పీపీఏ బృందం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పీపీఏ బృందం పరిశీలన

Nov 27 2026 1:26 AM | Updated on Nov 27 2026 1:26 AM

పీపీఏ బృందం పరిశీలన పదిలో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యం దూరవిద్య కోర్సులపై అవగాహన భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణ పనుల నాణ్యతను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సంజీవ్‌ వోహ్రా పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల పాటు ఆయన ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో తిరుగుతూ పనులను పరిశీలించారు. అప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి నిర్మాణ పటిష్టతను తనిఖీ చేశారు. కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు. మట్టి, రాయి నింపకం, వాటి పటిష్టత, తేమ శాతం, భూగర్భ జలాల ఊటను గుర్తించే పరికరాల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తలు ప్రాజెక్టు ప్రాంతంలో పలురకాల పరీక్షలు నిర్వహించారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ పి.రామచంద్రరావు, ఈఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.

ముసునూరు: పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. ముసునూరు హైస్కూల్‌ను గురువారం ఆమె తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్‌ఏ–1 ఫలితాల ఆధారంగా విద్యార్థుల విద్యా ప్రగతిపై సమీక్షించారు. డి–గ్రేడ్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, మిషన్‌–మార్చిని సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. నూజివీడు డీవైఈఓ సుధాకర్‌, ఎంఈఓ బీవీఎస్‌ సుబ్బారావు ఉన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ కోర్సులపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కలిగించాలని ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ పి.ఆశ సూచించారు. గురువారం స్థానిక అగ్రహారం పేరయ్య కోనేరు ప్రాంగణం వద్ద ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్లస్‌లో దూరవిద్యా కోర్సులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. హెచ్‌ఎం బి.త్రిపుర సుందరీదేవి మాట్లాడుతూ గతంలో ఫెయిలైన విద్యార్థులు దూరవిద్యా కోర్సుల్లో చేర్చడానికి కృషి చేస్తామన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది రాజ్యాంగమని, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలతో ఇది ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన మన దేశానికి దిశానిర్దేశం చేసింది భారత రా జ్యాంగమని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను గౌరవిస్తూ, అది నిర్దేశించిన బాధ్యతలను నిర్వహించాలన్నారు. అనంతరం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించి, అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో జి.రవీందర్‌, సీపీఓ శ్రీనివాస్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement