● కోడ్ కూసింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.ఈ నెల 16 నుంచి 18 వరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంఽధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. మొదటి దశలో జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టీలు, పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం మున్సిపాల్టీ, ఆకివీడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. కోర్టు కేసులు, ఇతర కారణాలతో ఏలూరు జిల్లాలోని చింతలపూడి నగర పంచాయతీ, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాల్టీల్లో మొదటి విడతలో ఎన్నికలు జరగడం లేదు.
16న నోటిఫికేషన్ : ఎన్నికలకు సంబంధించి ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. బీసీ జనరల్ కేటగిరీలో ఏలూరు కార్పొరేషన్, అలాగే ఏలూరు నగరపాలక సంస్థలో 62 డివిజన్లకు, నూజివీడు మున్సిపల్ చైర్మన్ ఎస్సీ జనరల్ కేటగిరీలో 36 డివిజన్లు, అలాగే బీసీ మహిళకు రిజర్వు అయిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్తో 32 వార్డులకు, పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళకు 36 వార్డులు, ఆకివీడు నగర పంచాయతీ జనరల్ మహిళకు 28 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో..
ఏలూరు జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలు, పశ్చిమగోదావరిలో 20 జెడ్పీటీసీ స్థానాలు, ఏలూరు జిల్లాలో 27 ఎంపీపీ స్థానాలు, పశ్చిమలో 20 ఎంపీపీ స్థానాలు, ఏలూరు జిల్లాలో 454 ఎంపీటీసీ స్థానాలు, పశ్చిమలో 371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే రెండు జిల్లాల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
మూడు దశల్లో ఎన్నికలు
తొలిదశలో ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసాపురం, ఆకివీడులో ఎన్నికలు
కోర్టు కేసులతో ఐదు చోట్ల పెండింగ్
16 నుంచి నామినేషన్ల స్వీకరణ
28న పుర ఎన్నికల పోలింగ్


