ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కారాగారంలో శుక్ర వారం ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి పశ్చిమగోదావరి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి యు. ఇందిరాప్రియదర్శిని మాట్లాడుతూ కారాగారంలో ఉన్న ప్రతిఒక్కరూ నేరస్తులు కాదనీ, నేరం మోపబడిన వ్యక్తులు మాత్రమేనని, ఈ కారాగారం ఒక ఆశ్రమం లాంటిదనీ, తప్పు చేసిన వారు పరివర్తన చెందాలని అన్నారు. కారాగారం నుంచి బయటకు వెళ్లిన అనంతరం సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని ప్రారంభించాలన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందనీ, సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఖైదీల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. ఖైదీలకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని, వైద్య సదుపాయాలు, న్యాయ సహాయం, తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆటలు, పాటల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఖైదీలకు బహుమతులు అందించారు. అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు, ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, జిల్లా కారాగార సూపరింటిండెంట్ నరసింహారెడ్డి, జైలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
స్ఫూర్తి ప్రదాత గాంధీజీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతిపిత గాంధీజీ చూపిన శాంతి, అహింస మార్గాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా ఏలూరు కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘ నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహా మనిషి గాంధీజీ అన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్, ఇన్‌చార్జ్ డీఆర్వో ఎం. ముక్కంటి పాల్గొన్నారు.


