2026 6:25 AM

Heat stress significantly reduces milk production in dairy cows and buffaloes

పాడి పశువుల పెంపకం

పాడి ఆవులు, గేదెల పెంపకంలో వేడి ఒత్తిడి ఒక కీలకమైన సమస్య. ఇది పాల దిగుబడిపై, పునరుత్పత్తిపై, మొత్తం పశువుల శ్రేయస్సుపై గణనీయ ప్రభావం చూపుతుంది. పశువులు తమ శరీరంలోని అధిక వేడిని బయటకు పంపటానికి ఇబ్బంది పడినప్పుడు ఒత్తిడికి గురవుతాయి. ఆవులు, గేదెలు 5 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రత ఉంటే సౌకర్యంగా ఉంటాయి. 

ఆపైన పెరిగే వేడితో పాటు గాలిలో అధిక తేమ శాతం కూడా వేడి ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా మేత తీసుకోవటం తగ్గుతుంది. పాల ఉత్పత్తి పడిపోతుంది. ఆవులు, గేదెలలో వేడి ఒత్తిడిని తగ్గించడానికి పోషకాహార నిర్వహణ, నివాస మార్పులు, మెరుగైన నిర్వహణ పద్ధతులతో కూడిన బహుముఖ విధానం పాటించటం అవసరమని అక్షయకల్ప ఆర్గానిక్‌కు చెందిన పశువైద్య నిపుణులు డాక్టర్‌ తేజేశ్వర రెడ్డి (63669 59100) అంటున్నారు.

వేడిమి ఒత్తిడి అంటే ఏమిటి?
పశువులు శరీరంలోని వేడిని బయటకు సమర్థవంతంగా వదలలేనప్పుడు శరీరంలో వేడి భారం పెరిగి ఒత్తిడి ఏర్పడుతుంది. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు/గేదెలపై వేడి ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వేడిమి ఒత్తిడితో పశువులకు నష్టాలు:
→ మేత తీసుకోవటం 10–20% తగ్గుతుంది. 
→ ఆ మేరకు పశువుల ఒంట్లో శక్తి తగ్గుతుంది.
→ పాల ఉత్పత్తి తగ్గుతుంది.
→ దూడల్లో పెరుగుదల మందగిస్తుంది.
→ చూడి కట్టే అవకాశాలు తగ్గుతాయి. 
→ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
→ అబార్షన్లు, వడదెబ్బ, మరణం సంభవించవచ్చు.

వేడిమి భారం సూత్రం
శరీరంలో పుట్టిన వేడి + వాతావరణం నుంచి గ్రహించిన వేడి – శరీరం నుంచి బయటికి వదిలే వేడి = మొత్తం వేడి భారం
→ వాతావరణ మార్పు, తీవ్రమైన వేడి పశువుల ఆరోగ్య రక్షణకు కీలకమైన సవాళ్లుగా మారాయి.
→ ఇతర పశువుల కన్నా అధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువులు ఎక్కువగా వేడి ఒత్తిడికి గురవుతాయి.
→ శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది.
→ ఆవుల కన్నా గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెలకు వేడిని శరీరం నుంచి బయటకు వదిలేందుకు స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. వాటి నలుపు శరీర రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది.

మేత నిర్వహణ:
→ ఉదయం/ రాత్రి చల్లటి సమయాల్లో మాత్రమే మేత వెయ్యండి. 
→ అధిక పీచు పదార్థాలు (ఎండు గడ్డి) మేపటం తగ్గించాలి. 
→ పచ్చిమేత/ సైలేజ్‌ ఇవ్వాలి. 
→ ఎలక్ట్రోలైట్లు, విటమిన్‌ సి, ఇ, సెలీనియం.. ఇవ్వాలి.
→ ప్రొ బయోటిక్స్‌– ఎంజైమ్‌లు ఇవ్వాలి.

చల్లపూటే పనులు
→ పశువులపై ఒత్తిడిని తగ్గించడానికి పాలు పితకటం, మేత పెట్టటం, వాటిని పట్టుకొని కడగటం వంటి పనులను పగటి పూట చల్లగా ఉండే సమయాల్లోనే చేయండి.
→ మధ్యాహ్నం ఎండు మేత ఇవ్వకూడదు.

పర్యవేక్షణ:
→ అధికంగా ఆయాస పడుతున్నాయా? శ్వాస రేటు పెరిగిందా? మేత తినటం తగ్గిందా? వంటి వేడి ఒత్తిడి సంకేతాల కోసం పశువుల శరీర పరిస్థితిని, ప్రవర్తనను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.

అత్యవసర ప్రణాళికలు:
→ అతి తీవ్రమైన వేడి పరిస్థితుల్లో ఇబ్బంది వస్తే ఏం చెయ్యాలో అత్యవసర ప్రణాళికలను రూపొందించుకోండి.
→ పశువులను త్వరగా చల్లబరిచే మార్గాలు ఆలోచించిపెట్టుకోండి. 
→ అత్యవసరమైన వైద్య సహాయం అందించండి

గాలి ప్రసరణ – శీతలీకరణ
→ పశువుల షెడ్డులో నిలువు ఫ్యాన్లు అమర్చాలి ∙మిస్టర్లు/ స్ప్రింక్లర్లు వినియోగించాలి.
→ పశువుల శాల లేదా షెడ్‌లోకి గాలి బాగా వచ్చి ΄ోయేలా చూసుకోండి. 
→ పశువుల శరీరంపై నేరుగా నీటిని చల్లండి. 
→ తడిపిన గోనె సంచులను పశువుల శరీరంపై కప్పండి. 
→ షెడ్‌లో ఎక్కువ పశువులను ఉంచకుండా రద్దీగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది వాటి శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గటానికి, గాలి ప్రసరణ పెరగటానికి దోహదపడుతుంది.

షెడ్డు నిర్వహణ
→ పశువులకు షెడ్‌కు పక్కనే అదనంగా చెట్ల నీడ ఉండేలా చూడాలి లేదా షేడ్‌ నెట్‌ను కట్టి నీడ ఏర్పాటు చెయ్యటం ద్వారా వేడిమి ఒత్తిడిని తగ్గించవచ్చు. 
→ షెడ్‌ పైకప్పుపై తెల్లని పెయింట్‌ వేస్తే వేడి తక్కువగా ఉంటుంది. 
→ షెడ్‌ ఎత్తు 12–14 అడుగులు; ΄÷డవు 8–10 అడుగులు ఉంటే గాలి ΄ారాడుతూ వేడి తీవ్రత తగ్గుతుంది. 

నీటి నిర్వహణ
→ శుభ్రమైన నీటిని పశువులకు ఇవ్వాలి. రోజంతా నిరంతరాయంగా అందించాలి.
→ వేడి వాతావరణంలో ఆవులు/ గేదెలు ఆయాసం, చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవటానికి ఎక్కువ నీరు తాగుతాయి. 
→ 24 గంటలూ చల్లని నీరు ఇవ్వాలి. నీటి ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉండాలి. 
→ వేసవిలో నీటి తొట్టెల సంఖ్య పెంచాలి. 
→ గేదెలు నీటిలో మునగటానికి ఇష్టపడతాయి.
→ అందుకోసం వాలో ట్యాంకులు ఏర్పాటు చెయ్యాలి.
 
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement