‘హద్దులు’ దాటి ఇసుక అక్రమాలు
కొయ్యలగూడెం: గ్రామీణ ప్రాంతాల్లో సహజ వనరులపై అక్రమార్కుల కన్నుపడింది. యథేచ్ఛగా చెరువుల్లో మట్టిన తవ్వి తరలించేస్తున్నారు. మండలంలోని యర్రంపేట, రాజవరం గ్రామాల్లో సాగునీటి చెరువుల నుంచి మట్టిని జనసేన నేతలు కొల్లగొడుతున్నారు. రేయింబవళ్లు పొక్లయిన్లతో తవ్వి లారీల్లో తరలిస్తున్నారు. వరుస సెలవు దినాలు రావడంతో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మరింత రెచ్చిపోతున్నారు. శుక్రవారం యర్రంపేట, రాజవరం సమీపంలోని సాగునీటి చెరువుల నుంచి మట్టి అక్రమ రవాణా చేశారు. టిప్పర్ మట్టి రూ.5 వేలు, ట్రాక్టర్ మట్టి రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల్లో చెరువు గర్భంలో నీరు అంతంతమాత్రంగా ఉందని, మట్టి తవ్వకాలతో మరింత అడగంటే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. చెరువులో నీరు నిలవకుండా చేస్తున్నారని, ఇప్పటికే పశువులకు సైతం నీరు కరువయ్యిందని అంటున్నారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలతో రబీ సీజన్‌కి అయినా పంటలు వేద్దామనుకుంటే మట్టి తవ్వకాలతో తమ ఆశలు ఆవిరి అవుతున్నాయని చెబుతున్నారు. మట్టి రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
చెరువుల గర్భాలకు తూట్లు
సహజ వనరుల దోపిడీ
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
తెలంగాణకు ఇసుక రవాణా
చింతలపూడి: రాష్ట్రం నుంచి తెలంగాణకి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని చింతలపూడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చింతలపూడి మండల పరిధిలోని సీతానగరం గ్రామం వద్ద సీఐ క్రాంతికుమార్ పర్యవేక్షణలో ఎస్సై కె.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా ఓ లారీ పట్టుపడింది. లారీ డ్రైవర్ పాత బిల్లులను చూపిస్తూ అక్రమంగా సరిహద్దు దాటించేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నట్టు తేలింది. దీంతో సదరు లారీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సతీష్‌కుమార్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సరిహద్దు గ్రామాల్లో నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు.


