
‘మనం బొజ్జలనే కాదు.. అందమైన ఆకృతితో కూడిన కండలను పెంచగలం.. అయితే దీనికి సరైన సమయంలో సరైన మార్గనిర్దేశం అవసరం. అప్పుడే సాధన ఫలితాలనిస్తుంది.. కండలు పెంచేందుకు జెనిటిక్స్‌తో ఎలాంటి సంబంధం లేదు. బాడీ బిల్డింగ్‌పై ఉన్న అపోహలు, తెరలు తొలగిపోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మనం సత్తా చూపించగలం’ అని సినీనటుడు అల్లు శిరీష్ అన అభిప్రాయాన్ని వెల్లడించారు.
శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్‌లో ‘డెక్కన్ అప్రైజింగ్–2025 పేరిట ఐసీఎన్ (ఐ కాంపీట్ నేచురల్) సంస్థ నిర్వహించిన సహజసిద్ధ శరీర దృఢత్వ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను, నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం ఫిట్‌నెస్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
గుర్తింపు అవసరం..
ప్రపంచస్థాయిలో బాడీ బిల్డింగ్‌కి మంచి గుర్తింపు ఉంది. ఇందులో రాణించిన అథ్లెట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మన దేశంలో మాత్రం బాడీ బిల్డర్లు కోచ్‌లుగా మాత్రమే మిగిలిపోతున్నారు. క్రికెట్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు మన దేశంలో ఇచ్చిన ప్రాధాన్యత బాడీబిల్డింగ్‌కు కూడా దక్కేలా చర్యలు తీసుకోవాలి.
అనేక అపోహలు..
శరీర దారుఢ్యానికి మందులు, స్టిరాయిడ్లు వాడతారనే అపోహల కారణంగా చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. అవేవీ అవసరం లేకుండా కూడా సరైన సమయంలో సరైన కోచ్ ద్వారా శిక్షణ తీసుకుని సాధన చేస్తే అంతర్జాతీయ అథ్లెట్లను తయారు చేసుకోవచ్చు.. ఐసీఎన్ లాంటి సంస్థలు ఆ దిశగానే కృషి చేస్తున్నాయి..
అందుకే ఎంతో ఇష్టంతో గత రెండేళ్లుగా ఇక్కడికి వచ్చి అథ్లెట్లను ప్రొత్సహిస్తున్నాను. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల మంది యువత ఈ పోటీల్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మన వద్ద కూడా ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
నాకు తగ్గ కథ వస్తే..
కండలు పెంచేందుకు జన్యుపరమైన సంబంధాలేవీ లేవు. ఫిట్‌నెస్‌కు రాంగ్‌రూట్, షార్ట్‌కట్స్ ఎంత మాత్రం సరైంది కాదు. శరీర తత్వం బట్టి బొజ్జలు వస్తాయనే ప్రచారం సరికాదు. సహజంగానే ఫిట్‌నెస్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఎత్తు, బరువు, ఆకృతికి అనువైన మంచి స్పోర్ట్స్ కథ వస్తే అలాంటి సినీమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పటి వరకూ వచ్చిన క్రికెట్, రన్నింగ్, ఫుట్‌బాల్ వంటి కథలు కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది.
(చదవండి: ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!)