
యురేనియం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ రేడియో ధార్మిక శక్తి గల పదార్థం రేడియం. ఈ రెండు పదార్థాలు అప్రయత్నంగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలను వెదజల్లుతూ ఉంటాయి. వీటిలో గామా కిరణాలు ఎక్కువ శక్తి కల్గి ఉంటాయి. ఈ మూలకాల ధర చాలా ఎక్కువ. 1935లో ఎర్నెస్ట్ లారెన్స్ కృత్రిమ రేడియో ధార్మిక పదార్థం రేడియో సోడియాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఇటువంటి రేడియో ధార్మిక పదార్థాలు వెయ్యికి పైగా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ గామా కిరణ జనకాలే.
ఈ విశాల విశ్వంలో నక్షత్రాల విస్పోటనం వల్ల గామా కిరణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి భూమిని చేరకుండా ఆకాశంలో ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఈ గామా కిరణాలు భూమిని జేరి మనిషి మీద పడితే అవి పడే డోసును బట్టి మనిషి రకరకాల ఆపదలకు గురవుతాడు.
ఎక్స్ కిరణాలకన్నా గామా కిరణాలకు చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువ. సులువుగా ఈ కిరణాలు ఎదిగే మొక్కల అంతర్భాగంలోకీ, జంతువుల ధాతువుల్లోకీ దూసుకుపోగలవు. గామా కిరణాలు మొక్కల మీద పడితే అవి వేగంగా ఎదుగుతాయి, దిగుబడి పెరుగుతుంది. పొలాల్లో పంట లను నాశనం చేసే ఎలుకలు ఈ కిరణాల ధాటికి మరణిస్తాయి. మొక్కలకు వచ్చే చీడ, పీడ, పురుగులు, తెగుళ్లు ఈ గామా కిరణాల తాకిడికి దరిజేరవు. మనిషి తట్టుకోలేని ఈ కిరణాలను ధాన్యం తట్టుకోగలదు. పంట పొలాలపై ఈ కిరణాలు పడటం వల్ల పంట కాల వ్యవధి తగ్గుతుంది. దిగుబడి పెరుగుతుంది. పంట నాణ్యత గణనీయంగా పెరుగుతుంది. ఇంకా ప్రయోగ దశలోఉన్న ఈ విధానం రైతులకు అందుబాటులోకి రావాల్సి ఉంది.
మెదడు లోని కణితులు, గాయాలు, ధమనుల వైఫల్యాలు, ట్రెజిమినల్, న్యూరల్జియా, ఇతర పరిస్థితులకు చికిత్స చేయడంలో ‘గామా నైఫ్’ అనే పరికరం సహాయ పడుతుంది. ఇది కోబాల్ట్ –60 రేడియేషన్ మూలాల నుండి వచ్చే గామా కిరణాలను ప్రత్యేకమైన పద్ధతిలో కేంద్రీకరించి నిర్దిష్ట ప్రాంతాలకు పంపడంలో సహకరిస్తుంది. దీని సహాయంతో కచ్చితమైన మోతాదులు వైద్యుడు పంపగల్గుతాడు.
రోగికి సమస్య ఉన్న స్థానం, గాయం రకం, ప్రక్రియ సమయంలో రోగి సాధారణ ఆరోగ్యం, ఇతర కారకాలపై గామా నైఫ్ విజయం ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇది మెదడులోని సమస్యలను సరి చేయగల ఒక సాంకేతికత. చికిత్సలో భాగంగా రోగి తల కదలకుండా ఒక ఫ్రేమ్ కట్టి గామా కిర ణాలు ఎక్కడ పడాలో పర్యవేక్షిస్తారు. రోగికి నొప్పి లేకుండా, మెలకువగా ఉండగానే కొన్ని గంటల్లో ఈ చికిత్స పూర్తి అవుతుంది. శరీరంపై ఎటువంటి కోతలు ఉండవు.
గామా కిరణాలు ప్రభావిత ప్రాంతాలకు అధిక మోతాదులోనే వెడతాయి. చుట్టుపక్కల కణజాలానికి తక్కువ హాని మాత్రమే జరుగుతుంది. ఈ చికిత్స వైద్యుడు మాత్రమే నిర్వహించాలి. రోగులు ఈ చికిత్స పూర్తి అయిన తరువాత ఇంటికి వెళ్లిపోవచ్చు. ఈ చికిత్స అనంతరం కొంతమందికి కొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. తల నొప్పి, వికారం, వాంతులు, తిమ్మిర్లు, చుట్టుపక్కల జుట్టు రాలిపోవడం, బలహీనత, దృష్టి సమస్యలు రావచ్చు. ప్రతి సమస్యకు వైద్యుని సలహా మేర మందులు వాడితే పరిష్కారం లభిస్తుంది.
-డా. సీ. వీ. సర్వేశ్వర శర్మ
కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు