
నేడు గురుదత్ శతజయంతి
గురుదత్‌ను సర్వోన్నత దర్శకుడిగా ప్రపంచం గుర్తిస్తుంది. ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’ వంటి క్లాసిక్స్ తీసి గ్రేట్ మాస్టర్ అనిపించుకున్నాడు. వహిదా రెహమాన్ వంటి నటిని ఇంట్రడ్యూస్ చేశాడు. నేటి తరానికి అతని సినిమాలు పాఠాలే. అలాగే అతని వ్యక్తిగత జీవితం కూడా కుటుంబ జీవితాన్ని ఎలా పదిలపరుచుకోవాలో హెచ్చరించే పాఠం. మరణించి దశాబ్దాలు గడిచినా నేటికీ స్మరణకు నోచుకుంటున్న గురుదత్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
గురుదత్‌కు చిన్నప్పటి నుంచి దృష్టి సమస్య ఉంది. రెండు గజాల అవతల ఏముందో కళ్లద్దాలు లేకుంటే చూడలేడు. గురుదత్ తాను హీరోగా నటించిన చాలా సినిమాల్లో కళ్లద్దాలు వాడలేదు. ఇప్పుడు మీరు అతని సినిమాలు చూడండి. ఆ సినిమాలన్నింటిలోనూ అతడు ఎదురుగా ఏముందో కనపడకనే నటించాడు. డైలాగులు చెప్పాడు. నృత్యాలు చేశాడు. క్లోజప్స్ ఇచ్చాడు. కళ్లు కనపడుతున్నట్టుగానే ప్రేక్షకులకు భ్రాంతి కలిగించాడు. గురుదత్ అంత గొప్ప మేధావి. నిపుణుడు. నటుడు. కళాకారుడు.
గురుదత్ తెలిసిన వాళ్లకు పరిచయం చేయనక్కర్లేదు. తెలియని తెలుగువారికి ‘మల్లెపూవు’ సినిమాను గుర్తు చేయాలి. శోభన్‌బాబు నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ‘చిన్నమాటా... ఒక చిన్నమాటా...’ ‘మల్లెపూవు’కు ఒరిజినల్ గురుదత్ క్లాసిక్ ప్యాసా’. గురుదత్‌ను పరిచయం చేయాలంటే తెలుగు లింక్ ఇంకోటి చెప్పాచ్చు. మన తెలుగమ్మాయి వహీదా రహెమాన్‌ను సూపర్‌స్టార్‌ను చేసింది అతడే. సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన దర్శకుడు శ్యాం బెనగళ్‌కు గురుదత్ దగ్గరి బంధువు. గురుదత్ చేతుల్లో పడి స్టార్ కమెడియన్ అయిన బస్ కండక్టర్ జానీ వాకర్. ఇతని తండ్రి మిల్లు టెక్నిషియన్‌గా మూడేళ్ల పాటు వరంగల్‌లో పని చేశాడు.
హీరోలకు విశేషమైన ప్రత్యేకతలు ఉండాలి. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్... ఈ ముగ్గురిలో ప్రేక్షకులు మెచ్చే ప్రత్యేకతలు ఉన్నాయి. చూపులకు వీరు అందగాళ్లు. మాట తీరు, నడక, నటన... ఏదో స్పెషల్. కాని వీరిమధ్య ఏ ప్రత్యేకతలు లేనట్టుగా కనపడుతూ ప్రత్యేకత చాటుకున్న హీరో గురుదత్. ఒక రకంగా ఇతను రాజ్‌కపూర్‌కు క్లాసిక్ వెర్షన్. రాజ్‌కపూర్ నటించి దర్శకత్వం వహించాడు. గురుదత్ కూడా అలాగే చేశాడు. రాజ్‌కపూర్ పాపులర్ స్టయిల్‌లో సినిమా మేకింగ్ చేస్తే గురుదత్ క్లాసిక్ స్టయిల్ లో చేశాడు.
ఇద్దరూ పాటలు తీయడంలో మాస్టర్స్. కాని రాజ్‌కపూర్ పాటలకు ప్రిలూడ్ ఉండాలి. ‘ఆవారా హూ’... మొదలవ్వాలంటే మొదట సంగీతం వినిపించాలి. ఈ సంగీతాన్ని కట్ చేసి నేరుగా పాటను మొదలెట్టి షాక్‌కు గురి చేశాడు గురుదత్. అతని సినిమాల్లోని పాటలు ప్రిలూడ్స్ లేకుండా మొదలవుతాయి. పాట పాడాలంటే వెంటనే పాడొచ్చు కదా... మొదట సంగీతం వినండి అని ఆగడం ఎందుకు అన్నట్టుగా ఉంటుంది అతని ధోరణి. మిస్టర్ అండ్ మిసెస్ 55లో ‘అయ్ జీ దిల్ పర్ హువా ఐసా జాదూ’ పాట చూడండి.
గురుదత్ అసలు పేరు వసంత కుమార్ పడుకోన్. కొంకణి ్రపాంతం వీళ్లది. మంగుళూరు. కోల్‌కతాలో బాల్యం గడిచాక, కాలేజీ చదువు చదివే వీలు లేక, నెలకు 30 రూపాయలకు టెలిఫోన్ ఆపరేటర్‌గా పని చేశాడు. తర్వాత పండిట్ రవి శంకర్ సోదరుడు ఉదయ్ శంకర్ దగ్గర కొరియోగ్రఫీ నేర్చుకున్నాడు. పూణె వెళ్లి ప్రభాత్ స్టూడియోలో ఉద్యోగిగా సినిమా జీవితం మొదలుపెట్టాడు. అక్కడే దేవ్‌ఆనంద్ మొదటి సినిమా ‘హమ్ ఏక్ హై’ చిత్రీకరణ జరిగింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. దేవ్ ఆనంద్ హీరో అయ్యాక గురుదత్‌కు దర్శకుడిగా అవకాశం ఇస్తే ‘బాజీ’ (1951) తీసి క్రైమ్ థ్రిల్లర్స్ ఇలా కూడా తీయొచ్చా అని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. బాజీ సూపర్ హిట్. అప్పటికి గురుదత్ వయసు సరిగ్గా 25 సంవత్సరాలు. ఈ వయసుకే అతడు స్క్రీన్ మీద మాస్టర్ స్టోరీ టెల్లర్ అయ్యాడు.
గురుదత్‌కు ఒక టీమ్ ఉంది. అతడు సినిమా ఇండస్ట్రీలో అందరినీ కలిసే వ్యక్తి కాదు. అందరూ కలవడానికి వీలు ఇవ్వడు. కమెడియన్ జానీ వాకర్, సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి, నటుడు రహెమాన్, రచయిత అబ్రార్ అల్వీ.. ఇలా కొంతమంది మాత్రమే అతనికి దగ్గరగా ఉండగలిగారు. ఈ టీమ్‌తోనే అతడు గొప్ప సినిమాలు తీశాడు. నిర్మించాడు. నటించాడు. గురుదత్‌తో ప్రమేయం ఉన్న సినిమాలు మొత్తం 15. అతను దర్శకత్వం వహించింది కేవలం 8. అయినా సరే నేటికీ అతడు భారతదేశం చూసిన గొప్ప దర్శకుల్లో ఒకడు.
సినిమా నేల విడిచి సాము చేయకపోవడం... వర్తమానంలో ఉండటం... పాత్రలు తమ బలాలు బలహీనతలతో కనపడటం... వాటి మనసుల్లోని వెలుగు నీడల వలే దృశ్యాల్లో కూడా వెలుగు నీడలు పరవడం, మంచి సంగీతం, నటన... న్యాయమైన కొన్ని ఆలోచనల ప్రతిపాదన... అంతే గురుదత్ సినిమాలు. అయినా సరే నిలిచాయి. మిస్టర్ అండ్ మిసెస్ 55లో అతడు కార్టూనిస్టుగా కనిపిస్తాడు. ఆ రోజుల్లో కార్టూనిస్టును హీరోగా ఊహించగలమా? ప్యాసా’లో అతడు కవి. ‘కాగజ్ కే ఫూల్’లో సినిమా దర్శకుడు. గురుదత్ తను కళాకారుడు కనుక కళా ప్రపంచంలో ఉండే పాత్రలే అతడి సినిమాలను లీడ్ చేశాయి.
సమాజం వేరు... ఆదర్శం వేరు... ఆదర్శాన్ని చావుదెబ్బ తీయడమే సమాజం పని... ఇక ఆదర్శవంతమైన కళను అది ఎంత హేళన చేయాలో అంతా చేస్తుంది. ఎందుకంటే ఆదర్శాన్ని చూస్తే సమాజానికి భయం. ఆదర్శాన్ని ఊతంగా చేసుకుని విలువలు పాటిస్తే ఐదువేళ్లూ నోట్లోకి వెళ్లవు. డబ్బులు రాలవు. మేడలు నిలవవు. కాని ఆదర్శం అంటే తనకు ఇష్టమని చెప్పుకోవడానికి సమాజం నటిస్తుంటుంది. ఆ నటన మీద గురుదత్ గట్టిగా ప్రకటించిన నిరసన, ఊసిన ఉమ్ము ప్యాసా’. గురుదత్, వహీదా రహెమాన్, సాహిర్ లూధియాన్వీ, ఎస్.డి.బర్మన్, వి.కె.మూర్తి... వీరందరి ఉత్కృష్ట కళాప్రకటన అది.
