దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మొదలైంది. పద్నాలుగేళ్ల బాలికలు మొదలుకొని దేశంలో దాదాపు కోటీ పదిహేను లక్షల మంది యువతులకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క సింగిల్‌డోస్ (మోతాదు)తో మహిళల్లో సర్వైకల్ కేన్సర్‌ను సమర్థంగా నివారించే (93% నుంచి 100% వరకు రక్షణ కల్పించే) ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వడం మొదలుపెట్టారు. మన దేశంలో విస్తృతంగా మొదలైన ఈ మహిళా ఆరోగ్య సంరక్షణ చర్య ద్వారా అంతర్జాతీయంగా కేన్సర్ నివారణ చర్యలు తీసుకున్న 160 దేశాల్లో మన దేశం కూడా ఒకటి కానుంది. ఈ నేపథ్యంలో ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్ గురించి అవగాహన కోసం...
హ్యూమన్ పాపిలోమా వైరస్ మహిళలను ప్రభావితం ఏలా చేస్తుందంటే...
ఇది (హెచ్‌పీవీ) మహిళల్లో సర్వైకల్ కేన్సర్‌కు దారితీస్తుంది. సెక్స్ ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే హెచ్‌పీవీ ఉండటం వల్లనే తప్పక అది సర్వైకల్ కేన్సర్‌కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే అది కేన్సర్‌ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్‌నర్స్‌తో సెక్స్‌లో పాల్గొనేవారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.
సాధారణంగా స్త్రీలలో అందునా గ్రామీణ మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సర్విక్స్ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది.
ఈ భాగం మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అలా అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన వల్ల కేన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
సర్వైకల్ కేన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్ ఫాక్టర్ హెచ్‌పీవీ వైరస్...
హెచ్‌పీవీ వైరస్ సోకడం సర్వైకల్ కేన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. మామూలుగానైతే చాలామందిలో హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్కేన్సర్‌కు దారితీసే అవకాశాలు పెరుగుతాయి. హెచ్‌పీవీ వైరస్‌తో పాటు పొగతాగే అలవాటు ఉండటం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటి అంశాలు కూడా సర్వైకల్ కేన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని.
నివారణ ఎలా?
నివారణకు తొలుత తోడ్పడే పరీక్ష పాప్‌స్మియర్ అనే వైద్యపరీక్ష. సర్వైకల్ కేన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ అనే వైద్యపరీక్షది చాలా కీలక భూమిక. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, తమ లైంగిక జీవితం ప్రారంభమయ్యాక మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవడం అవసరం.
అంటే చిన్న వయసు బాలికలు తప్ప మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. సర్వైకల్ కేన్సర్ రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దాన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–కేన్సరస్ దశ’ ఉండటం మరో అడ్వాంటేజ్. అంటే అసలు కేన్సర్ రావడానికి పదేళ్ల ముందే దీన్ని కనుగొనే అవకాశమున్నందున... అది కేన్సర్‌గా పరిణమించకముందే అంటే ‘ప్రీ–కేన్సర్’ దశలోనే నయం చేసుకోవచ్చు. పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం కూడా ఎక్కువే.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలంటే...
గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే కేన్సర్లను నివారించే ఈ వ్యాక్సిన్‌ను ఎప్పుడు ఇవ్వవచ్చనే విషయంలో అమెరికన్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ వారి సిఫార్సు మేరకు.. పదకొండేళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. తొమ్మిదేళ్లు నిండిన బాలికలు మొదలుకొని 26 ఏళ్ల వరకు మహిళలందరికీ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు.
అయితే మహిళలకు వాళ్ల వివాహానికి ముందే అంటే... వాళ్లు తమ లైంగిక జీవితాన్ని మొదలు పెట్టకమునుపే దీన్ని ఇప్పించడం అవసరం. వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో 99% మందికి ఈ కేన్సర్ వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి సర్వైకల్ కేన్సర్ ముప్పు తాలూకు ఆందోళన లేకుండా వారు జీవితాంతం నిశ్చింతగా ఉండే నిర్భయత ఈ వ్యాక్సిన్ తీసుకున్న మహిళలకు ఉంటుంది.
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో ఇతరత్రా ప్రయోజనాలివే...
హెచ్‌పీవీ వ్యాప్తినిఅరికట్టడం
యోని దగ్గర వచ్చే పులిపిరుల(జెనిటల్ వార్ట్స్) సమస్య నుంచి రక్షణ
గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ
యోని క్యాన్సర్ వంటి మరికొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి నివారణ
దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది
మహిళా సమూహాలకు సంయుక్త రక్షణ (హెర్డ్ ఇమ్యూనిటీ) కలగడం
చికిత్స తర్వాత మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు బాగా తగ్గడం
తద్వారా జనాభాలోని అందరికీ / ప్రజారోగ్య సంరక్షణకు తోడ్పడటం
డాక్టర్ సాయిలక్ష్మి డయానా, సీనియర్ కన్సల్టెంట్, గైనిక్ ఆంకాలజిస్ట్
– యాసీన్
చదవండి: ‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే..


