ద్వారకాతిరుమల : చినవెంకన్న దివ్య సన్నిధి శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అనివెట్టి మండపాలు, దర్శనం క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
పోలవరం రూరల్ : గోదావరి నదిలో వరద ఉధృతి క్రమేపీ తగ్గుతూ సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడం, నదిలోకి వచ్చే నీటి ప్రవాహం పరిమితం కావడంతో వరద స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు చేరుకోగా, స్పిల్‌వే నుంచి దిగువకు 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల్లోనూ వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది.


