'దేశంలో పెరిగిన నకిలీ నోట్లు'

Counterfeit notes are back in full swing In India - Sakshi

కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి దాదాపు ఆరేళ్లవుతోంది. సమాంతర ఆర్థిక వ్యవస్థను అరికట్టి, నగదు రహిత లావాదేవీలను పెంచడానికి, దేశంలో నకిలీ నోట్లను కనిపించకుండా చేయడానికి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో అట్టహాసంగా ప్రకటించింది. పాత వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లను రద్దు చేసి, వాటికి బదులుగా కొత్తగా రెండువేలు, ఐదువందల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. కొత్త నోట్లకు నకిలీలు సృష్టించడం అసాధ్యమన్న రీతిలో కేంద్రం ప్రకటనలు గుప్పించింది.

ఇంత జరిగినా, దేశంలో నకిలీ నోట్ల చలామణీ ఇంకా జరుగుతూనే ఉంది. అంతేకాదు, నానాటికీ పెరుగుతూనే ఉంది కూడా. నకిలీ నోట్లు గత ఏడాదిలో 102 శాతం మేరకు పెరిగినట్లు సాక్షాత్తు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. నకిలీ కరెన్సీ బెడద అగ్రరాజ్యాల్లో సైతం ఉంది. ఎన్ని చట్టాలు తెచ్చినా, కట్టలు కట్టలుగా, గుట్టలు గుట్టలుగా నకిలీ కరెన్సీ పుట్టుకొస్తూ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థకు చిరకాల సమస్యగా మారిన నకిలీ కరెన్సీ కథా కమామిషూ తెలుసుకుందాం.

నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోట్ల ముద్రణను రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంతోకాలం కొనసాగించలేదు. దాదాపు మూడేళ్లుగా వీటి ముద్రణ నిలిచిపోయింది. ఈ విషయాన్ని కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్వయంగా ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం చలామణీ ఉన్న చోట్ల మొత్తం విలువలో రెండువేల రూపాయల నోట్ల వాటా 1.6 శాతం మాత్రమే. అయినా, గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది 54.16 శాతం అధికంగా రెండువేల రూపాయల నకిలీ నోట్లు చలామణీలోకి వచ్చాయి. వీటి కంటే కొంత విరివిగా ఉన్న ఐదువందల రూపాయల నోట్లు గత ఏడాది కంటే ఈ ఏడాది 101.9 శాతం అధికంగా చలామణీలోకి వచ్చాయి. ఈ సంగతిని ఆర్బీఐ 2021–22 వార్షిక నివేదికలో వెల్లడించింది.

అంతకు ముందు ఏడాది నకిలీ కరెన్సీ చలామణీలో 190 శాతం పెరుగుదల నమోదైంది. బ్యాంకింగ్‌ వ్యవస్థ గుర్తించిన నకిలీ నోట్లలో 6.9 శాతం ఆర్బీఐ వద్ద బయటపడితే, మిగిలిన 93.1 శాతం నకిలీ నోట్లను ఇతర బ్యాంకులు గుర్తించాయి. దేశవ్యాప్తంగా 2019లో రూ.25 కోట్ల విలువైన 2,87,404 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోగా, 2020లో రూ.92 కోట్ల విలువైన 8,34,947 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. అధికారిక సంస్థలు వెల్లడించిన మొత్తంలో మాత్రమే దేశంలో నకిలీ కరెన్సీ చలామణీలో ఉందనుకుంటే పొరపాటే! 

దేశంలో చలామణీ అవుతున్న నకిలీ కరెన్సీకి సంబంధించిన కచ్చితమైన లెక్కలు ప్రభుత్వానికి కూడా తెలీవు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో స్వయంగా చెప్పారు. యూపీఏ ఓటమి తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశంలో నకిలీ కరెన్సీ కనిపించకుండా చేస్తానని మోదీ గంభీరంగా ప్రకటించారు. నకిలీ కరెన్సీని చలామణీ నుంచి మాయం చేయడానికేనంటూ 2016 నవంబర్‌ 8న ఉన్నపళాన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పటి వరకు దేశంలో చలామణీలో ఉన్న వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లు చెల్లకుండా పోయాయి. వీటిని మార్చుకోవడానికి పరిమిత గడువు విధించడంతో జనాలు బ్యాంకుల మీదకు ఎగబడ్డారు.

మరోవైపు కనీస అవసరాల కోసం డబ్బులు విత్‌డ్రా చేసుకుందామనుకున్నా, ఏటీఎంల నుంచి గరిష్ఠంగా రెండువేల రూపాయల వరకు మాత్రమే తీసుకునే అవకాశం కల్పించడంతో, దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలైన్లలో జనాలు గంటల తరబడి పడిగాపులు పడ్డారు. మెల్ల మెల్లగా పరిస్థితులు దారిలోకి వచ్చినా, దేశంలో నకిలీ కరెన్సీ కలకలం యథావిధిగా మళ్లీ మొదలైంది. నకిలీ కరెన్సీ సమస్య అంత తేలికగా వదిలించుకోగల వ్యవహారం కాదు. నకిలీ కరెన్సీ తయారీలో కొద్దిమంది స్థానికుల పాత్ర ఉంటే, చాలావరకు విదేశీ గూఢచర్య సంస్థలు, మాఫియా ముఠాలు, ఉగ్రవాద మూకల పాత్ర కూడా ఉంటోంది. చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్న అగ్రరాజ్యాలకు సైతం ఈ బెడద తప్పడం లేదు.
అతి పురాతన వృత్తుల్లో రెండోది
నకిలీ కరెన్సీ తయారీ, చలామణీ ప్రపంచంలోని అతి పురాతన వృత్తుల్లో రెండోది అని చరిత్రకారులు చెబుతున్నారు. కాగితపు కరెన్సీ వాడుకలోకి రాకముందు నుంచే నకిలీ కరెన్సీ తయారీ బెడద చాలా చోట్ల ఉండేది. అప్పట్లో నకిలీ నాణేలను తయారు చేసేవారు. రోమన్‌ సామ్రాజ్యంలోని ఆసియా మైనర్‌ ప్రాంతానికి చెందిన లిడియాలో క్రీస్తుపూర్వం 600 నాటికి నాణేల తయారీ తొలిసారిగా మొదలైంది. తొలినాళ్లలో బంగారు, వెండి నాణేలు వాడుకలో ఉండేవి.

తర్వాతికాలంలో కంచు, రాగి వంటి తక్కువ విలువ కలిగిన లోహాల నాణేలు, ఆ తర్వాత అల్యూమినియం, నికెల్‌ వంటి అతిచౌక లోహాలతో తయారైన నాణేలు క్రమంగా వాడుకలోకి వచ్చాయి. నాణేలు డబ్బుగా వాడుకలోకి వచ్చి, అవి ప్రజలకు అలవాటైన తొలి రోజుల నుంచే నకిలీ నాణేల తయారీ, చలామణీ కూడా ఉండేది. 
క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో చైనా తొలిసారిగా కాగితపు కరెన్సీ తయారు చేయడం మొదలుపెట్టింది. చైనాలో అప్పట్లో కరెన్సీ నోట్ల తయారీకి మల్బరీ కలపను ఉపయోగించేవారు. అందువల్ల మల్బరీ అడవులకు కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసేవారు. నకిలీ కరెన్సీ తయారు చేసేవారికి అప్పట్లో పలుదేశాల్లో మరణదండన విధించేవారు. అయినా నకిలీ కరెన్సీ తయారీ, చలామణీ కొనసాగుతూనే ఉండేది.

పదమూడో శతాబ్దికి చెందిన ఇటాలియన్‌ రచయిత డాంటే తొలిసారిగా నకిలీ కరెన్సీ ఉదంతాన్ని గ్రంథస్థం చేశాడు. అప్పట్లో ఇటలీలో చలామణీలో ఉన్న ‘ఫ్లోరినో’ అనే బంగారు నాణేలకు నకిలీలు సృష్టించిన మాస్ట్రో ఆడమో అనేవాణ్ణి ఉరితీసిన సంఘటనను డాంటే తన పుస్తకంలో వివరంగా రాశాడు. నకిలీ కరెన్సీకి సంబంధించి చరిత్రలో నమోదైన తొలి ఉదంతం ఇదే! మన దేశంలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికే నకిలీ నాణేల బెడద ఉండేది.

కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో వీటిని ‘కూట నాణేలు’గా పేర్కొన్నాడు. శత్రురాజ్యాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసి, వాటిని లొంగదీసుకునే ఉద్దేశంతో అప్పటి గూఢచర్య వ్యవస్థలు కూట నాణేలను సాధనంగా ఉపయోగించుకునేవి. క్రీస్తుపూర్వం నాటి ఆ పద్ధతి ఇప్పటికీ మారలేదు. ఉదాహరణ చెప్పుకోవాలంటే, మన దేశంలోకి ఏటా వచ్చిపడుతున్న నకిలీ కరెన్సీ కట్టల్లో పాకిస్తానీ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉంటోందనే విషయమై లెక్కలేనన్ని కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్త సమస్య
నకిలీ కరెన్సీ ప్రపంచవ్యాప్త సమస్య. నకిలీ కరెన్సీ బెడదను అరికట్టడానికి ప్రతిదేశం తను అధికారికంగా ముద్రించే కరెన్సీలో ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఫీచర్స్‌ ఏర్పాటు చేసుకుంటూనే ఉంటుంది. అయినా, నకిలీ నిపుణులు వాటికి దీటుగా నకిలీ కరెన్సీని చాపకింద నీరులా చలామణీలోకి తెస్తూనే ఉంటారు. ప్రపంచంలో విరివిగా నకిలీలకు గురయ్యే కరెన్సీ అమెరికన్‌ డాలర్‌. ఆ తర్వాత ఇదే వరుసలోకి బ్రిటన్‌ పౌండ్, యూరోప్‌ దేశాల ఉమ్మడి కరెన్సీ యూరో వస్తాయి. అత్యధిక శాతం నకిలీలకు లోనయ్యే ఘనత మెక్సికన్‌ పెసోకు దక్కుతుంది. 9.91 కోట్ల మెక్సికన్‌ పెసో నోట్లలో కనీసం 3 లక్షల నకిలీ నోట్లు ఉంటాయంటే, మెక్సికోలో నకిలీ కరెన్సీ బెడద ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, పోలండ్, పోర్చుగల్, జాంబియా, కొలంబియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ నకిలీ కరెన్సీ బెడద చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడే వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ, కట్టుదిట్టమైన చట్టాలను దాదాపు అన్ని దేశాలూ చట్టాలను రూపొందించుకున్నాయి. భారత్‌ సహా చాలా దేశాల్లో నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడితే, గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష వరకు పడే అవకాశాలు ఉంటాయి. చట్టాల్లో ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా, నకిలీ కరెన్సీ బెడద మాత్రం తగ్గడమే లేదు. 

అనాయాసంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు నకిలీ కరెన్సీ తయారీని ఒక మార్గంగా ఎంచుకుంటారు. సాధారణంగా ఇలాంటి వాళ్లు తయారు చేసే నకిలీ కరెన్సీ అంత నాణ్యంగా ఉండదు. అందువల్ల ఇలాంటి వాళ్లు పోలీసులకు దొరికిపోతుంటారు. గూఢచర్య సంస్థల అండతో కొన్ని ముఠాలు పకడ్బందీగా నకిలీ నోట్లు తయారు చేస్తుంటాయి. శత్రుదేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వాటి లక్ష్యం. ఇలాంటి అధికారిక అండదండలతో తయారయ్యే నకిలీ నోట్లు దాదాపు అసలు నోట్లను పోలి ఉంటాయి. ఇవి నాణ్యతలో అసలు నోట్లకు ఏమాత్రం తీసిపోవు. వీటిని గుర్తించడమూ కష్టమే. ఇంకోవైపు అంతర్జాతీయ మాఫియా ముఠాలు, ఉగ్రవాద మూకలు కూడా నకిలీ కరెన్సీ తయారీలోను, వ్యాప్తిలోను ఇతోధిక పాత్ర పోషిస్తున్నాయి.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్‌ నాయకత్వంలోని నాజీ సైన్యం ‘ఆపరేషన్‌ బెర్న్‌హార్డ్‌’ పేరిట భారీ ఎత్తున నకిలీ అమెరికన్‌ డాలర్లు, బ్రిటన్‌ పౌండ్లు ముద్రించింది. ఆ నోట్ల కట్టలను నిర్ణీత దేశాలకు నిర్దేశిత సమయానికి చేర్చలేకపోవడంతో చరిత్రల అదో విఫలయత్నంగా మిగిలిపోయింది. అమెరికా–సోవియట్‌ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న కాలంలో అప్పటి సోవియట్‌ గూఢచర్య సంస్థ ఇబ్బడి ముబ్బడిగా అమెరికన్‌ డాలర్లకు నకిలీలను ముద్రించి, అమెరికన్‌ మార్కెట్‌లోకి సరఫరా చేసేది. పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ తరచుగా మన భారత్‌ రూపాయలకు, బంగ్లాదేశ్‌ టాకాలకు నకిలీలను ముద్రించి, రెండు దేశాల్లోకి చేరవేస్తూ వస్తోంది. ఇలా ఒక దేశంలోకి మరో దేశం నకిలీ సరఫరా చేయడం తరతరాలుగా సాగుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలేవీ ఈ సమస్యను అరికట్ట లేకపోతున్నాయి. ఇదిలా ఉంటే, అధునాతన ముద్రణ యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాక నకిలీ కరెన్సీ తయారీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. యూట్యూబ్‌ వీడియోలు చూసి నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడుతున్న ముఠాలు కూడా ఉంటున్నాయంటే, పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 

మనకు వచ్చిన నోట్లలో ఏవైనా నకిలీవి ఉన్నట్లు అనుమానం వస్తే, వాటిని ఏ బ్యాంకుకైనా తీసుకు వెళ్లవచ్చు. బ్యాంకు సిబ్బంది వాటిని పరిశీలించి, అసలువో నకిలీవో చెబుతారు. ఒకవేళ నకిలీ నోటు అయితే, బ్యాంకు సిబ్బంది ఆ నోటును తీసుకుని, దాని విలువ తెలుపుతూ ఒక రసీదు ఇస్తారు. నకిలీ నోటు మనకు ఎవరి వద్ద నుంచి వచ్చిందో, వారికి ఆ రసీదు చూపించి, ఇచ్చినది నకిలీ నోటని చెప్పవచ్చు. అయితే, ఆ రసీదుకు ఎలాంటి మారక విలువ ఉండదు. బ్యాంకులో డబ్బు డిపాజిట్‌ చేసేటప్పుడు అక్కడి యంత్రాలు గాని, సిబ్బంది గాని నకిలీ నోట్లను గుర్తిస్తే, బ్యాంకు సిబ్బంది వాటిని తీసుకుంటారు. అయితే, లావాదేవీలో దాని విలువ శూన్యం. ఒకసారి డిపాజిట్‌ చేసిన నగదులో నాలుగు లేదా అంతకు మించిన సంఖ్యలో నకిలీ నోట్లను గుర్తిస్తే, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులను ఆప్రమత్తం చేస్తారు. ఐదు లేదా అంతకు మించి నకిలీ నోట్లు వస్తే, సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, కేసు పెడతారు.

కరెన్సీ కట్టుదిట్టాలు

నకిలీ కరెన్సీ చలామణీలోకి రాకుండా ఉండేందుకు దాదాపు ప్రతిదేశం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా అంత తేలికగా ఎవరూ నకిలీలు తయారు చేయలేని రీతిలో అధికారిక కరెన్సీని రూపొందిస్తుంది. అధికారిక కరెన్సీ రూపకల్పనలో ఎప్పటికప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది. మన దేశం కూడా కరెన్సీ రూపకల్పనలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం మన కరెన్సీలో నకిలీలను కట్టడి చేసేందుకు పొందుపరచిన ముఖ్యాంశాలు ఏమిటంటే... 

