బీచ్‌లో కలిశారు.. ‘గ్రీన్‌ వెడ్డింగ్‌’తో ఒక్కటయ్యారు | Green wedding concept in visakhapatnam couples | Sakshi
Sakshi News home page

బీచ్‌లో కలిశారు.. ‘గ్రీన్‌ వెడ్డింగ్‌’తో ఒక్కటయ్యారు

Oct 30 2025 8:42 AM | Updated on Oct 30 2025 8:45 AM

Green wedding concept in visakhapatnam couples

పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్‌మైనా’ ఏర్పాటు 

మైదాన్‌ సాఫ్‌ పేరుతో విశాఖ, తదితర 

క్రికెట్‌ స్టేడియాల్లో పరిశుభ్రత  

2018.. ముంబయిలో బీచ్‌ క్లీనింగ్‌ జరుగుతోంది. చాలామంది యువత కార్యక్రమంలో పాల్గొని ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ.. ఓ యువకుడు, యువతి మాత్రం.. నిజాయతీగా బీచ్‌లో చెత్తను పోగేస్తూ.. మొదటి సారి కలుసుకున్నారు. ‘నా పేరు అశ్విన్ మాల్వాడే.. మర్చంట్‌ నేవీలో ఫస్ట్‌ ఆఫీసర్‌’ అని యువకుడు, ‘నా పేరు నుపూర్‌ అగర్వాల్‌.. మార్కెట్‌ రీసెర్చర్‌’ అని యువతి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మాటలు కలిశాయి.. మనసులు దగ్గరయ్యాయి. పర్యావరణంపై ఉన్న ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఓ స్నేహితుడి వివాహంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఆహార వృథా చూసి చలించిపోయారు. తమ పెళ్లిని పర్యావరణ హితంగా.. ‘గ్రీన్‌ వెడ్డింగ్‌’ కాన్సెప్ట్ లో చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే ‘గ్రీన్‌మైనా’స్వచ్ఛంద సంస్థ రెక్కలు తొడిగింది. తమ పెళ్లి నుంచి మొదలుపెట్టిన గ్రీన్‌ వెడ్డింగ్‌ కాన్సెప్ట్ ను ముంబయితో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. ఇప్పుడు క్రికెట్‌ మైదానాల్లో చెత్తపై సమరం ప్రారంభించారీ పర్యావరణ జంట.  

సాక్షి, విశాఖపట్నం: 2019 డిసెంబర్‌లో అశ్విన్, నుపూర్‌ పెళ్లి పూర్తిగా ప్లాస్టిక్‌ రహితంగా జరిగింది. తమ పెళ్లి వేడుకలు సున్నా కర్బన ఉద్గారాలుగా ఉండాలని వెడ్డింగ్‌ ప్లానర్లని కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో వీరే వెడ్డింగ్‌ ప్లానర్లుగా మారి.. సమాజానికి సరికొత్త వివాహాన్ని పరిచయం చేశారు. ఆ పెళ్లిలో వాడిన ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనదే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతితో నేసిన కాటన్‌ దుస్తుల్నే పెళ్లిలో ధరించారు. నుపూర్‌ తన వెడ్డింగ్‌ లెహెంగాపై ‘బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌.. సేవ్‌ ది ప్లానెట్‌’అని.. అశ్విన్ ‘క్లైమేట్‌ క్రైసిస్‌.. బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌’అని నినాదాలు రాసి ధరించారు. అలంకరణకు తాజా పువ్వులు, గాజు సీసాలు, పునర్వినియోగం కాగితాలు వాడారు. మట్టి కప్పులు, వెదురు స్పూన్లు ఉపయోగించారు. పెళ్లి పత్రికను సైతం నాటితే మొక్కలు మొలిచేలా విత్తనాలతో తయారుచేశారు. ఊరేగింపునకు ఎలక్ట్రిక్‌ కారు వాడారు. పెళ్లికి ప్లాస్టిక్‌ వస్తువులు బహుమతిగా తేవద్దని కార్డులోనే ముద్రించారు. ఇలా జరిగిన అశ్విన్, నుపూర్‌ వివాహం అందరినీ ఆకట్టుకుంది.  

