ఏలూరు టౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని చేపల మార్కెట్ ప్రాంతం, 12 పంపుల సెంటర్‌లోని నగరపాలక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించి, అక్కడి వసతులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. ఓటర్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేస్తామని, గత ఎన్నికల్లో వివాదాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 60 శాతం పోలింగ్ కేంద్రాల పరిశీలన పూర్తయిందన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, సీఐలు కే.రామకృష్ణ, అశోక్‌కుమార్, ఎస్‌ఐలు, నగరపాలక, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ కేపీ శివకిషోర్


