
ఒక రోజంతా శక్తిమంతంగా, ఉత్సాహంగా గడిచిందంటే వారిపై ఆ రోజు ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రభావం తప్పక ఉంటుంది. పిల్లల జ్ఞాపకశక్తికీ పోషకాలు గల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే పిల్లలు, పెద్దలు తీసుకునే బలవర్ధకమైన, సులువుగా తయారు చేసుకునే వంటకాలు ఇవి..
హెల్తీ మిక్స్ హల్వా
కావల్సిన పదార్థాలు
హెల్త్ మిక్స్ – కప్పు (క్యారెట్ లేదా బీట్‌రూట్ లేదా గుమ్మడి తురుము లేదా గోధుమ నూక); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బెల్లం లేదా కొబ్బరి చక్కెర – 1/4 కప్పు; పాలు – కప్పు; బాదం, జీడిపప్పు, చియా సీడ్స్ – టేబుల్ స్పూన్;
తయారీ విధానం
పాన్‌లో నెయ్యి వేడి చేసి, హెల్తీ మిక్స్ వేసి, బాగా వేయించాలి. పాలు పోసి, కలుపుతూ ఉండాలి.. మిశ్రమం చిక్కగా అయ్యాక, తురిమిన బెల్లం, కొబ్బరి చక్కెర ’కోకో షుగర్) వేసి బాగా కలపాలి. అన్నీ పూర్తిగా కలిసే వరకు మరో 2–3 నిమిషాలు ఉడికించాలి.తరిగిన డ్రై ఫ్రూట్స్ అలంకరించి, సర్వ్ చేయాలి.
పోషకాలు: పిల్లలకు, పెద్దలకు ఇష్టమైనదే కాదు... మంచి పోషకాలు కూడా ఉండే స్వీట్ ఇది. బెల్లం లేదా కొబ్బరి చక్కెర వాడటం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. బీట్‌రూట్, క్యారట్, గుమ్మడిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. పాల మిశ్రమం కాబట్టి క్యాల్షియమూ అందుతుంది.
చిల్లా
కావల్సిన పదార్థాలు: పెసరపప్పు – కప్పు (తగినన్ని నీళ్లు ΄ోసి, రెండు గంటలసేపు నానబెట్టాలి); నీళ్లు – అర కప్పు (తగినన్ని); ఉల్లిపాయ – చిన్నది (సన్నగా తరగాలి); పచ్చి మిర్చి – సన్నగా తరగాలి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నూనె – తగినంత.
తయారీ విధానం
పెసరపప్పును వడకట్టి, నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని (క్యారెట్ తురుము, పాలకూర తరుగు, నానబెట్టిన ఓట్స్ కూడా కలుపుకోవచ్చు) తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి.
పెనం వేడి చేసి, ఒక గరిటెతో పెనం పైన పిండి పోసి, దోసెలా వెడల్పు చేయాలి. మీడియం మంట మీద రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు ఉంచాలి. కొత్తిమీర, పుదీనా చట్నీతో వేడిగా సర్వ్ చేయాలి.
పోషకాలు
క్యాలరీలు తక్కువగా ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ సమృద్ధిగా లభించే ఈ చిల్లా ఉదయం, సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్‌లోకీ బాగుంటుంది. దీనిని రోల్ చేసి, ఉడికించిన కూరగాయలతో స్టఫ్ చేసి కూడా అందివ్వవచ్చు.
హెల్తీ మిక్స్ పరాఠా
కావల్సిన పదార్థాలు
హెల్తీ మిక్స్ (రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు మొలకెత్తిన గింజలు, గుమ్మడి, అవిసెగింజలతో చేసిన పిండి) – కప్పు; నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గోరువెచ్చని నీళ్లు (తగినన్ని);
తయారీ విధానం
ఒక గిన్నెలో, మిల్లెట్ మిక్స్, ఉప్పు వేయాలి. గోరువెచ్చని నీటిని క్రమంగా వేస్తూ, పిండిని మెత్తని ముద్దలా అయ్యేలా బాగా కలపాలి. చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకొని, చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. రెండు బటర్ పేపర్ షీట్ల మధ్య పిండి బాల్ ఉంచి, చపాతీ కర్రతో మెల్లగా, తేలికపాటి ఒత్తిడితో, రోల్ చేయాలి. పెనం వేడి చేసి, ప్రతి పరాఠాను సన్నని మంట మీద కొద్దిగా నెయ్యి/నూనెతో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి. చట్నీ లేదా పెరుగుతో వేడిగా వడ్డించాలి.
పోషకాలు: పరాటాకు కూరగాయలను ఉడికించి, వాడుకోవచ్చు. ఏమేం దినుసులు, కూరగాయలు వాడుతున్నామో దానిని బట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి.