
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
మన సమాజంలో దగ్గు, జలుబు, జ్వరం, షుగర్, బీపీ అంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కానీ డిప్రెషన్, ఆందోళన, పానిక్ అటాక్, డీ–పర్సనలైజేషన్ లాంటి వాటిని బలహీనతలు లేదా అలసత్వంగా చూస్తారు. అవేవో బాధితులు కావాలని తెచ్చిపెట్టుకున్నట్టు భావిస్తారు. కానీ నిజానికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమే. ఇవి రెండూ పరస్పర ఆధారితాలు.
తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జీర్ణ సంబంధ ఇబ్బందులు, గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం, ముఖ కండరాలు అదరడం, చర్మం పాలిపోవడం లాంటి శారీరక లక్షణాల ద్వారా మానసిక వ్యాధులు వ్యక్తం అవుతాయి. అంటే, మనసు తాను అనుభవించే హింసను గుర్తించమని, త్వరగా ఈ బాధను తగ్గించే ఉపాయం చూడమని శరీరం ద్వారా వేడుకుంటుంది! కానీ పట్టించుకోం మనం. ఎందుకంటే, బాధితులు ఆ వ్యాధులకు సంబంధించిన మందులు తీసుకుంటే వాటికి బానిసలవుతారని, ఈ వ్యాధులు పూర్తిగా నయం కావనీ. నిజానికి ఇవన్నీ తప్పుడు భావనలు.
మానసిక వ్యాధులు కూడా శారీరక వ్యాధుల్లానే అనేక కారణాల వల్ల రావచ్చు. మెదడు రసాయనాల అసమతుల్యత, వంశపారంపర్యం, ఒత్తిడి, పరిసరాలు వంటి అంశాలు దీనికి కారణం అవుతాయి. కనుగొనదగిన కారణాలు ఏమీ లేకుండా కూడా మానసిక వ్యాధులు రావచ్చు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స చేస్తే, బాధితులు సాధారణ జీవితం గడపవచ్చు.
పిల్లలు, యువకులు, పెద్దలు ఎవరికి అయినా మానసిక సమస్యలు రావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, 2021లో ప్రపంచంలో సుమారు 1.1 బిలియన్ మంది మానసిక వ్యాధుల బారినపడ్డారు (ప్రతి ఎనిమిది మందిలో ఒకరు) అసలు మీరు పని చేసేచోట, సంచరించే చోట మీకు తెలియకుండా ఇప్పటికే ఒకరిద్దరు డిప్రెషన్ తోనో, ఏంగ్జయిటీతోనో వుండి ఉండొచ్చు. రోజువారీ జీవితంలో అవరోధం కలగనంతవరకూ పరవాలేదు. సమస్య వస్తే మాత్రం, దాచుకోవడం కంటే కుటుంబ సభ్యుల, స్నేహితుల, సహకారం తీసుకోవడం, వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం.
అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి, మానసిక ఆరోగ్య సమస్యలు ‘‘నిజమైనవి’’ అనే విషయాన్ని గ్రహించడం, అంగీకరించడం. జ్వరం వస్తే విశ్రాంతి తీసుకుంటాం కదా! అలాగే, మనసు అలసిపోయినప్పుడు, అది బాధపడినప్పుడు కూడా సహాయం కోరడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ధైర్యం, అవగాహన అవసరమయ్యే విషయం. మనసుని ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలు పెట్టుకోవాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్, బ్రీతింగ్ వ్యాయామాలు నేర్చుకోవాలి..
సర్వమానవ సహోదరత్వం, సౌభ్రాతృత్వం గురించి ఉపన్యాసాలు దంచేస్తాం. మనలో అది నిజంగా వుందని నిరూపించుకునే చిన్న అవకాశం ఒకటి ఏమిటంటే, మానసిక వ్యాధులతో బాధపడేవారిని చూసి ఎగతాళిగా నవ్వకుండా, తప్పుగా మాట్లాడకుండా ఉండటం, వాళ్లకి చేతనైన సహాయం చెయ్యడం.
ఆమాత్రం చేయలేమా?
ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల్లో అబ్రహాం లింకన్, ఐజాక్ న్యూటన్, విన్సెంట్ వ్యాన్గో, చార్లెస్ డికెన్స్ నుంచీ మన దీపికా పదుకొనే వరకూ ఎందరో గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీలు మానసిక వ్యాధులతో పోరాడి, సాధారణ స్థాయిని మించి ఉన్నతంగా బతకడమే కాకుండా, తమ ప్రతిభతో లోకానికి ప్రేరణగా నిలిచారు. మానసిక రోగులు చాలావరకు ప్రమాదకారులు కాదు; మందులు వైద్యుని సూచన మేరకు తీసుకుంటే అడిక్షన్ రాదు.
వైష్ణవి గద్దె, వైద్య విద్యార్థిని