ఫాస్ట్‌ట్యాగ్‌ | Funday Crime Story | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ట్యాగ్‌

Aug 3 2025 7:51 AM | Updated on Aug 3 2025 7:51 AM

Funday Crime Story

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కేతావత్‌ చందు రాథోడ్‌ కళ్లల్లో కారం కొట్టి, కాల్చి చంపిన కేసులో నిందితులను సౌత్‌ ఈస్ట్‌ జోన్‌  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. 2025 జూలై 15న హైదరాబాద్‌లో ఈ హత్య చేసి, వేర్వేరు ప్రాంతాలకు పారిపోయిన దుండగులు నాలుగు రోజుల్లోనే చిక్కడంలో ఓ కారుకు సంబంధించిన ఫాస్ట్‌ట్యాగ్‌ కీలకంగా మారింది. ఈ హంతక ముఠా అరెస్టుతో విశాఖపట్నంలోని గాజువాక షీలానగర్‌లో జరిగిన భారీ చోరీ కేసు కూడా కొలిక్కి వచ్చింది. ఈ ముఠాలోని ఇద్దరు అక్కడి వెంకటేశ్వర కాలనీలో నివసించే ఎల్‌ఐసీ ఉద్యోగి ఎస్‌.శ్రీనివాస్‌ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితులని తేలింది. ఆ ఇంట్లో వీళ్లు 700 గ్రాముల బంగారం, మూడు కేజీల వెండి నగలు, వస్తువులతో పాటు రూ.20 లక్షల నగదు తస్కరించారు.

సీపీఐ ఎంఎల్‌ తెలంగాణ సెక్రటరీ రాజన్న అలియాస్‌ రాజేష్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో ఉంటున్నాడు. ఇతడికి నాలుగేళ్ల కిందట చందు నాయక్‌తో పరిచయమైంది. ప్రభుత్వ, భూదాన్‌ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించడంతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో వీరి మధ్య స్పర్థలు వచ్చాయి. చందును హత్య చేయడానికి రాజన్న గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరికి సుపారీ ఇచ్చినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాజన్న ఈసారి తన అనుచరులు ఏడుకొండలు, శ్రీను, కందుకూరి ప్రశాంత్‌లతో పాటు ఏడుకొండలుకు పరిచయం ఉన్న నెల్లూరుకు చెందిన అర్జున్, రాంబాబులతో కలిసి రంగంలోకి దిగాడు. ఉప్పల్‌ భగాయత్‌లోని హోటల్‌ సైలాలో గది బుక్‌ చేసి ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్‌లను అందులో ఉంచాడు.  

షీలానగర్‌లో 2025 జూలై 12న చోరీ చేసిన అర్జున్, రాంబాబు అక్కడ నుంచి తమ వాటాగా వచ్చిన సొత్తు, నగదుతో కాకినాడ వెళ్లారు. అక్కడ కారు బుక్‌ చేసుకుని, అందులోనే హైదరాబాద్‌ వచ్చి గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. అక్కడ నుంచి బయలుదేరి 13వ తేదీ రాత్రి క్యాబ్‌లో హోటల్‌ సైలాకు వచ్చి ఏడుకొండల్ని కలిశారు. మర్నాటి ఉదయం హత్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాక తిరిగి వెళ్లిపోయారు. తర్వాతి రోజు తెల్లవారుజామున (2025 జూలై 15) వీళ్లు ఉప్పల్‌ భగాయత్‌కు రాగా; అక్కడే ఉన్న రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్‌లతో కలిసి ఓ కారులో వెళ్లి మలక్‌పేటలోని శాలివాహన నగర్‌ పార్కు వద్ద చందును కాల్చి పంపారు. వాకింగ్‌ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన చందుపై తొలుత అర్జున్, శ్రీను కాల్పులు జరిపారు.

అతడు చనిపోయాడో, లేదో అనే సందేహంతో రాజన్న కూడా అర్జున్‌  నుంచి తుపాకీ తీసుకుని మరోసారి కాల్చాడు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్‌ కారులో వచ్చినట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ కారును ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న ఏడుకొండలు హత్యానంతరం తిరిగి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ కారుకు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చి ఉండగా, దాని వివరాలన్నీ ఏజెన్సీ యజమాని ఫోన్‌లో నమోదవుతాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడి ఫోన్‌లోని వివరాలను విశ్లేషించి, ఏడుకొండలు అద్దెకు తీసుకున్న నాటి నుంచి కారు ఎక్కడెక్కడ సంచరించిందో గుర్తించారు. ఇలా పోలీసులకు భగాయత్‌లోని హోటల్‌ సైలా వివరాలు తెలిశాయి. అక్కడకు వెళ్లిన దర్యాప్తు అధికారులు అర్జున్, రాంబాబు గచ్చిబౌలి నుంచి అక్కడకు వచ్చిన క్యాబ్‌ నంబరు గుర్తించారు.

ఆ నంబర్‌ ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్‌హౌస్‌ను గుర్తించారు. అక్కడే టాస్క్‌ఫోర్స్‌ బృందానికి వాళ్లు వినియోగించిన కాకినాడ ట్యాక్సీ నెంబర్‌ దొరికింది. చందు హత్య తర్వాత ఆరుగురూ ఉప్పల్‌ నుంచి ఇదే వాహనంలో బీబీనగర్, వలిగొండ, ఖమ్మం మీదుగా కోదాడ చేరుకున్నారు. ఆ సమీపంలోని చిలుకూరు వద్ద కారు దిగిన రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్‌ జనగాం పారిపోయారు. అర్జున్, రాంబాబు అదే కారులో విజయవాడ వెళ్లి, ట్యాక్సీని పంపేశారు. తమ వద్ద ఉన్న సొత్తు విక్రయించడం విజయవాడలో సాధ్యం కాకపోవడంతో అట్నుంచి మచిలీపట్నం వెళ్లి ప్రయత్నించారు. అక్కడా కుదరకపోవడంతో నెల్లూరు వెళ్లిపోవాలని భావించారు. దీంతో మరోసారి కాకినాడ నుంచి అదే ట్యాక్సీ పిలిపించి మచిలీపట్నం నుంచి బయలుదేరారు.

రాజన్న, ఏడుకొండలు, ప్రశాంత్, శ్రీను ఫోన్లూ స్విచాఫ్‌లో ఉండటంతో సాంకేతిక నిఘా సాధ్యం కాలేదు. అర్జున్, రాంబాబు నంబర్లు పోలీసుల వద్ద లేవు. దీంతో కాకినాడ ట్యాక్సీ నంబర్‌ ఆధారంగా సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాని ఫాస్ట్‌ట్యాగ్‌ వివరాలను సంగ్రహిచడం మొదలెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ టోల్‌గేట్‌ను ఆ వాహనం దాటినా తెలిసేలా జాతీయ రహదారుల సంస్థతో పాటు టోల్‌గేట్స్‌ నిర్వాహకులతో అనుసంధానం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే ఓ బృందం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంత్లాలో గాలిస్తోంది. 2025 జూలై 19 తెల్లవారుజామున ఆ ట్యాక్సీ మచిలీపట్నం నుంచి నెల్లూరుకు బయలుదేరింది. ఆ మార్గంలోని టోల్‌గేట్‌లు దాటినప్పుడల్లా టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం వచ్చింది.

 వీటి ఆధారంగా వాహనం విజయవాడ దాటి చెన్నై జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బృందాన్ని అప్రమత్తం చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కావలి పంపి అర్జున్, రాంబాబు ప్రయాణిస్తున్న వాహనం నంబర్‌ చెప్పారు. అక్కడి చెక్‌పోస్టు సిబ్బంది సహకారంతో ఈ వాహనాన్ని ఆపిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో జనగాంలో దాక్కున్న రాజన్న, ఏడుకొండలు తదితరులను పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement