ఏలూరు టౌన్ : కోర్టులను బూచీగా చూపిస్తూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల ఎరతో వలవేసి బుట్టలో వేసే సరికొత్త వెన్నుపోటు నాటకానికి సీఎం చంద్రబాబు తెరతీశారని.. బీసీ సోదరులంతా జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న విషయం తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల జీఓ జారీ చేయడం, అమలు చేస్తానని చెప్పడంలో చంద్రబాబు ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ బీసీ రిజర్వేషన్ జీఓను కోర్టు కొట్టేస్తుందని తెలిసినా రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళతామని బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే గత వైఎస్సార్‌సీపీ పాలనలో బీసీలకు ఎలాంటి రాజకీయ అవకాశాలు కల్పించారో ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 13 మేయర్ పదవుల్లో 9 బీసీలకు ఇచ్చారనీ, అంటే 69 శాతంగా ఉందన్నారు. 13 జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవులకు 6 బీసీలకు ఇవ్వటం చరిత్రలో నిలిచిపోతుందనీ, ఇది 46 శాతంగా ఉందన్నారు. ఇవేమీ జీఓలతో చేసింది కాదని స్పష్టం చేశారు. 11 రాజ్యసభ సీట్లలో 4, 25 లోక్‌సభ సీట్లలో 11 బీసీలకు ఇవ్వటమంటే 44 శాతం, 58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకు ఇస్తే 48 శాతం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 53 శాతం, ఎంపీటీసీల్లో 41 శాతం, జెడ్పీటీసీల్లో 36 శాతం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చారనేది చంద్రబాబు తెలుసుకోవాలనీ, బీసీ సోదరులు బాబు మాటలు నమ్మి మోసపోవద్దని వెంకటరమణ హితవుపలికారు.
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ


