ఉంగుటూరు: గోపినాథపట్నం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో చేపట్టిన ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,70,500 నగదు, 5 మోటార్ సైకిళ్లు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. మరికొన్ని గ్రామాల్లో కూడా పేకాట విచ్చలవిడిగా జరుగుతున్నట్లు సమాచారం ఉంది.
భీమవరం: అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. టూటౌన్ ఎస్సై కె. రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మందపాటి చిరంజీవి వేణుగోపాల కృష్ణంరాజు కుమార్తె మృణాళిని (26)కి, భీమవరానికి చెందిన నంబూరి బాలసుబ్రహ్మణ్యంతో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు భీమవరం ఆదర్శనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. మృణాళిని తండ్రి కృష్ణంరాజు భీమవరం వచ్చి, ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన విజయవాడ చేరుకునేసరికి (రాత్రి 12:30 గంటల ప్రాంతంలో) కృష్ణంరాజు బంధువులు ఫోన్ చేసి, మృణాళిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. దీంతో ఆయన హుటాహుటిన వెనుతిరిగి వచ్చారు. ఈ లోపు బంధువుల సహాయంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త ఇంట్లోనే ఉండగానే ఆమె ఉరివేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై రామారావు కేసు నమోదు చేసి, మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.


