
వేసవి అనగానే మనకు గుర్తొచ్చేది.. మండే ఎండలు, కారే చెమటలు, పిల్లల అల్లరి. కానీ వేసవి అంటే కేవలం ఈ వాతావరణ మార్పు మాత్రమే కాదు; మన ఆలోచనలను, భావోద్వేగాలను, ప్రవర్తనలను మార్చే ఒక సీజనల్ సైకలాజికల్ స్టిములస్ కూడా. ఈ వేసవి మన మనసుపై, మానసిక స్థితిపై కలిగించే ప్రభావం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు తెలుసుకుందాం.
1. సూర్యకాంతి పెంచే సంతోషం
వేసవిలో పెరిగిన సూర్యకాంతి మన శరీరంలో విటమిన్–డి స్థాయిని పెంచుతుంది. ఇది మెదడులో సెరటోనిన్ అనే ముఖ్యమైన న్యూరోకెమికల్ స్థాయిని పెంచుతుంది. సెరటోనిన్ ఒక ఫీల్ గుడ్ కెమికల్. ఇది శరీరంలో మూడ్ బ్యాలెన్సింగ్, నిద్ర, ఆకలి, సామాజిక ప్రవర్తనలపై ప్రభావం చూపుతుంది. మానసిక స్థైర్యానికి ఒక పునాదిలా ఉంటుంది.
మానసిక శక్తి, ఉత్సాహం, జీవితానికి అర్థాన్ని తీసుకు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వేసవిలో మనకు ‘ఏదో కొత్తగా చేద్దాం’ అనే మైండ్‌సెట్ కలుగుతుంది. అందుకే ఎక్కువ వెలుతురు వాతావరణంలో జీవించే వ్యక్తులలో డిప్రెషన్ స్థాయులు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
2. మానసిక సంబంధాల పునరుజ్జీవం...
వేసవి అనేది సహజ సంబంధాల కాలం. కలుసుకోవడానికి, పంచుకోవడానికి, బయటికి వెళ్లేందుకు ఇదొక మంచి సీజన్. పెళ్లిళ్లు, పండుగలు, పర్యటనలు– ఇవన్నీ సామాజిక బంధాలను బలపరుస్తాయి. ఈ సమయంలో మెదడులో డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.
ఇది మనలో ఆనందాన్ని, బంధాన్ని పెంచుతుంది. అంతేకాదు ఈ వేసవిలో మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది. ‘నేను ఎవరు?’, ‘నాకు ఏం కావాలి?’ అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం ఆలోచించగలిగే అవకాశమే వేసవి.
3. చిన్ననాటి జ్ఞాపకాల చల్లదనం...
చిన్నప్పటి వేసవి జ్ఞాపకాలు మనలో భద్రత, ప్రేమ, స్వేచ్ఛ అనే భావాలను తిరిగి మేల్కొలుపుతాయి. ఈ ప్రక్రియను సైకాలజీలో ‘నాస్టాల్జిక్ రిట్రీవల్ ఫర్ ఎమోషనల్ బ్యాలెన్స్’ అంటారు. నాస్టాల్జియా వల్ల మానసిక ఒత్తిడి తక్కువ అవుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. మనిషిగా మన విలువను గుర్తించగలుగుతాం. ఇలాంటి అనుభూతులను డైరీలో రాయడం ద్వారా మానసికంగా మరింత భద్రతా స్థితిలోకి వస్తాం.
4. పెరిగే మానసిక అలసట...
ఎండ ఎక్కువగా ఉండటం, హ్యూమిడిటీ పెరగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో మార్పులు వస్తాయి. ఇది మన శరీరాన్ని త్వరగా అలిసిపోయేలా చేస్తుంది.
ముఖ్యంగా అడ్రినల్ గ్లాండ్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సందర్భాల్లో మెదడులో ‘ఓవర్‌హీట్ అయిన కంప్యూటర్’ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒత్తిడితో నిండిన మైండ్ క్లారిటీ కోల్పోతుంది. అందుకే వేసవిలో మనసు చురుకైనట్టే అనిపించినా, లోపల చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకూ ఎండ పొడ లేకుండా చూసుకోండి.
5. నిద్రలేమి నుండి నిరాశ వరకూ...
వేసవిలో పగలు, వెలుతురు ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోని పైనీయల్ గ్రంథి మెలటోనిన్‌ను తక్కువగా విడుదల చేస్తుంది. మెలటోనిన్ అనేది మెదడులో నిద్ర ప్రారంభానికి అవసరమైన హార్మోన్. ఇది తక్కువగా ఉత్పత్తి అయితే మంచి నిద్ర ఉండదు.
ఉదయం అలసట ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి ఉన్న వ్యక్తులలో ఎమోషనల్ రెగ్యులేషన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు చిన్న చిన్న విషయాల్లో కూడా అసహనానికి లోనవుతారు.
వేసవిలో చేయాల్సిన పది పనులు
రోజూ ఉదయం 15 నిమిషాలు సూర్యకాంతిలో గడపండి. దీనివల్ల సెరటోనిన్ స్థాయులు పెరిగి మూడ్ మెరుగవుతుంది.
ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవండి. మీ ఛిజీటఛ్చిఛీజ్చీn టజిy్టజిఝ ‘సర్కాడియన్ రిథమ్’ స్థిరపడుతుంది.
రోజుకు కనీసం 30 నిమిషాలు మీ ఫోన్‌కు బ్రేక్ ఇవ్వండి.
మీ ఆలోచనలను రాయండి, మీ అంతరంగాన్ని తేలిక చేయండి.
తేలికపాటి వ్యాయామాలతో నెగటివ్ బాడీ ఇమేజ్ నుంచి బయట పడండి.
వారానికోసారైనా ప్రకృతిలో నడవండి, ప్రయాణించండి.
నచ్చిన పుస్తకాలు చదవండి, మనసుకు హాయిగా ఉంటుంది.
సంగీతం, నృత్యం, పెయింటింగ్‌లాంటి కొత్త హాబీని ప్రారంభించండి.
మీ బంధాలను రివ్యూ చేసుకుని, వాటిని బలపరచుకోండి.
రోజుకు కనీసం పది నిమిషాలు మౌనంగా కూర్చుని మీ మనసు చెప్పే మాటలు వినండి.
సైకాలజీ విశేష్
(చదవండి: ఏఐ దేవత..! కష్టసుఖాలు వింటుంది, బదులిస్తుంది కూడా..)