ఏలూరు (టూటౌన్): దాదాపు 16 ఏళ్లుగా పారా మెడికల్ పోస్టులకు తగినంతగా రెగ్యులర్ నియమకాలు జరగకపోవడంతో అర్హులైన వారు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉండిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ మెడికల్, హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. సోమవారం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న సుమారు 14,600 మంది నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మన్ అధికారులు, ఇతర పారామెడికల్, అనుబంధ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉండిపోయారన్నారు. సుదీర్ఘకాలంగా నిరంతర సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను అనుభవం, నిరంతర సేవలను పరిగణనలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేయాలన్నారు. 2018 నుంచి అమలులోకి వచ్చిన వేతన తగ్గింపును సమీక్షించాలన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేసే ముందు అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై చర్చించడానికి కమిటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు.