‘గ్రీన్‌మైనా’ఆవిర్భావం 
తమ ఇంట్లో పెళ్లి కూడా ఇలాగే చేయాలంటూ చాలా మంది అశ్విన్, నూపూర్‌ జంటను సంప్రదించారు. తమ పెళ్లి స్ఫూర్తితో, పర్యావరణ హిత వివాహాలను ప్రోత్సహించడానికి వారు ‘గ్రీన్‌మైనా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి 2020లో గ్రీన్‌ వెడ్డింగ్‌ కాన్సెప్ట్‌ని ముంబయికి పరిచయం చేశారు. తర్వాత కోవిడ్‌ వచ్చినా.. క్రమంగా దేశ వ్యాప్తంగా గ్రీన్‌ వెడ్డింగ్‌ కార్యకలాపాలు విస్తరింపజేశారు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు ముంబయి, ఢిల్లీ, రాయ్‌పూర్, జైపూర్, బెంగళూరు వంటి నగరాల్లో 50కి పైగా వివాహాలు జరిపించారు. 2022లో రాయ్‌పూర్‌లో జరిగిన ఓ పెళ్లిలో 1,225 కిలోల తడి చెత్తను, 800 కిలోల ప్లాస్టిక్‌ను భూమిపైకి రాకుండా కాపాడారు. మిగిలిన ఆహారాన్ని 1,200 మందికి పంచారు. నూతన దంపతులతో 50 చెట్లు నాటించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 10 మంది ప్రధాన సభ్యులు ఉండగా.. పదుల సంఖ్యలో వలంటీర్లు చేరారు.  

మైదాన్‌ సాఫ్‌.. క్రికెట్‌ స్టేడియంలే లక్ష్యంగా.. 
క్రికెట్‌ అభిమానులైన ఈ జంట.. ఓ రోజు ముంబయిలో జరిగిన ఒక క్రికెట్‌ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లారు. అక్కడ మ్యాచ్‌ల తర్వాత పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను గమనించారు. పారిశుధ్య కార్మికులకు చెత్త విభజనపై అవగాహన లేకపోవడంతో ‘మైదాన్‌ సాఫ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మున్సిపాలిటీలు, రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్లతో మాట్లాడి మైదాన్‌ సాఫ్‌ అమలుకు మార్గం సుగుమం చేసుకున్నారు. 2023 ఐసీసీ ప్రపంచ కప్‌ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐసీసీ, బీసీసీఐ మద్దతుతో.. కోకా–కోలా ఇండియాతో కలిసి ఇప్పుడు 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేస్తున్నారు. నవీ ముంబయి, గౌహతి, ఇండోర్, విశాఖపట్నంలోని స్టేడియాల్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు, తడి చెత్తను కంపోస్టింగ్‌కు పంపారు. పంపుతు న్నారు. 2030 నాటికి దేశంలో జరిగే పెద్ద కార్యక్రమాలన్నిటినీ వ్యర్థ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని గ్రీన్‌ దంపతులు చెబుతున్నారు.

గ్రీన్‌మైనా ఇంపాక్ట్‌ ఇదీ  
గ్రీన్‌మైనా సంస్థ ద్వారా గ్రీన్‌ వెడ్గింగ్స్, మైదాన్‌ సాఫ్‌ వంటి కార్యక్రమాలతో పర్యావరణంపై అశి్వన్, నుపూర్‌ దంపతులు గణనీయమైన ప్రభావాన్ని చూపారు. ఆ ఫలితాలను పరిశీలిస్తే..  

కర్బన ఉద్గారాల నియంత్రణ 2,39,000 కిలోలు 

నాటిన మొక్కల సంఖ్య 5,860 

ఆహార పంపిణీ(మిగిలిన ఆహారం) 12,000 మందికి 

పొడి చెత్త రీసైక్లింగ్‌    30,750 కిలోలు 

తడి చెత్త కంపోస్టింగ్‌    41,155 కిలోలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement