ఆగిరిపల్లి : ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చైర్మన్ జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ ఈఓ సాయి, అర్చ కులు ఆయన మర్యాదపూర్వక స్వాగతం పలికారు. జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబసభ్యు లతో కలిసి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూ జలు చేయించారు. ఆయనకు ప్రధానార్చకులు వేదాంతం శేషుబాబు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి, పట్టువస్త్రాలు, తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఎస్సై నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ పవన్‌కుమార్, వీఆర్వోలు శ్రీను, ప్రసాద్ అర్చకులు ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని ఏపీ ము న్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల, కార్మికుల యూనియన్ (ఇఫ్టూ) రాష్ట్ర కన్వీనర్ బి.సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మున్సిపల్ ఆప్కాస్ కార్మికుల సమావేశం స్థానిక చోడిదిబ్బలో నగర అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా సోమయ్య మాట్లాడుతూ కూటమి నాయకులు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా మధ్యంతర భృతి ప్రకటించలేదన్నారు. మధ్యంతర భృతి లేని పీఆర్సీ అంటే ఉద్యోగులకు నష్టం చేసేది మాత్రమేనన్నారు. 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసిన తేదీ నుంచి మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. దీని కోసం ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జి.వెంకటేశ్వరరావు, బంగారు వెంకటేశ్వరరావు, అల్లం హనుమంతరావు పాల్గొన్నారు.
భీమడోలు: గుండుగొలను పంచాయతీ శివారు భోగాపురం సచివాలయంలో దొంగలు పడ్డా రు. ఫ్యాన్లు, మోటార్‌ను దొంగిలించినట్టు సచివాలయ భవన కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో భోగాపురంలో సచివాల యం నిర్మించగా.. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ భవనాన్ని ప్రారంభించలేదు. భవనం ఇప్పటికీ కాంట్రాక్టర్ ఆధీనంలోనే ఉంది. ఈ నేపథ్యంలో భవనం తలుపులు పగులగొట్టి లోనికి చేరిన దొంగలు రూ.25 వేల విలువైన 15 ఫ్యాన్లు, మోటార్‌ను అపహరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


