తెరిచి ఉన్నవాటి వద్ద భారీ బారులు
కొరత ఏర్పడుతుందని తీవ్ర ఆందోళన
గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఆటోల వరుస
కిలోమీటర్ల మేర బారులు..
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా ఆగిపోతుందని, కొరత ఏర్పడుతుందని, ధరలు పెరుగుతాయనే ఊహాగానాలతో నగరంలో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందారు. మంగళవారం ఉప్పల్, మల్లాపూర్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట వంటి అనేక ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు పోటెత్తారు. రాత్రివేళకు సగానికి పైగా పెట్రోల్ బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. తెరిచి ఉన్న బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో వాహనాలు రావడంతో బంకుల్లో నిల్వలు త్వరగా అయిపోయాయి. చమురు కంపెనీలకు డీలర్లు ముందస్తు చెల్లింపులు చేయాల్సి ఉండడం వరుస సెలవుల వల్ల కొన్ని బంకులకు సకాలంలో స్టాక్ చేరకపోవడం కూడా కొంత ప్రభావం చూపింది.
ఆటో.. ఎటో..
మహా నగరంలో రవాణాకు వెన్నెముకగా నిలిచే ఆటోలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. కొద్ది రోజులుగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తే.. మధ్యాహా్ననికి కూడా ట్యాంకులు నిండని పరిస్థితి నెలకొంది. పశి్చమాసియా యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కమ్మేయడంతో... దాని ప్రభావం హైదరాబాద్ ఆటో డ్రైవర్లపై పడింది. గ్యాస్ సరఫరా తగ్గడంతో డిమాండ్‌ను సాకుగా చూపి కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లు స్టాక్ ఉన్నా లేదని బోర్డులు పెడుతున్నాయి. నగరంలో ఎల్పీజీ ఆటోల సంఖ్య లక్ష పైనే. రోజువారీ గ్యాస్ డిమాండ్ 1.70 లక్షల కిలోలు ఉండగా, సరఫరాలో సగటున 30–40 శాతం లోటు కనిపిస్తోంది. భారత్ గ్యాస్ లిమిటెడ్ , ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్ వంటి సంస్థలతో పాటు బీజీఎల్, ప్రైవేటు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. నగర వ్యాప్తంగా సీఎన్‌జీ, ఎల్‌పీజీ స్టేషన్లు ఉన్నప్పటికీ, సగంపైగా బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి.
ప్రైవేటు గ్యాస్ సైతం...
ప్రభుత్వ రంగంలోని ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌తో పాటు ప్రైవేటులో సూపర్ గ్యాస్, గో గ్యాస్, ఏజిస్ లాజిస్టిక్స్, తెలంగాణ గ్యాస్, టోటల్ ఎనర్జీస్‌కు నగర వ్యాప్తంగా స్టేషన్లు ఉన్నాయి. ప్రైవేటు సంఖ్య తక్కువే అయినా అత్యవసర సమయాల్లో ఇవే దిక్కు. దీంతో కొంత ఎక్కువ వసూలు చేస్తాయి. కాగా, యుద్ధానికి ముందు కిలో సీఎన్‌జీ ధర రూ.70–75 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.90–రూ.100 దాటింది. కొన్ని ప్రైవేట్ స్టేషన్లలో ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ప్రధాన కంపెనీల బంకుల్లో గ్యాస్ అయిపోవడంతో డ్రైవర్లు ప్రైవేట్లును ఆశ్రయిస్తున్నారు. అక్కడ లీటరుకు రూ.15–20 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది.


