పోలవరం నిర్వాసితుల ఎన్నికల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పోలవరం నిర్వాసితుల ఎన్నికల బహిష్కరణ

Nov 27 2026 1:26 AM | Updated on Nov 27 2026 1:26 AM

పి.అంకంపాలెం, తూటికుంటలో జీరో పోలింగ్‌

బుట్టాయగూడెం: జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని పోలవరం నిర్వాసితులు పంచాయతీ ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరించారు. నిర్వాసిత కాలనీలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకపోవడానికి నిరసనగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెం, బుట్టాయగూడెం మండలం తూటికుంట పంచాయతీల పరిధిలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు.

వెలవెలబోయిన కేంద్రాలు

పి.అంకంపాలెం పంచాయతీలోని పునరావాస కాలనీ (కోరటూరు పోలింగ్‌ కేంద్రం) పరిధిలో మొత్తం 257 మంది ఓటర్లు ఉండగా, బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం సమీపంలోని నిర్వాసిత గ్రామమైన తూటికుంట పంచాయతీలో మొత్తం 1,108 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసి, ఓటర్ల రాక కోసం మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిరీక్షించారు. అయితే రెండు పంచాయతీల్లోని నిర్వాసిత కాలనీల నుంచి ఒక్క ఓటరు కూడా పోలింగ్‌ కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా రెండు చోట్లా సున్నా శాతం పోలింగ్‌ నమోదైంది. నిర్ణీత సమయం ముగిసే వరకు ఎవరూ రాకపోవడంతో పోలింగ్‌ సిబ్బంది నిబంధనల ప్రకారం ఖాళీ బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేసి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. గతంలో జరిగిన పరిషత్‌ ఎన్నికల సమయంలోనూ పి.అంకంపాలెం నిర్వాసితులు ఇదే రీతిలో ఎన్నికలను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా తూటికుంటలో తామే సమస్యల పరిష్కారం కోసం ఎన్నికలు బహిష్కరించినట్లు పోలీసులకు నిర్వాసితులు వివరించారు.

ఆరేళ్లుగా మౌలిక వసతుల లేమి

తమ నిరసనపై నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ పూర్వీకుల గ్రామాలను ఖాళీ చేసి పునరావాస కాలనీలకు తరలివచ్చామని, కాలనీల్లోకి వెళితే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నాడు అధికారులు, పాలకులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాలనీలకు వచ్చి ఐదారేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కనీస మౌలిక వసతులు కల్పించలేదని, సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పాత గ్రామాల్లో ఉన్నప్పుడు భూములు, ఇళ్లకు సంబంధించి సర్వేలు చేసి పట్టాలు ఇస్తామని చెప్పినా, ఇక్కడకు వచ్చాక భూములు గానీ, పట్టాలు గానీ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం మారినా తమ స్థితిగతులను పట్టించుకునే నాథుడే లేరని, తమ పనులను తామే చేసుకుంటూ బతుకుతున్నామని ఆవేదన చెందారు. తమ పునరావాస కాలనీలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ హోదా కల్పించి, భూమి పట్టాలు, మౌలిక వసతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేంత వరకు ఏ ఎన్నికల్లోనూ ఓటు వేసే ప్రసక్తే లేదని నిర్వాసితులు తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement