బరువెక్కుతున్న బాల్యం బాల ‘భార’తం | increases Obesity disease in children | Sakshi
Sakshi News home page

బరువెక్కుతున్న బాల్యం బాల ‘భార’తం

Mar 25 2026 4:14 AM | Updated on Mar 25 2026 4:14 AM

increases Obesity disease in children

ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన చిన్నారులు మోయలేని బరువు మోస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల్లో ఊబకాయం మహమ్మారిలా విస్తరిస్తోంది. అరికట్టడానికి రూపొందించుకున్న ప్రణాళికలు సైతం నీరుగారిపోతున్నాయని తాజా నివేదికలుహెచ్చరిస్తున్నాయి. ఈ ‘బరువెక్కిన’ దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో ఉండటం ముంచుకొస్తున్న ముప్పునకు ఒక హెచ్చరిక.

వరల్డ్‌ ఒబేసిటీ ఫెడరేషన్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025 నాటికి చిన్నపిల్లల్లో ఊబకాయాన్ని అరికట్టాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఈ లక్ష్యం విఫలయత్నంగా మిగిలిపోవడం నిరాశ కలిగించే అంశం.

ఇదే లక్ష్య సాధన కోసం గడువును ఇప్పుడు 2030 వరకు పొడిగించినప్పటికీ, చాలా దేశాలు ఇందుకు సిద్ధంగా లేవని నిపుణులు చెబుతున్నారు. ఈ ధోరణిని నియంత్రించడంలో ఇబ్బంది పడుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఉండటం 
ఆందోళన కలిగించే అంశం.

కోట్లాది మంది భారతీయ పిల్లలు ఇప్పటికే అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. 2025లో భారతదేశంలో 5 నుంచి 9 ఏళ్ల వయస్సు గల దాదాపు 1.49 కోట్ల (14.921 మిలియన్లు) మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో ఉన్నారు.

10 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారిలో అధిక బరువు, ఊబకాయుల సంఖ్య ఇంకా ఎక్కువగా, అంటే 2.64 కోట్లు (26.402 మిలియన్లు) గా ఉంది.

మొత్తంమీద భారతదేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బిఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌– ఎత్తుకుతగ్గ బరువును కలిగి ఉండటాన్ని కొలిచే ప్రామాణిక పద్ధతి)తో జీవిస్తున్నారు. వీరిలో 1.4 కోట్ల మంది ఊబకాయం గలవారిగా గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 5 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఐదుగురు పిల్లలలో ఒకరు (20.7 శాతం) అధిక బరువు, ఊబకాయంతో ఇబ్బందిపడుతున్నారు. 2010లో ఇది 14.6 శాతంగా ఉండేది, ఇప్పుడు గణనీయంగా పెరిగింది.

ఇదే ధోరణి ముందురోజుల్లోనూ కొనసాగితే, 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50.7 కోట్ల మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో ఉండే అవకాశం ఉందని వరల్డ్‌ ఒబేసిటీ ఫెడరేషన్‌ హెచ్చరిస్తోంది.
కేవలం 10 దేశాల్లోనే 20 కోట్లకు పైగా పాఠశాల వయస్సు పిల్లలు అధిక బి.ఎం.ఐ తో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అధిక బి.ఎం.ఐ. ఉన్న పిల్లల సంఖ్యలో చైనా, భారత్, అమెరికా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

చైనాలో 6.2 కోట్ల మంది పిల్లలు అధిక బి.ఎం.ఐ. తో ఉండగా, అందులో 3.3 కోట్ల మంది ఊబకాయంతో ఉన్నారు.

అమెరికాలో 2.7 కోట్ల మంది పిల్లలు అధిక బి.ఎం.ఐ తో ఉండగా, అందులో 1.3 కోట్ల మంది ఊబకాయంతో ఉన్నారు.

ఈ గణాంకాల ప్రకారం, 519 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలలో అధిక బి.ఎం.ఐ ఉన్నవారి సంఖ్యలో భారతదేశం ఇప్పుడు అమెరికాను కూడా దాటేసింది. ఆహారపు అలవాట్లు మారడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలే ఈ పరిస్థితికి దారితీస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement