
చేపలను తలచుకోగానే చాలామందికి నోరూరే వంటకాలు గుర్తు రావడం సహజమే! కాని, ఇకపై న్యూ ఫ్యాషన్ గుర్తొస్తుంది. అదెలా అనుకుంటున్నారా? త్వరలోనే చేపల చర్మంతో తయారైన అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ సామగ్రి అందుబాటులోకి రానున్నాయి!
అమెరికాలోని ‘కోస్టా డి పజారోస్’ అనే గ్రామానికి చేపల వేట ప్రధాన జీవనాధారం. ఈ గ్రామం పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉంది. ఈ గ్రామస్థులు చేపల వేటకు అనుసరించే ‘బాటమ్ ట్రాలింగ్’ పద్ధతి కారణంగా వీరిపై ఆంక్షలు మొదలయ్యాయి. బాటమ్ ట్రాలింగ్ అంటే పడవ అడుగుభాగంలో ఒక బరువైన వలను కట్టి, అన్ని రకాల చేపలను, సముద్ర జీవులను బయటికి లాగేస్తారు.
ఈ పద్ధతి వల్ల సముద్ర ఆవాసాలు తీవ్రంగా దెబ్బతిని, సముద్ర జలాల్లోని జీవవైవిధ్యం నాశనం అవుతోంది. అందుకే ‘బాటమ్ ట్రాలింగ్’పై ఆంక్షలు పెరిగాయి. దీంతో ఆ గ్రామస్థులు ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యకలాపాలను అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగమే ఈ ఫిష్ ఫ్యాషన్!
చేపల చర్మాన్ని ఉపయోగించి వినూత్న ఫ్యాషన్ ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ గ్రామస్థులు. చేపల చర్మాన్ని శుభ్రం చేసి, ఆకర్షణీయమైన తోలుగా మార్చి, దానితో చెవి పోగులు, నెక్లెస్‌లు, బ్యాగులు వంటి చాలా రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇది సరికొత్త ఫ్యాషన్‌గానే కాదు, స్థానికులకు జీవనోపాధిగా కూడా మారిపోయింది. ‘పీల్ మెరీనా’ అనే సహకార సంస్థ, స్థానిక మహిళలతో కలిసి చేపల చర్మాన్ని పలు ఉత్పత్తులుగా మారుస్తుంది. చేపల వేట ప్రధాన వృత్తిగా ఉన్న ఈ గ్రామస్థులు చేపల చర్మాన్ని పారవేయకుండా ఉపయోగించుకోవడం పర్యావరణానికి కూడా మేలు చేస్తోందంటున్నారు నిపుణులు. చేపల చర్మాన్ని తోలుగా మార్చే ప్రక్రియలో అనేక దశలుంటాయి.
మొదట చేప చర్మాన్ని చేతులతో సున్నితంగా రుద్ది పొలుసులు, చర్మానికి అతుక్కున్న మాంసాన్ని తొలగిస్తారు. ఆ తరువాత, బట్టలు ఉతికినట్లు సబ్బుతో బాగా ఆ చర్మాన్ని కడుగుతారు. అనంతరం, గ్లిజరిన్, ఆల్కహాల్, సహజ రంగులను ఉపయోగించి ఆ చర్మానికి రంగులద్దుతారు. ఈ ప్రక్రియకు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల పాటు ఆ చర్మాన్ని ఎండలో ఆరబెడతారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, చేప చర్మం మృదువుగా, బలమైన తోలులా మారుతుంది. అలాగే వాటికి చేపల వాసన పూర్తిగా పోతుంది.
ఇలా తయారు చేసిన చేపతోలుతో తయారు చేసిన వాటిలో బటర్‌ఫ్లై ఆకారంలో ఉండే చెవిపోగుల జత ధర సుమారు ఏడు డాలర్లు పలుకుతోందంటే, ఈ ఫిష్ ఫ్యాషన్ గిరాకీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేప తోలుతో తయారు చేసిన ఈ ఉత్పత్తులను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయిస్తున్నారు. అంతేకాకుండా, పంటారెనాస్‌లోని చిన్న తరహా వస్త్ర ఉత్పత్తిదారులకు కూడా ఈ తోలును అందిస్తున్నారు. భవిష్యత్తులో బ్యాగులు, పర్సులు, షూలను కూడా తయారుచేయాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు.
చేపల చర్మాన్ని తోలుగా మార్చే ఈ సంప్రదాయం కొత్తది కాదు. అలాస్కా నుంచి స్కాండినేవియా, ఆసియా వరకు అనేక స్థానిక మత్స్యకార తెగలు వేల సంవత్సరాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా ఈ ఉత్పత్తుల అమ్మకం సాగుతోంది. కోస్టా రికా కూడా ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించి, పర్యావరణ పరిరక్షణ ఉత్పత్తులను తయారుచేయడంలో ముందు వరుసలో నిలుస్తోంది.
దీంతో అక్కడి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించడమే కాకుండా, వారి సృజనాత్మకతకు ఒక వేదిక దొరికింది. ఇంటి పనుల నుంచి బయటపడి, చక్కటి ఉపాధిని పొందుతున్న ఈ మహిళలు, తమ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో చూడాలని ఆశిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా చక్కని మార్గం.