● సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు
● వినియోగదారుల్లో అసంతృప్తి
● ఏజెన్సీలో సక్రమంగా అందని సేవలు
● ప్రైవేట్ నెట్‌వర్క్‌ల వైపు మొగ్గు
బుట్టాయగూడెం: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏపీ ఫైబర్ నెట్ సేవలు దారుణంగా తయారయ్యాయి. సాంకేతిక సమస్యల కారణంగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చాలా మంది ఇతర నెట్‌వర్క్‌లకు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిరోజులుగా ఏపీ ఫైబర్ నెట్‌తో వినియోగదారులు విసిగిపోతున్నారు. తరచూ ఆగిపోవడం, నెట్ నెమ్మదించడం జరుగుతుందని వినియోగదారులు వాపోతున్నారు. నెలలో కనీసం 15 రోజులకు పైగా నెట్ సేవలు సక్రమంగా అందడం లేదని అంటున్నారు. అత్యంత చౌకగా ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఏపీ ఫైబర్ నెట్ ఏర్పాటు చేసుకుంటే రూ.350కు పెంచిన ప్రభుత్వం సేవలను మాత్రం సక్రమంగా అందించడం లేదని విమర్శిస్తున్నారు.
స్పందన అంతంతమాత్రం
ప్రజలకు ఏపీ ఫైబర్ సేవలు తక్కువ ధరలకే అందిస్తామని చెప్పి వినియోగదారులను పెంచుకుంటున్న ఏపీ ఫైబర్ సిబ్బంది చివరకు సేవల్లో అంతరాయం ఏర్పడితే కనీసం స్పందించని పరిస్థితి. సేవల్లో అంతరాయం కలిగిన సమయంలో ఫోన్ చేస్తే కనీసం సమాధానం కూడా చెప్పే నాథుడే కరువయ్యాడు. జిల్లాలోని బుట్టాయగూడెం, కొ య్యలగూడెం, జీలుగుమిల్లి, పోలవరం తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అలాగే వేరే ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే నెట్ సేవలు నిలిచిపోయే దుస్థితి. దీనికి కారణం ఏపీ ఫైబర్ ఏర్పాటు చేసిన చోట ఇన్వర్టర్ కనెక్షన్ లేకపోవడం వల్ల కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ సేవలు సక్రమంగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.
ఏపీ ఫైబర్ నెట్ నెలలో 15 రో జులు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. సేవలు నిలిచిపోయిన సమయంలో సమాచారం కోసం ఫోన్ చేస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. డబ్బులు కట్టకపోతే నెట్‌వర్క్ కట్ చేస్తున్నారు.
–ఎన్.సత్యనారాయణ, కొమ్ముగూడెం సెంటర్, బుట్టాయగూడెం మండలం
ఏపీ ఫైబర్ నెట్ సేవలు సక్రమంగా ఉండటం లేదు. తీవ్రమైన అంతరాయాలతో విసిగి పోతున్నాం. ప్రజలకు అత్యంత చౌకగా నెట్ సేవలు ఇస్తామని చెప్పడంతో ఏపీ ఫైబర్ నెట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. కొద్ది నెలలుగా ఆ పరిస్థితి లేదు. అధికారులు ఇప్పటికై నా నెట్ సేవలను సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
– ఎ.దుర్గారావు, బుట్టాయగూడెం


