సాహో... ప్రొఫెసర్‌ శాంతమ్మ! | Sakshi
Sakshi News home page

సాహో... ప్రొఫెసర్‌ శాంతమ్మ!

Published Thu, Jul 28 2022 12:14 AM

93 Year Old Professor Chilukuri Santhamma Passion For Teaching For Students - Sakshi

‘‘కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’..అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆమె అక్షరాలా అమలు చేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్‌ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని..దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్‌ చిలుకూరి శాంతమ్మ.

పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే శాంతమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా విజయనగరం జిల్లా సెంచూరియన్‌ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ... విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధిస్తూ కనిపించారామె. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘సాక్షిప్రతినిధి’కి చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. 
 
‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న  జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాను.

అప్పుడే మహారాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్‌ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్‌ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్‌ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా చేరాను. లెక్చరర్‌ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్‌ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను.

ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ల వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు గడిచిపోయింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను.


పాఠాలు భోదిస్తూ... 

వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్‌ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్‌ సైంటిస్ట్స్‌ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

 నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్లు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్లేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్‌ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్‌ డైరెక్టివ్‌‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్లింది.

వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్‌ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్‌ అవ్వరు. అలాగే క్లాస్‌కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు. 

 పొద్దున్న 4 గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్‌ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్‌ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్‌ జీఎస్‌ఎన్‌ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్‌ను నేనేనట. గిన్నిస్‌బుక్‌ వాళ్లకు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు. 

మాది ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న కుటుంబం... డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మావారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’. 
 – బోణం గణేష్, సాక్షి, అమరావతి. ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, విజయనగరం. 

Advertisement
 
Advertisement
 
Advertisement