సెక్యూరిటీ త్రెడ్‌: మన దేశంలో పాత నోట్లలో కూడా సెక్యూరిటీ త్రెడ్‌ ఉండేది. కొత్తగా 2016 నుంచి చలామణీలోకి తెచ్చిన రెండువేలు, ఐదువందలు, వంద రూపాయలు సహా అన్ని నోట్లలోనూ ఈ సెక్యూరిటీ త్రెడ్‌ను మరింత కట్టుదిట్టంగా రూపొందించారు. వెలుతురులో పెట్టి చూస్తే, ఈ సెక్యూరిటీ త్రెడ్‌ సన్నని గీతలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనిపై హిందీ ‘భారత్‌’ అనే చిన్న అక్షరాలు కనిపిస్తాయి. అసలు నోట్లను గుర్తించడంలో సెక్యూరిటీ త్రెడ్‌ మొదటి అంశం. సెక్యూరిటీ త్రెడ్‌ మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని 45 డిగ్రీల కోణంలో చూస్తే నీలిరంగులో కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఇలా రంగు మార్పు కనిపించదు.

వాటర్‌ మార్క్‌: మహాత్మాగాంధీ బొమ్మతో చలామణీలో ఉన్న ప్రతి నోటుపైనా మహాత్మాగాంధీ బొమ్మ వాటర్‌ మార్క్‌ ఉంటుంది. నోటుపై సెక్యూరిటీ త్రెడ్‌ పక్కన ఆర్‌బీఐ గవర్నర్‌ సంతకం, ఆర్‌బీఐ ముద్ర ఉంటాయి. ఆ పక్కనే ఖాళీగా కనిపించే భాగాన్ని వెలుగులో చూస్తే, అందులో మహాత్మాగాంధీ బొమ్మ వాటర్‌ మార్క్‌ కనిపిస్తుంది. గాంధీ వాటర్‌ మార్క్‌ బొమ్మ పక్కనే నోటు విలువ తెలిపే సంఖ్య వాటర్‌ మార్క్‌ కూడా కనిపిస్తుంది.

సీత్రూ రిజిస్టర్‌: రూ. 500 నోటుకు ఎడమవైపు 500 సంఖ్య సగం మాత్రమే ముద్రించారా అనేలా కనిపిస్తుంది. దీనికి సరిగ్గా వెనుక భాగంలోనూ అలాగే ఉంటుంది. వెలుతురుకు ఎదురుగా పెట్టి చూస్తే, 500 సంఖ్య పూర్తిగా కనిపిస్తుంది. రూ.2000 నోటులోనూ కనిపించే ఈ సెక్యూరిటీ ఫీచర్‌నే సీత్రూ రిజిస్టర్‌ ఫీచర్‌ అంటారు. 

న్యూ నంబరింగ్‌ ప్యాటర్న్‌: నోటుకు కుడివైపున కింది భాగంలో ముద్రించి ఉండే సంఖ్యలో 2015 నుంచి ఒక సెక్యూరిటీ ఫీచర్‌ ఏర్పాటు చేశారు. ఎడమ నుంచి కుడివైపు చూస్తున్నప్పుడు ఆ సంఖ్య సైజు పెరుగుతుంది. అయితే, సంఖ్యకు ముందు ఉండే మూడు ఇంగ్లిష్‌ అక్షరాల సైజు మాత్రం పెరగదు. ఈ సంఖ్య ఏ రెండు నోట్లకు ఒకేలా ఉండదు.

