దీక్షతో మనసుకు ప్రశాంతత
అమ్మవారి కృపే కొండంత బలం
ద్వారకాతిరుమల: కోరిన వరాలిచ్చే కల్పవల్లి.. ఆపదలో అభయమిచ్చే కరుణామయి.. భక్తుల పాలిట కొంగుబంగారంగా, క్షేత్ర దేవతగా పూజలందుకుంటున్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి సన్నిధి శరన్నవరాత్రుల వేళ దీక్షా వైభవంతో అలరారుతోంది. చినవెంకన్న సోదరిగా భక్తుల హృదయాల్లో కొలువైన ఆ తల్లిని దర్శించుకుని, అనుగ్రహం పొందాలనే సంకల్పంతో పెద్ద సంఖ్యలో భక్తులు దీక్షలు స్వీకరిస్తున్నారు. ద్వారకాతిరుమలతో పాటు పరిసర గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి దీక్షలు స్వీకరిస్తుంటారు.
నీలాంబరధారణతో..
కుంకుళ్లమ్మ దీక్షలో నీలం రంగు దుస్తుల ధారణకు ప్రత్యేకత ఉంది. నీలాంబరాలు ధరించి అమ్మవారి సన్నిధికి చేరుకునే భక్తులు దీక్షా నియమాలను పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు భవానీ దీక్షతో పాటు కుంకుళ్లమ్మ దీక్షను కూడా స్వీకరిస్తున్నారు. భక్తుల సౌలభ్యాన్ని బట్టి ఏటా 41, 21, 11 రోజుల పాటు దీక్షలు చేపడుతున్నారు. ఎక్కువ రోజులు దీక్షను ఆచరించడం సాధ్యంకాని వృద్ధులు, మహిళలు, చిన్నారులు మూడు రోజుల దీక్షను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈసారి శుక్ర, శనివారాల్లో పలువురు భక్తులు 11 రోజుల దీక్షను స్వీకరించారు.
కుంకుడు వృక్షమే
అమ్మవారి మూలస్థానం
కుంకుళ్లమ్మ ఆలయం వెనుక భాగంలో ఉన్న కుంకుడు వృక్షానికి అమ్మవారి ఆరాధనలో విశిష్ట స్థానం ఉంది. ఆ వృక్షాన్నే అమ్మవారి ఆవిర్భావ స్థలంగా, మూలస్థానంగా, పుట్టినిల్లుగా భక్తులు భావిస్తారు. దీక్షాదారులు తొలుత వృక్షం వద్ద దీపాలు వెలిగిస్తారు. వృక్షాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి దీపారాధన చేయడం ఈ క్షేత్రంలోని ప్రత్యేక ఆచారంగా కొనసాగుతోంది.
అమ్మవారిని దర్శిస్తేనే యాత్ర పరిపూర్ణం
చినవెంకన్న ఆలయానికి సుమారు కిలోమీటరు దూరంలో కుంకుళ్లమ్మ ఆలయం కొలువై ఉంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో కుంకుళ్లమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారి సోదరిగా భావించే అమ్మవారిని తిరుగు ప్రయాణంలో దర్శిస్తేనే తీర్థయాత్ర పరిపూర్ణం అవుతుందన్నది భక్తుల విశ్వాసం.
రేణుకాదేవిగా, శుభంకరిగా, క్షేమంకరిగా కుంకుళ్లమ్మను కొలుస్తాం. దసరా సమయంలో దీక్ష స్వీకరించి, నిష్టతో అమ్మవారిని ఆరాధించడం ఎంతో తృప్తినిస్తుంది. ఆ తల్లి సన్నిధిలో పూజలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అమ్మవారి కరుణతో మేలు జరుగుతుందన్న నమ్మకం మరింత ధైర్యాన్నిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ దీక్ష చేపడుతున్నాను.
– బి.శ్రీను, కుంకుళ్లమ్మ దీక్షాధారుడు,
రామాపురం, రేలంగి పంచాయతీ, ఇరగవరం మండలం
కుంకుళ్లమ్మ తల్లిపై అపారమైన నమ్మకం ఉంది. ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటే కోరిన కొరికలు నెరవేరుతాయన్న విశ్వాసంతో ఏటా దసరా సమయంలో దీక్షను స్వీకరించి అమ్మవారిని ఆరాధిస్తున్నాను. ద్వారకాతిరుమలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దీక్షలు చేపట్టడం సంతోషంగా ఉంది. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలి.
– మర్రి విజయలక్ష్మి, కుంకుళ్లమ్మ దీక్షాధారిణి,
దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా
శరన్నవరాత్రుల వేళ కుంకుళ్లమ్మ దీక్షల స్వీకరణ
అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక సందడి
చినవెంకన్న సోదరిగా విరాజిల్లుతున్న కుంకుళ్లమ్మ


