కొండ హారతి | Aarti of lamps and garlands to the Seshachalam hills | Sakshi
Sakshi News home page

కొండ హారతి

Apr 27 2026 5:48 AM | Updated on Apr 27 2026 5:48 AM

Aarti of lamps and garlands to the Seshachalam hills

ఆధ్యాత్మికథ

అది శేషాచలం కొండలకు కూత వేటు దూరంలో ఉన్న గ్రామం. ఆ ఊరి అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి కేరళ అమ్మాయితో పెళ్ళి జరిగింది. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.

మొదటిసారిగా ఆ అమ్మాయి అత్తగారింటికి కారులో బయల్దేరింది. ఆ ఊర్లో ప్రతి ఇంటి ముందరో, వెనకాలో కొబ్బరిచెట్లు ఉండటం గమనించింది. చిన్నపిల్లలాగా గంతులేస్తూ కారును ఆపమని కోరింది. గబగబా ఒక కొబ్బరిచెట్టు దగ్గరకు వెళ్ళి చేత్తో తడిమి పరవశించిపోయింది. ‘మా కేరళలో లాగా ఇక్కడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. చాలా సంతోషం. ఈ నేల కొబ్బరిచెట్లకు అనుకూలమైనదా’ అని అడిగింది. ఆమెను ఎప్పుడూ అంత ఆనందంగా ఉండటం చూడలేదు భర్త. పక్కనే ఉన్న భర్త ‘అంత అనుకూలమైన నేల కాదు కానీ, మా ఊర్లో ఈ కొబ్బరి చెట్లను పెంచడానికి ఓ కారణం ఉంది. మా నాన్నగారు వేంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడు. నుదుటిన నామం పెట్టేవాడు. ఆ రోజు ఉదయం శేషాచలం కొండలకి నేతి దీపాల హారతి ఇచ్చే వాడు. దాంతోపాటు కొబ్బరికాయ కూడా  కొట్టేవాడు.
ఒక్కోసారి, పట్టణం నుంచి కొబ్బరికాయ తెచ్చేది మరిచే వాడు. అలా కొబ్బరికాయ తీసుకురాని రోజు మా అమ్మ చాలా బాధపడేది. ఆ వారమంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా  ఉండేది.

అది గమనించిన మా నాన్న ‘ఇంట్లోనే కొబ్బరి చెట్టు నాటితే ఆ సమస్యనుంచి బయటపడవచ్చు కదా’ అని భావించాడు. అనుకున్నట్లే చేశాడు. ఇది చిన్న ఊరు కాబట్టి, ఒకర్ని చూసి మరొకరు కొబ్బరి చెట్లు నాటడం మొదలయ్యింది. అలాగే ప్రతి శనివారం కొండకి హారతి పట్టి టెంకాయ కొట్టడం అందరి ఇండ్లలోనూ అలవాటుగా మారింది’’ అని చెప్పాడు.

‘అలాగా’ అని ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.ఇద్దరూ ఇంటికి వెళ్ళి కాళ్ళూచేతులూ కడుక్కుంటూ ఉండగా– ఇంతలో ఆమె అత్తమామలు పిలవడంతో మిద్దెమీదకు వెళ్ళారు. వారు అప్పటికే నేతి దీప హారతికి అంతా సిద్ధం చేసి ఉన్నారు. పళ్ళెంలో దీపం వెలిగించి కొండకి హారతి ఇచ్చి, టెంకాయ కొట్టి గోవింద నామస్మరణలు చేశారు. ‘ఎంత అదృష్టవంతులు ఇక్కడి వారు, ఆదిశేషుడి రూపంలో ఉన్న శేషాచలం కొండని రోజూ చూసే భాగ్యవంతులు’ అని వారితో పాటు గోవింద నామస్మరణలు చేసింది. దైవభక్తి కల్గిన కోడలు దొరికిందని అత్తమామలు మురిసిపోయారు.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

Advertisement
 
Advertisement
Advertisement