ఆప్టికల్లీ వేరియబుల్‌ ఇంక్‌: నోటుకు కుడివైపున ఆర్‌బీఐ చిహ్నం, అశోక స్తంభానికి మధ్యలో నోటు విలువ తెలిపే సంఖ్య ఉంటుంది. కంటికి ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఇది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కంటికి సమాంతరంగా పట్టుకున్నప్పుడు నీలం రంగులోకి మారి కనిపిస్తుంది. ఈ సంఖ్య ముద్రణకు ఆప్టికల్లీ వేరియబుల్‌ ఇంక్‌ వాడుతారు. అలాగే, నోటుకు కుడివైపు చివరి భాగంలో రైజ్డ్‌ ప్రింటింగ్‌లో చిన్న గుర్తు కనిపిస్తుంది. ఇలా రైజ్డ్‌ ప్రింటింగ్‌లో రూ.2000 నోటుపై దీర్ఘ చతురస్రం, రూ.500 నోటుపై వృత్తం, రూ.100 నోటుపై త్రిభుజం, రూ.50 నోటుపై చతురస్రం, రూ.20 నోటుపై నిలువుగా ఉండే దీర్ఘ చతురస్రం ఉంటాయి. దృష్టి లోపాలు ఉన్నవారు నోటు విలువను సులువుగా తెలుసుకునేందుకు చేసిన మరో ఏర్పాటు ఇది.
నోటు వెనుక వైపు: నోటు వెనుకవైపు తిప్పి చూస్తే, ఎడమవైపు మధ్య భాగంలో నోటు ముద్రించిన సంవత్సరం, దాని పక్కన కింది భాగంలో స్వచ్ఛ భారత్‌ చిహ్నం, నినాదం ఉంటాయి. దాని పక్కన లాంగ్వేజ్‌ ప్యానెల్‌లో తెలుగు సహా పదిహేను భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది. కుడివైపు చివరి భాగంపైన నోటు విలువ సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది. రూ.2000 నోటుపై మంగళయాన్, రూ.500 నోటుపై ఎర్రకోట, రూ.200 నోటుపై సాంచీ స్థూపం, రూ.100 నోటుపై రాణీ కా వావ్‌ చిత్రాలు ఉంటాయి. 
ఇంటాగ్లియో ప్రింటింగ్‌: నోటుకు మధ్యలో మహాత్మగాంధీ బొమ్మ, ఆర్‌బీఐ ముద్ర, కుడివైపున అశోక స్తంభం ఉంటాయి. వీటితో పాటు నోటుకు ఇరువైపులా బ్లీడ్‌ లైన్స్‌ను ప్రత్యేక విధానంలో ముద్రిస్తారు. ఈ విధమైన ముద్రణను ఇంటాగ్లియో ప్రింటింగ్‌ అంటారు. ఇలా ముద్రించిన నోట్లను తాకుతున్నప్పుడు ఉబ్బెత్తుగా చేతికి తగులుతాయి. రూ.100 నుంచి రూ.2000 వరకు విలువ గల నోట్లపై ఇది కనిపిస్తుంది.
మైక్రో లెటరింగ్‌: ప్రతి నోటులోనూ మహాత్మాగాంధీ బొమ్మకు, దాని పక్కనే ఉన్న నిలువుగీతకు మధ్య ‘ఆర్‌బీఐ’ అనే అతి చిన్న అక్షరాలు కనిపిస్తాయి. భూతద్దం సాయంతో వీటిని స్పష్టంగా చూడవచ్చు. 
లాటెంట్‌ ఇమేజ్‌: నోటు ఎడమవైపు కింది భాగంలో ఒక బొమ్మ కనిపిస్తుంది. దీనిని లాటెంట్‌ ఇమేజ్‌ అంటారు. లాటెంట్‌ ఇమేజ్‌ అంటే దాగి ఉన్న బొమ్మ. ఈ బొమ్మ లోపల ఏముందో మామూలుగా చూస్తే కనిపించదు. కంటి ఎదుట సమాంతరంగా ఉంచి, వెలుతురులో పెట్టి చూస్తే, అందులో నోటు విలువ అంకెల్లో కనిపిస్తుంది. ఇది 2005 తర్వాత వచ్చిన వంద రూపాయలు, అంతకు పైబడిన విలువ కలిగిన ప్రతి నోటులోనూ ఉంటుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top