Parenting Tips: మీ పిల్లలు చురుగ్గానే ఉంటారా? ఈ ఫుడ్‌ అయితే గుడ్‌! వ్యాయామం చేస్తే!

Healthy Lifestyle For Kids: What To Eat What Not Exercise Significance - Sakshi

మీ పిల్లలు చురుగ్గానే ఉంటారా? 

చిన్నతనంలో పిల్లలు ఆట, పాటల్లో మునిగి తేలడటం సహజం. అలా కాకుండా ఒకేచోట కదలకుండా కూర్చుంటే  మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే చిన్నతనంలో శారీరక వ్యాయామం చేయడం వల్ల పిల్లలు పెరిగి పెద్దయ్యాక శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు.

ముఖ్యంగా  కౌమార దశ అంటే టీనేజ్‌లో పిల్లలు వ్యాయామం చేస్తే పెద్దయ్యాక కూడా వృత్తి రీత్యా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకారు. అంతేకాదు, మిడిల్‌ ఏజ్‌లో గుండె జబ్బులు, ముసలితనంలో అల్జీమర్స్‌ రాకుండా ఉంటాయి. 

వ్యాయామం నేరుగా మెదడు పెరుగుదలను ప్రేరేపిస్తుంది కనుక వ్యాయామాన్ని పొట్ట తగ్గటానికి, లావు తగ్గటానికి అనే కాకుండా ఆరోగ్యం కోసమని చెప్పి వారికి అలవాటు చేయాలి తల్లిదండ్రులు. వాళ్లను వ్యాయామానికి పంపే బాధ్యత తీసుకోవాలి లేదా ఇంట్లో తల్లితండ్రులు వ్యాయామం చేసే సమయంలో వారిని జత చేసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు... వ్యాయామం వల్ల పిల్లల్లో  జ్ఞాపక శక్తి బాగా పెరుగుతోందట. దీంతో వారు చదువుతో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకుని పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే వారి ఆరోగ్యం కోసం నిత్యం సరైన సమయానికి పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందివ్వాలి. దీంతో వారు శారీరకంగానే కాకుండా, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు.

వ్యాయామం ఎంతసేపు? ఎలా? 
యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటీష్‌ కొలంబియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పిల్లలపై పరిశోధనలు నిర్వహించారు. నిత్యం వ్యాయామం చేసే పిల్లలు, వ్యాయామం చేయని పిల్లలతో పోల్చి వారు చదువుల్లో ఎలా రాణిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

నిత్యం వ్యాయామం చేసే పిల్లలు చురుగ్గా ఉండడంతోపాటు చదువులో కూడా రాణిస్తారని తెలుసుకున్నారు. అందువల్ల పిల్లల్ని రోజూ కనీసం 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలని, లేదా కనీసం ఆటలు ఆడుకునేందుకు పెద్దలు అనుమతించాలని వారు సూచిస్తున్నారు. అందువల్ల రోజు మొత్తంలో ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం మరో 30 నిమిషాల పాటు పిల్లలతో వ్యాయామం చేయిస్తే సరిపోతోంది.

ఈ ఫుడ్‌ అయితే గుడ్‌
 పిల్లలు యాక్టివ్‌గా ఉండాలంటే వ్యాయామం చేయించడంతోపాటు ఆహారం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, పాలు, పాల పదార్ధాలు వంటివి ఎక్కువగా పెట్టాలి.

బయట దొరికే ఫుడ్‌ అస్సలు పెట్టకూడదు.   ఇంట్లో మనం రోజువారీ పనులు చేసుకునేటప్పుడు చిన్న చిన్న సాయాలు చేయమని అడగాలి. అలా చేస్తే వాళ్లకు చిన్నప్పటి నుండే పరోపకార గుణం అలవాటు అవుతుంది. 

చివరగా ఒక్క విషయం.. . పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఏది చేస్తే అదే నేర్చుకుంటారు. అందుకే ముందు మనలో మార్పు రావాలి. మీరు వాళ్ళ ముందు మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలి. అది చూసిన పిల్లలు తాము కూడా అదే చేసేందుకు ఇష్టపడతారు. అప్పుడు వాళ్ళకి మంచి పద్ధతులు అలవాటు అవుతాయి. చదువులోనూ, ఆటపాటల్లోనూ కూడా చురుగ్గా ఉంటారు.  

చదవండి: Parenting Tips: ప్రేమతోనే పెంచుతున్నారా? చీటికిమాటికీ చిర్రుబుర్రులాడకండి! ఇలా చేస్తే..
Steamed Food- Health Benefits: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top