భీమవరం: పట్టణంలోని బీవీ రాజు విగ్రహం సమీపంలో యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకిన మణికుమార్‌రాజు మృతదేహాన్ని గురువారం గొల్లవానితిప్ప గ్రామం సమీపంలో గుర్తించినట్లు భీమవరం వన్‌టౌన్ ఎస్సై కె. శ్రీనివాస్ తెలిపారు. భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన గొల్లి మణికుమార్‌రాజు (30) సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి పట్టణంలోని బీవీ రాజు విగ్రహం సమీపంలోని వంతెన వద్ద మోటార్‌సైకిల్, ఫోన్ వదిలి డ్రెయిన్‌లోకి దూకాడు. మృతుడి తండ్రి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా, మృతదేహం గొల్లవానితిప్ప సమీపంలోని యనమదుర్రు డ్రెయిన్‌లో లభ్యమైనట్లు ఎస్సై పేర్కొన్నారు. వివాహ విషయమై క్షణికావేశంలో మణికుమార్‌రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు.
యలమంచిలి: పశ్చిమ గోదావరి జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొంతేరు హైస్కూల్ పీడీ రేలంగి రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో నిర్వహించిన జిల్లా పీఈటీ అసోసియేషన్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ మాజీ అధ్యక్షుడు, రీజనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్పెక్టర్ బి.జాన్సన్, ఏలూరు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి రాంబాబు, ఏలూరు పీఈటీ అసోసియేషన్ కార్యదర్శి ఇందుకూరి రమేష్‌రాజు, పీఈటీ సంఘ తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఎంవీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్షుడిగా ఎన్నికై న రామకృష్ణను డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు ఎల్. సాయి శ్రీనివాస్, ఎంఈఓ–1 గుమ్మళ్ల వీరాస్వామి, ఎంఈఓ–2 ములుగుర్తి వెంకట సత్యనారాయణ తదితరులు అభినందించారు.


