‘డ్యూటీలో ఉంటే ఆడకూడదా?’

Child Gives Hi Fi To Preast While Blessing - Sakshi

ప్రభువులు, ప్రబోధకులైనా సరే పిల్లలొచ్చి ఎదురుగా నిలబడితే ఎక్కువసేపు తమ పీఠాలపై కూర్చోలేరు. వాళ్లేదో మామూలు మనుషులు అయినట్లు పిల్లలు క్వశ్చన్‌ చేస్తుంటారు. ‘అక్కడెందుకు కూర్చున్నావు?’ అని అడిగితే ప్రభువు మంత్రి వైపు చూడాలి సమాధానం కోసం. ప్రబోధకుడికి మంత్రి ఉండడు. పైనున్న వాడిని అడగాలి. పైనున్నవాడినైనా కనిపిస్తే పిల్లలు వదిలి పెడతారనా? ‘నీ పేరేంటి?’ అని అడుగుతారు. ‘నేను వేంకటేశ్వరస్వామిని’ అని చెబితే, ‘పైనెందుకు ఉన్నావ్‌? కింద నీకు ఇల్లు లేదా?’ అని ఆరా తీస్తారు. పిల్లల లోకంలో ఎవరూ ఎంతోసేపు పెద్దలుగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండలేరు. పోలీస్‌ డ్రెస్‌లో ఉన్నా, ప్రీస్ట్‌ దుస్తుల్లో ఉన్నా సరెండర్‌ అయిపోవలసిందే. వీళ్లతో కలిసి మట్టిలో ఆడవలసిందే. ‘డ్యూటీ లో ఉన్నాను’ అంటే కుదరదు. ‘డ్యూటీలో ఉంటే ఆడకూడదా?’ అని అడుగుతారు. సమాధానం చెప్పడం కన్నా వెళ్లి వాళ్లతో కలిసి ఆడి యూనిఫారాలకు కాస్త మట్టి పూసుకోవడం, మరకలు అంటించుకోవడం సుఖం.

రెండు రోజులుగా ఒక వీడియో నెట్‌ లో తిరుగుతోంది. ఇప్పటికి ఎన్నో లక్షల మంది చూశారు. తల్లీ, చిన్నపాప చర్చిలో ఉంటారు. ఏ దేశంలోనిదో క్రైస్తవాలయం. పాప తల్లి పక్కన నిలుచుని ఉంటుంది. ప్రీస్ట్‌ ప్రేయర్‌ చేస్తూ ఆ పాపను బ్లెస్‌ చెయ్యడానికి చెయ్యి పైకి లేపుతారు. వెంటనే పాప కూడా తన చెయ్యి పైకి లేపి ప్రీస్ట్‌ చేతిని తాకుతుంది. ప్లేయర్స్‌ గాలిలో చేతులు తాకించుకుంటారు కదా గోల్‌ కొట్టినప్పుడో, క్యాచ్‌ పట్టినప్పుడో.. అలా ‘హై ఫైవ్‌’ ఇస్తుంది! ప్రీస్ట్‌ గారు నవ్వు ఆపుకోలేక, నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని బ్లెస్సింగ్స్‌ ఇస్తూ ఉంటారు.

తల్లి మళ్లీ నవ్వకుండా ఉండగలిగింది. ప్రీస్ట్‌ అంటే ఉండే భయ భక్తి గౌరవ భావాల వలన కావచ్చు! ఎదురుగా ఉన్నది ప్రీస్ట్‌ అనే గ్రహింపు తల్లుల్లా చిన్నారులకు కలిగే వరకు ప్రీస్టులు, ప్రభువులు పీఠాలు దిగి పిల్లలతో కలిసి నవ్వుతూ ఉండాల్సిందే, చేతులు కలుపుతూ ఉండాల్సిందే. పిల్లలిక్కడ!! ఇంకో చిన్నారి ఉంది లండన్‌లో. వాళ్ల మదర్‌ పెద్ద పోస్టులో ఉన్నారు, సోషల్‌ వర్క్‌లో కావచ్చు. ఆమెతో ఇంట్లో నుంచి లైవ్‌ లో మాట్లాడుతున్నారు బి.బి.సి. న్యూస్‌ యాంకర్‌ క్రిస్టియన్‌ ఫ్రేజర్‌. మధ్యలో వచ్చి ఇంటర్వ్యూని క్రాష్‌ చేసేసింది! ‘మమ్మీ ఈ బొమ్మలు ఎక్కడ పెట్టమంటావ్‌?‘ అని అడిగింది. ‘ష్‌..’ అని తల్లి సైగ చేసి స్క్రీన్‌ మీద యాంకర్‌ని చూపించింది. యాంకర్‌ కల్పించుకుని ‘కింది షెల్ఫ్‌లో పెడితే బాగుంటుంది కదా చూడు..’ అన్నారు నవ్వుతూ. తల్లి ఇబ్బంది పడింది కానీ కూతురు అదేమీ పట్టించుకోలేదు. ‘వాట్‌ ఈజ్‌ హిస్‌ నేమ్‌.. వ్వాటీస్‌ హిస్‌ నేమ్‌ మమ్మీ?’ అని అడిగింది స్క్రీన్‌లో యాంకర్‌ వైపు చూడకుండానే. పాపం ఆయనే చెప్పుకున్నారు.. ‘మై నేమ్‌ ఈజ్‌ క్రిస్టియన్‌ ఫ్రేజర్‌’ అని. ఇదంతా లైవ్‌ లో వస్తూనే ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top