దెందులూరు: బాలికలకు అందించే ఆహారంలో రాజీపడొద్దని రుచి, శుచికర ఆహారం అందించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాల సదన్ వసతి గృహాన్ని ఆమె సందర్శించారు. బాలికలకు సమాజంలో రక్షణ కరువైందని ప్రభుత్వ అధికారులతో పాటు పౌరులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులు బాలికలకే కాకుండా బాలురకు కూడా క్రమశిక్షణతో నడవడిక నేర్పించాలన్నారు. బాలికలు జాగ్రత్తగా ఉండాలని, ఏదైన సమస్య ఎదురైతే తల్లిదండ్రులకు గాని, ఉపాధ్యాయులకు గాని 15100 ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చన్నారు. అనంతరం వసతి గృహంలో భోజనం నాణ్యతను పరిశీలించారు. ఐసీడీఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ తులసి, శిశు సంరక్షణ అధికారిణి సూర్య చక్రవేణి పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం పునర్నిర్మాణం నిమిత్తం నగరంలోని దగ్గర ప్రాంతానికి తరలించాలని పోటీ పరీక్షల అభ్యర్థులు కలెక్టర్‌ను కోరారు. బుధవారం కలెక్టరేట్‌కు చేరుకుని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ జిల్లా కేంద్రానికి రోజూ సుమారు 200 మంది అభ్యర్థులు వస్తున్నామని, నగరానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని శనివారపుపేట గాలిగోపురం వద్ద ఉన్న సచివాలయంలోనికి మార్చాలని నిర్ణయించడం తమకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. అంత దూరం వెళ్లి రావడం తమకు ఇబ్బంది అని, నగరం మధ్యలోని నరసింహారావుపేట ఆఫీసర్స్ క్లబ్ లేదా టీటీడీ కళ్యాణ మండపంలోకి లేదా వ్యవసాయ శాఖ ఐఏడీపీ హాల్ లేదా కేఏహెచ్ఎల్ డిగ్రీ కళాశాల భవనంలోకి లైబ్రరీని మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు బి.ఔనిక, సి.వేణి, టి.నాగవల్లి తదితరులు ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్పెషల్ టెట్ పరీక్షలకు నాల్గో రోజు బుధవారం 338 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలల్లో ఉదయం సెషన్లో 175 మందికి 168 మంది, మధ్యాహ్నం సెషన్లో 175 మందికి 170 మంది హాజరయ్యారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జమ్మూ కాశ్శీర్లోని శ్రీనగర్‌లో 3వ ఎడిషన్ మారథాన్–2026 నిర్వహిస్తున్నారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అథ్లెట్స్, రన్నర్స్, క్రీడా సిబ్బంది పాల్గొన్నవచ్చన్నారు. వివిధ విభాగాల్లో బహుమతులు అందిస్తారని, ఫుట్ మారథాన్‌లో ఓవరాల్ విజేతకు రూ.25 లక్షలు, హాఫ్ మారథాన్‌లో పురుష, మహిళా విజేతలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున అందజేస్తారన్నారు. ఆసక్తిగల వారు కాశ్మీర్ మారథాన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు
పోలవరం రూరల్: జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పురోగతి నమోదైంది. ప్రాజెక్టులోని ఫేజ్–1 పనులకు సంబంధించి కీలక నిర్మాణాలు పూర్తికాగా, మిగిలిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రాజెక్టు అథారిటీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 2026 సెప్టెంబరు నాటికి ప్రాజెక్టు ఫేజ్–1లో భౌతిక పనుల పురోగతి 90.1 శాతానికి చేరగా, భూసేకరణ 95.6 శాతం పూర్తయింది. ఈ వివరాలను అక్టోబరు 12న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని జలవనరుల విభాగం కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం కోసం రూపొందించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నివేదిక వెల్లడించింది.


