కుక్కునూరు: చలికాలం ప్రారంభానికి ముందే మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ముఖ్యంగా వేలేరు, బెస్తగూడెం, చీరవల్లి తదితర గ్రామాల్లో హ్యాండ్‌బోర్లు ఉన్నప్పటికీ అవి పనిచేయక అలంకారప్రాయంగా మారాయి. మరమ్మతులకు గురైన హ్యాండ్‌బోర్లను అధికారులు పట్టించుకోకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఉన్న పంచాయతీ నీటి కనెక్షన్ల ద్వారా సరఫరా జరుగుతున్నప్పటికీ విద్యుత్ సమస్య కారణంగా తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పలు గ్రామాల్లో తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవికాలం రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పనిచేయని హ్యాండ్‌బోర్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, విద్యుత్ సమస్యను పరిష్కరించి నిరంతర తాగునీటి సరఫరా అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


