అక్రమ కలప స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అక్రమ కలప స్వాధీనం

Oct 11 2026 1:21 AM | Updated on Oct 11 2026 1:21 AM

అక్రమ కలప స్వాధీనం మృతదేహం లభ్యం ఛాతీనొప్పితో లారీ డ్రైవర్‌ మృతి రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కొయ్యలగూడెం: అక్రమ కలపను తరలిస్తున్న వాహనాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గవరవరం సమీపంలో ఏడు టేకు జాతి దిమ్మలతో కొయ్యలగూడెం వైపు వస్తున్న వాహనాన్ని అధికారులు వెంబడించి పట్టుకున్నారు. కలపతో పాటు వాహనాన్ని కన్నాపురం రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. కాగా, పట్టుబడిన అక్రమ కలప విలువను లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చాగల్లు సమీపంలో సంచరిస్తున్న పెద్దపులిని బంధించే పనిలో బిజీగా ఉన్నామని, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.

పెదవేగి: పోలవరం కుడి కాలంలో దూకిన వేగివాడ గ్రామానికి చెందిన వీరమల్లు మణికంఠ మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్ర, శనివారాల్లో పోలవరం కుడి కాలువలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఫైర్స్‌ సిబ్బంది బోట్ల సహాయంతో గాలింపు నిర్వహించారు. మణికంఠ మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

టి.నరసాపురం: ఛాతీనొప్పితో లారీ డ్రైవర్‌ మృతిచెందిన ఘటన టి.నరసాపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన పాశం కృష్ణారెడ్డి (52) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి డ్యూటీకి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి పార్సిల్‌ లారీపై బయలుదేరాడు. శనివారం టి.నరసాపురం మండలం వల్లంపట్ల గ్రామ శివారులోని గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేపై ప్రయాణిస్తుండగా తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో లారీని పక్కకు నిలిపి స్టీరింగ్‌పై వాలిపోయాడు. గమనించిన గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పెట్రోలింగ్‌ పోలీసులు 108 వాహనంలో ఆయనను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కృష్ణారెడ్డి మృతిచెందినట్లు డ్యూటీ డాక్టర్‌ ధ్రువీకరించారు. మృతుడి కుమార్తె పాశం శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు – వట్లూరు రైల్వే స్టేషన్ల మధ్య సర్‌ సీఆర్‌ఆర్‌ కళాశాల వెనుక ప్రాంతంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైలు ఢీకొనడంతో అతడి శరీరం రెండు ముక్కలైంది. పట్టాలపై మృతదేహాన్ని గమనించిన కీమెన్‌ ఇచ్చిన సమాచారం మేరకు... రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ ఏలూరు జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుందని, ఎత్తు సుమారు 5 అడుగులు అని, గుండ్రటి ముఖం, చామనఛాయ కలిగి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై నలుపు రంగు ప్యాంటు, నలుపు రంగు రెడీమేడ్‌ షర్ట్‌ ఉన్నట్లు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు జీఆర్‌పీ ఎస్సై వైకే దానం పరిస్థితిని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసినవారు 94404 11000 నంబర్‌ను సంప్రదించి సమాచారం అందించాలని ఆయన కోరారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు ఎంఆర్‌సీ కాలనీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఎంఆర్‌సీ కాలనీకి చెందిన నడగాని వెంకటేశ్వర్లు (29), శాంతికుమారికి ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం అయింది. వెంకటేశ్వర్లు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, వీరికి పిల్లలు కలగలేదు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య శాంతికుమారి భర్త సోదరి ఇంటికి వెళ్లి, గత కొద్ది రోజులుగా అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో గురువారం పని నిమిత్తం బయటకు వెళ్లిన వెంకటేశ్వర్లు ఎవరికీ కనిపించలేదు. శనివారం ఆయన సోదరి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి తలుపు తీసి చూడగా, ఆయన ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. అప్పటికే మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఏలూరు టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement