పోలికతో ప్రమాదమే ! | Extreme frustration in comparing oneself with others | Sakshi
Sakshi News home page

పోలికతో ప్రమాదమే !

Sep 4 2025 1:31 PM | Updated on Sep 4 2025 1:31 PM

Extreme frustration in comparing oneself with others

విజయవాడకు చెందిన  కార్తిక్‌ ఓ విశ్వ విద్యాలయంలో ఇంజినీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ప్రతి సెమిస్టర్‌లో 9 జీపీఏకు పైగా మార్కులు సాధిస్తున్నాడు. కానీ తనకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారితో పోల్చుకుంటూ ప్రతిసారీ తీవ్ర నిరాశకు లోనై ఆత్మనూన్యతాభావంతో ఉంటున్నాడు. దీంతో తల్లిదండ్రులు గమనించి ఓ సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించారు.  

నగరానికే చెందిన ఇంటర్మీడియెట్‌ విద్యార్థిని ఇన్‌స్టాలో తరచూ పోస్టులు పెడుతుంటుంది. తాను పెట్టిన రీల్స్‌ కంటే, స్నేహితుల రీల్స్‌కు ఎక్కువ లైక్స్, కామెంట్స్‌ వస్తున్నాయి. తనకు తక్కువగా వస్తున్నాయని నిరాశ చెందుతోంది.  

లబ్బీపేట(విజయవాడతూర్పు):  ఇటీవల కాలంలో ఎదుటి వారితో తమను పోల్చుకుంటూ తీవ్ర నిరాశకు గురవుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. చదువు మార్కులు వారితో సమానంగా రావడం లేదని, సోషల్‌ మీడియాలో సైతం లైక్‌లు తనకు తక్కువగా వస్తున్నాయని ఇలా అనేక విషయాల్లో ఎదుటి వారితో పోల్చుకుంటూ ఆత్మనూన్యతా భావానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. వారిలా నేనెందుకు సక్సెస్‌ కాలేక పోతున్నామని కుంగుబాటుకు గురవుతున్నట్లు మానసిక నిపుణులు అంటున్నారు. ఇతరులతో పోల్చుకోవడం ప్రేరణను ఇవ్వకపోగా మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుందంటున్నారు. ఈ సమస్యతో పిల్లలు, విద్యార్థులే కాదు, లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి.   

  1. ఈ పది మార్గాలు పాటించండి.. 
    ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. ‘నిన్న కంటే నేడు ఏం మెరుగయ్యాను’ అని ప్రశ్నించుకుని మీ ప్రోగ్రెస్‌ను గమనించండి.  

  2. సోషల్‌ మీడియా ఒక ఫిల్టర్‌ చేసిన ప్రపంచం. ఇన్‌స్టాగామ్‌లో ఎవరి విజయమూ ఫుల్‌ స్టోరీ కాదు. మీ ప్రయాణం నిజమైనదిగా, నిజాయతీగా ఉంటే చాలు. 

  3. ప్రయత్నం మీద ఫోకస్‌ చేయండి. ఎంతసేపు కష్టపడ్డారు, ఎలా ఫోకస్‌ చేశారన్నదే అసలైన విజయానికి సూచిక. 

  4. మీ బలాల జాబితా తయారు చేసుకోండి. ‘నాలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి...?’ అని రాసుకోండి. 

  5. మైండ్‌ ఫుల్‌ బ్రేకులు తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోండి. పోలిక వల్ల వచ్చే నెగిటివ్‌ భావాల నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ పది నిమిషాల సేపు మైండ్‌ ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్‌ చేయండి. 

  6. పరీక్షలు ఓ పోటీ కాదు, నేర్చుకునే ప్రయాణం అని గుర్తుంచుకోండి. ఫలితాల కోసమే కాకుండా, అభివృద్ధి కోసం చదవండి. 

  7. ఇతరులు చేసిన విమర్శలు మీ విలువకు ప్రమాణం కాదు. ఏదైనా కామెంట్, మెసేజ్‌ వల్ల తక్కువగా ఫీలవకండి. అది వాళ్ల అభిప్రాయం మాత్రమే అని గుర్తించండి.  

  8. మీ సొంత లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండండి. ఇతరులు ఎటు పోతున్నారన్న దానికన్నా, మీరు ఎందుకు చదువుతున్నారన్న దానిపై దృష్టి పెట్టండి. 

  9. తప్పుల నుంచి నేర్చుకోండి. తప్పు చేయడమంటే ఫెయిలవ్వడం కాదు, నేర్చుకునే అవకాశం అనే దృష్టితో చూడండి.  

  10. మీరు వేరెవరిలానో మారాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. మీ బాటలో మీరున్నారని నమ్మండి.  

  • అసలేంటీకంపేరిజన్‌ సిండ్రోమ్‌.. ?  
    మనిషి తనను తాను అర్థం చేసుకునేందుకు ఇతరులతో పోల్చుకుంటాడు. అది సహజం. కానీ టెక్నాలజీ, సోషల్‌ మీడియా, టాప్‌ ర్యాంక్స్, పక్కింటి పిల్లలతో పోలికలు– ఇవన్నీ ఇప్పుడు పిల్లల మనసుల్లో భయాన్ని, ఆందోళనను, న్యూనత భావాన్ని నింపుతున్నాయి.  

  • ఇలా ఇతరులతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోవడమే కంపేరిజన్‌ సిండ్రోమ్‌. 

  • సోషల్‌ కంపేరిజన్‌ సిద్ధాంతాన్ని 1954లో లియోన్‌ ఫెస్టింజెర్‌ అనే సైకాలజిస్ట్‌ ప్రతిపాదించాడు.  

  • మన అసలైన విలువను పక్కన పెట్టి, ఇతరుల ప్రమాణాలతో మన జీవితం నడపడమే దీని లక్షణం. ఈ పోలికలు వాళ్లకంటే తక్కువగా ఉన్నవారితో లేదా మెరుగ్గా ఉన్నవారితో జరగొచ్చు.  

  •  పోలికలు నెగిటివ్‌ దిశలో ఎక్కువగా జరిగితే ఆత్మన్యూనత, అసంతృప్తి, ఆత్మనింద పెరుగుతాయి. 

  • = కంపేరిజన్‌ అనేది ఒక ట్రాప్‌. ఏ రెండు వేలిముద్రలూ ఒకలా ఉండనట్లే, ఏ ఇద్దరు విద్యార్థులూ ఒకేలా ఉండరు, ఒకేలా చదవరు, చదవలేరు. 

  •  ఈ కంపేరిజన్‌ ట్రాప్‌ నుంచి బయటపడితేనే అసలైన ప్రతిభ కనిపిస్తుంది.  

అర్ధవంతమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి..  
పోలిక హానికరమైన ప్రభావాలను గుర్తించడం, మన ప్రత్యేకతను స్వీకరించడం, కృతజ్ఞతను పెంపొందించుకోవడం చేయాలి. అర్థవంతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, మద్దతు ఇచ్చే సమాజాన్ని నిర్మించడం ద్వారా, మనం పోలిక ఉచ్చు నుంచి బయటపడి మన సొంత వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టవచ్చు. 
– డాక్టర్‌ గర్రే శంకరరావు,
సైకాలజిస్ట్‌  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement