సైకిల్‌పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ! | Divya Singh is the first Indian woman to cycle to Mount Everest Base Camp | Sakshi
Sakshi News home page

సైకిల్‌పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!

Apr 17 2026 1:39 PM | Updated on Apr 17 2026 2:16 PM

Divya Singh is the first Indian woman to cycle to Mount Everest Base Camp

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్‌ ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ను (17,560 అడుగుల ఎత్తులో ఉన్న) సైకిల్‌పై చేరుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది దివ్యసింగ్‌. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సాహసాన్ని చేసిన రెండో మహిళగా దివ్య చరిత్ర సృష్టించింది. అంతేగాదు ఆ సమయంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద ఉష్ణోగ్రత -12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 

మార్చి 16న కాఠ్మండు నుంచి ప్రారంభమైన ఆమె సైకిల్‌ యాత్ర సుమారు 14 రోజుల పాటు సాగింది. ఈ ప్రయాణంలో ఆమె కాఠ్మండు, సల్లేరి, సుర్ఖే, ఫక్డింగ్, సాగర్‌మాత నేషనల్ పార్క్, నామ్‌చే బజార్, డెబోచే, ఫెరిచే, లోబుచే,  గోరక్ షేప్ గుండా వెళ్లింది. చివరగా ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకుంది.

దీని వెనుక ఉన్న ప్రేరణ..
సుమారు ఏడాదిన్నర క్రితం తాను మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు.. ఏ భారతీయ మహిళా ఇంతవరకు సైకిల్‌పై అక్కడికి చేరుకోలేదని తెలియడం వల్ల ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపింది. అదీగాక ఈ మౌంట్ ఎవరెస్ట్ గురించి తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడూ దాన్ని చూస్తానా అని వేయికళ్లతో ఎదురుచూశానని ఆనందంగా చెబుతోందామె. 

యాత్రలో ఎదురైన సవాళ్లు
అధిక ఎత్తులో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రయాణం అత్యంత సవాలుతో కూడుకున్నదని చెబుతోంది దివ్య. ఈ జర్నీలో ట్రావెల్‌ హెల్త్‌ సిక్‌నెస్‌, వేగంగా గుండె చప్పుడు వంటి శారీరక ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించింది. అలాగే తక్కువ ఆక్సిజన్‌ స్థాయిలకు అలవాటు పడాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక దివ్య గురువు కుమార్ సింగ్  మాట్లాడుతూ..ఇంతరకు ఏ భారతీయ మహిళ సైకిల్‌పై ఇలాంటి సాహస యాత్ర చేయలేదని అన్నారు. 

అందువల్ల దివ్య ఈ సవాలు స్వీకరించిందని చెప్పారు. వ్యక్తిగతంగా ఏర్పర్చుకున్న ఈ లక్ష్యం కోసం దివ్య తన శరీరాన్ని సన్నద్ధం చేసుకునేలా తీవ్రమైన శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. చివరి​కి అనుకున్నట్లుగా విజయాన్ని సాధించిందన్నారు. ఇక దివ్య గోరఖ్‌పూర్ జిల్లాలోని బనౌడా గ్రామానికి చెందింది. ఆమె తండ్రి సంత్రాజ్ సింగ్ రైతు కాగా, తల్లి ఊర్మిళ సింగ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. కాగా, దివ్య కూడా తల్లిలానే టీచర్‌ వృత్తిలో కొనసాగడం విశేషం. 

(చదవండి: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్‌నెస్‌ మంత్ర..)

 

Advertisement
 
Advertisement
Advertisement