నేను గతంలో ఒక వీలునామా రాసి, ఆ విషయాన్ని నా కుటుంబ సభ్యులకు – స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామా తిరగరాయాలనుకుంటున్నాను. వీలవుతుందా?
– వి.ఆర్.ఎన్. శాస్త్రి, హైదరాబాద్
మీరు సంపాదించిన లేదా మీకు సంక్రమించిన ఆస్తులను మీ తదనంతరం ఎవరికి పంచాలో నిర్ణయిస్తూ వీలునామా రాయడమనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మార్చుకోవచ్చు. అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలో చేసిన వీలునామా తాలూకు అంశాన్ని, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ వీలునామాలో మీరు ‘ఇదే చివరిది కాదు, నాకు మార్చుకోవాలనిపిస్తే మరోసారి కూడా వీలునామా మార్చుకునే అవకాశం ఉంది’ అని, అలా మార్చకపోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుందని కూడా రాయించవచ్చు.
మీరు వీలునామా రాయించి, ఆ విషయాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా పోందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచూ చూస్తుంటాము. అలాంటి వీలునామాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవు. వీలునామా లో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి సంరక్షకులను (గార్డియన్)ను నియమించటం, శానిటీ ఓత్(చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చు తప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం.
అలా లీగల్ గా మెరుగైన వీలునామా మీ దగ్గరలోని లాయర్ గారితో రాయించుకుని, వీలునామాలో మీరు పోందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. వీలునామా రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే అన్ని విధాల మీ తదనంతరం కూడా అందరికీ మేలు చేస్తుంది. తక్షణ అమలుకూ నోచుకుంటుంది.

– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.