ఈ సినిమాతో వచ్చిన ఖ్యాతితో గురుదత్ తీసిన మరో క్లాసిక్ ‘కాగజ్ కే ఫూల్’. అయితే రాజ్ కపూర్‌కు ‘మేరా నామ్ జోకర్’ వల్ల ఏం జరిగిందో గురుదత్‌కు ‘కాగజ్ కే ఫూల్’ వల్ల అదే జరిగింది. కాలం కంటే ముందు తీసిన ఈ సినిమా గురుదత్‌ను ఆ రోజుల్లో ఫెయిల్యూర్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. 18 లక్షలు నష్టం. సినిమా ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్‌లు ఎలా ఉంటాయో ఇగోలు మనుషుల్ని ఎలా బలిచేస్తాయో చూపిన ఈ సినిమా నేడు కల్ట్ క్లాసిక్‌గా నిలిచినా గురుదత్‌ను దర్శకత్వం కుర్చీని వదిలిపెట్టేలా చేసింది.
గురుదత్ ఆ తర్వాత కూడా ‘చౌదవీ కా చాంద్’, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’లను నటించి, నిర్మించి చాలా డబ్బు చేసుకోగలిగాడు. అతడు ఆర్థిక కష్టాల వల్ల చనిపోలేదు. ఆత్మిక కష్టాల వల్ల వెళ్లిపోయాడు. 39 ఏళ్లకు 1964లో మరణించినా నేటికీ గురుదత్ ఫెస్టివల్స్ జరుగుతూనే ఉన్నాయి. గురుదత్ సినిమాలు పాఠ్యాంశాలుగానే ఉన్నాయి. గురుదత్ మరో వందేళ్లు ఉంటాడు. – కె.
కళ సరే... ఇంటి మాట ఏమిటి?
గురుదత్‌ను ఎవరో నిర్మాత ‘మిస్సమ్మ’ సినిమా చూడమని హైదరాబాద్‌కు పిలిపించాడు. గురుదత్‌కు నచ్చితే హిందీలో రీమేక్ చేయించాలని. హైదరాబాద్‌కు వచ్చిన గురుదత్‌కు ‘మిస్సమ్మ’ నచ్చలేదు కాని అంతకుముందు సంవత్సరం రిలీజై హిట్ అయిన ‘రోజులు మారాయి’లో డాన్స్ చేసి గుర్తింపు పొందిన వహీదా రహెమాన్‌ను పరిచయం చేస్తే ఆమె నచ్చింది. నాలుగు సినిమాల కాంట్రాక్ట్ మీద బొంబాయి తీసుకెళ్లిన గురుదత్ ఆమెను ‘సి.ఐ.డి’ నుంచి ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ వరకూ గట్టి పాత్రలు ఇచ్చి ఆమె కెరీర్‌ను కుదుట పరిచాడు. ఆ పరిచయం అతని వివాహ జీవితంలో దుమారం రేపింది.
అప్పటికే ప్రసిద్ధ గాయని గీతాదత్‌ను వివాహం చేసుకుని, ముగ్గురు పిల్లల తండ్రి అయిన గురుదత్ అటు ఆమె నిరసనను, ఇటు వహిదా పట్ల ఆకర్షణను నిర్వహించలేక చతికిల పడ్డాడు. గురుదత్ వల్ల గీతాదత్ గాయనిగా తన కెరీర్‌ను పోగొట్టుకుంది. ఒక గొప్ప గాయని భర్తగా ఆమెను ఎలా చూసుకోవాలో గురుదత్‌కు తెలియలేదు. అలాగే సాటి నటీమణి ఆకర్షణ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలియలేదు.
ఈ కారణం చేత గురుదత్ అకాలమరణం సంభవించింది. ఇతను మరణించిన రెండేళ్లకే గీతాదత్ మరణించింది. ముగ్గురు పిల్లలు అనాథలవగా వారిలో ఒక కుమారుడు తర్వాతి కాలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కెరీర్‌ను, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ఎక్కడ దేనికి విరామం ఇవ్వాలో తెలుసుకుని జీవించకపోతే ఎవరైనా ఒడిదుడుకులు ఎదుర్కొనక తప్పదు అని గురుదత్ జీవితం విలువైన పాఠం చెబుతూనే ఉంటుంది. వక్త్ నే కియా క్యా హసీన్ సితమ్ హమ్ రహే నా హమ్ తుమ్ రహే నా తుమ్