మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి!

Is Atopic Dermatitis A Problem In Children - Sakshi

'చిన్నపిల్లల చర్మం చాలా కోమలంగా ఉంటుంది. చలికాలంలో వారి చర్మం పొడిబారడంతో అనేక సమస్యలు వస్తాయి. మొదటే మృదువైన చర్మం. దానికి తోడు చలికాలంలో పొడిబారి పగలడం, చిట్లడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘అటోపిక్‌ డర్మటైటిస్‌’ అంటారు. ఈ సీజన్‌లో నెలల పిల్లలు  మొదలు.. ఎదిగిన పిల్లల్లోనూ అనేక వయసు చిన్నారులో కనిపించే అటోపిక్‌ డర్మటైటిస్‌ సమస్యలు, వాటికి పరిష్కారాలను తెలిపే కథనమిది.'

అటోపిక్‌ డర్మటైటిస్‌లో మొదట్లో చర్మం పొడిబారి, దురదతో ఎర్రగా మారుతుంది. పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘లైకెనిఫికేషన్‌’ అంటారు. ఇది జరిగాక దురద ఇంకా పెరుగుతుంది. దాంతో మరీ ఎక్కువగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం మరింత మందమవుతుంది. ఈ ప్రక్రియలు ఒకదాని తర్వాత మరొకటి ఒక సైకిల్‌లా (ఇచ్‌ అండ్‌ స్క్రాచ్‌ సైకిల్‌) సాగుతుంటాయి.

కొందరిలో ఇదొక దీర్ఘకాలిక సమస్య (క్రానిక్‌)గా కూడా మారవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే.. చలికాలంలో చెమ్మ (తేమ) ఇగిరిపోతూ ఉండటంతో చర్మం పొడిబారడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇలాంటప్పుడు చర్మం పొడిబారి, ఎర్రబారుతుంది. కుటుంబ ఆరోగ్య చరిత్రలో ఆస్తమా, డస్ట్‌ అలర్జీలు ఉండేవారిలో అటోపిక్‌ డర్మటైటిస్‌ సమస్య ఎక్కువ. 

వివిధ వయసుల పిల్లల్లో అటోపిక్‌ డర్మటైటిస్‌ తీవ్రత ఇలా..
రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు.. ఈ వయసు పిల్లల్లో చర్మం ఎర్రబారడం ప్రధానంగా ముఖంపైన, మెడ దగ్గర కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో దేహంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలా జరిగే అవకాశముంది. ఉదాహరణకు పాకే పిల్లల్లో వాళ్ల మోకాళ్లు నేలకు ఒరుసుకుపోతుండటం వల్ల మోకాళ్ల దగ్గర ఎటోపిక్‌ 
డర్మటైటిస్‌ కనిపిస్తుంటుంది.

ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో..
ఈ వయసు పిల్లల్లో అటోపిక్‌ డర్మటైటిస్‌తో చర్మం ప్రభావితం కావడమన్నది చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే.. మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ వయసు పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్‌లైన్‌) ఉన్నచోట్ల దురద వచ్చి, అది పగులు బారుతున్నట్లవుతుంది.

రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో.. 
ఈ వయసు పిల్లల్లో చర్మం పొడిబారడం కాస్త  ఎక్కువ. పైగా ఈ పొడిబారడమన్నది మోకాళ్ల కింది భాగంలో ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు.. పొడి బారినప్పుడు బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా కనిపిస్తుంటాయి. ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవులు పొడిబారి, పగుళ్లలాగా వస్తుంది. పెదవుల చుట్టూ చర్మమంతా పగుళ్లుబారి ఓ సరిహద్దులా స్పష్టంగా కనిపిస్తూ, ఆ భాగం మంట పుడుతుంటుంది. దీన్ని ‘పెరీ–ఓరల్‌ డర్మటైటిస్‌’ అంటారు.

ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో.. ఏడేళ్ల వయసు నుంచి (అంతకంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే) పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ఈ వయసునుంచి లక్షణాల తీవ్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. అయితే ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్‌ కూడా ఉండవచ్చు. 

చికిత్స / మేనేజ్‌మెంట్‌ 
తొలి దశ చికిత్స (ఫస్ట్‌ లైన్‌ ట్రీట్‌మెంట్‌): అటోపిక్‌ డర్మటైటిస్‌ ఉన్న పిల్లలకు తొలి దశల్లో చికిత్స చాలా తేలిక. చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్‌ పెట్రోలియమ్‌ జెల్లీ, లిక్విడ్‌ పారఫీన్‌ ఆయిల్‌ వంటివి రాస్తే చేస్తే చాలు. పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం తగ్గుతుంది. రాత్రి నిద్రపడుతుంది.

అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం:

  • సబ్బులు, డిటర్జెంట్లు.. అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్నది  చూసుకోవాలి. అలా జరుగుతుంటే.. సబ్బులను, డిటర్జెంట్లను మార్చాలి.
  • ఘాటైన సబ్బులకు బదులు మైల్డ్‌గా ఉండే క్లెన్సెర్స్‌ తో శుభ్రం చేసుకోవాలి.
  • పిల్లల్ని పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.
  • పిల్లల్లో అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి (ముఖ్యంగా నట్స్, సీ ఫుడ్‌), ఒకవేళ ఆ ఆహారాలతో అలర్జీ వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉంచాలి.

పూత మందులతో చికిత్స:
పిల్లలకు ఎమోలియెంట్స్‌ అని పిలిచే.. లిక్విడ్‌ పారఫీన్, గ్లిజరిన్, మినరల్‌ ఆయిల్‌ వంటివి పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్‌ పూయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్‌ పూశాక వాటిపైన పూతమందుగా వాడే స్టెరాయిడ్స్‌ కూడా వాడవచ్చు. పైపూతగా వాడే స్టెరాయిడ్స్‌ను ఎక్కువ రోజులు వాడకుండా ఉండేందుకు టాపికల్‌ క్యాల్సిన్‌యూరిన్‌ ఇన్హిబిటర్‌ క్రీమ్‌ వాడవచ్చు. డాక్టర్ల సలహా మేరకు పైపూత యాంటీబయాటిక్, స్టెరాయిడ్‌ కాంబినేషన్స్‌ను వాడవచ్చు.

నోటిద్వారా తీసుకోవాల్సిన మందులు:

  • నిద్రకు ముందు డాక్టర్‌ సలహా మేరకు నాన్‌ సెడెటివ్‌ యాంటీహిస్టమైన్స్‌ కూడా ఇవ్వాల్సి రావచ్చు.
  • ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్‌ కూడా ఇవ్వాల్సి రావచ్చు.

రెండోదశ చికిత్స:
మొదటిదశ చికిత్స (ఫస్ట్‌లైన్‌ ట్రీట్‌మెంట్‌)తో అంతగా ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్‌ డోస్‌  పెంచడమూ, అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావచ్చు.

అల్ట్రా వయొలెట్‌ రేడియేషన్‌ చికిత్స:
కొంతమంది పిల్లలకు అల్ట్రావయొలెట్‌ బి– కిరణాలతో చికిత్సతో మంచి ఫలితాలు వస్తాయి.

మూడో దశ చికిత్స (థర్డ్‌ లైన్‌ ట్రీట్‌మెంట్‌): 
నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్‌ ఇవ్వడం లాంటి ఈ థర్డ్‌ లైన్‌ ట్రీట్‌మెంట్‌ అంతా పూర్తిగా డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే జరగాలి.

వెట్‌ ర్యాప్‌ టెక్నిక్‌..
అటోపిక్‌ డర్మటైటిస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే ‘వెట్‌ ర్యాప్‌ టెక్నిక్‌’తో మంచి ఫలితాలుంటాయి. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట ఎమోలియెంట్స్‌ పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన బ్యాండేజ్‌ను ఒక పొరలా కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొరలా పొడి బ్యాండేజ్‌ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి. దీన్నే  వెట్‌ ర్యాప్‌ టెక్నిక్‌ అంటారు. దీంతో అటోపిక్‌ డర్మటైటిస్‌ తీవ్రతను తగ్గించవచ్చు.

లక్షణాలు..
చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటిగుల్లలూ రావచ్చు.
ఎర్ర బారినచోట చర్మం పొట్టు కట్టినట్లు అవుతుంది. మందంగానూ (లైకెనిఫికేషన్‌) మారుతుంది. 
కొన్నిసార్లు కాస్తంత పొట్టు రాలడంతోపాటు అక్కడ గాటు కూడా పడవచ్చు.
మందంగా తెట్టుకట్టిన చర్మం పై పొర లేచిపోయినప్పుడు అక్కడ ద్రవం ఊరుతుండవచ్చు (ఊజింగ్‌).
ఈ దశలోనూ చికిత్స అందకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశముంది.


డా. స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌

ఇవి చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్‌ జ్యూస్‌ తాగితే..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top