● బైక్‌ను ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన బస్సు
● ఓ యువకుడికి తీవ్ర గాయాలు, ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు
ఆగిరిపల్లి: మండలంలోని వడ్లమాను శివారులో గురువారం ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బైక్‌ను ఢీకొట్టి, అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నూజివీడుకు చెందిన బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్ (బిస్) బస్సు తోటపల్లి, చిన్నాగిరిపల్లి, ఆగిరిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 35 మంది విద్యార్థులను ఎక్కించుకుని నూజివీడులోని పాఠశాలకు బయలుదేరింది. వడ్లమాను గ్రామం దాటిన తర్వాత, ఆ బస్సుతో పాటు మరో రెండు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సుల డ్రైవర్లు ఒకరికొకరు అతివేగంగా ఓవర్‌టెక్ చేసుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కందకంలోకి దూకి బోల్తా పడింది. ఈ ఘటనలో బైక్‌పై నూజివీడులోని వికాస్ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్తున్న ముసునూరుకు చెందిన చిమట సతీష్ (19) తీవ్రంగా గాయపడగా, అతని మిత్రుడు మూడి వెంకటేశ్వరరావు (19)కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సతీష్‌ను నూజివీడు ఆసుపత్రికి తరలించి, అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.
భయభ్రాంతులకు గురైన విద్యార్థులు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సులో ఉన్న విద్యార్థులందరూ అందులోనే ఇరుక్కుపోయి భయంతో హాహాకారాలు చేశారు. అదే సమయంలో వేరే కళాశాల బస్సులో వెళ్తున్న విద్యార్థులు అక్కడ ఆగి, బోల్తా పడిన బస్సులోని పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని తల్లిదండ్రులు ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించి ఇళ్లకు చేర్చారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కేవీవీఎన్‌వీ. ప్రసాద్ పరిశీలించారు. అలాగే నూజివీడు సీఐ ఐవీ నాగేంద్రకుమార్, ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని బోల్తా పడిన బస్సును బయటకు తీయించారు. అదృష్టవశాత్తు పిల్లలందరూ పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అతివేగమే కారణం
నూజివీడుకు చెందిన పలు విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు పాఠశాల యాజమాన్యాలు నిర్ధేశించిన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఒకరిని మించి మరొకరు అతివేగంగా, ఓవర్‌టెక్ చేస్తూ బస్సులు నడుపుతున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బిస్ బస్సు మరో కళాశాల బస్సును ఓవర్‌టెక్ చేస్తున్న తరుణంలోనే ఎదురుగా వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల వాహనాన్ని ఢీకొట్టిందని వారు పేర్కొన్నారు.
ప్రమాదంలో భయాందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లి
బస్సులో నుంచి విద్యార్థులను బయటికి తీసిన యువకులు


