ద్వారకాతిరుమల: చినవెంకన్న దేవస్థానం గోశాలలో బ్రూసెల్లోసిస్ వ్యాధి నియంత్రణకు పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నారు. వ్యాధి ఇతర పశువులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వ్యాధి నిర్ధారణ అయిన పశువులను ఆరోగ్యవంతమైన వాటి నుంచి వేరు చేసి ప్రత్యేకంగా ఉంచడంతోపాటు గోశాలలో పరిశుభ్రత, వ్యాధి పర్యవేక్షణకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన వైద్య సహాయం, సాంకేతిక సూచనలు అందిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.రామ్మోహన్‌నరావు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
కృత్రిమ గర్భధారణ తప్పనిసరి
గోశాలలో 348 పశువులకు గాను 68 ఆవులు, మూడు గిత్తలకు బ్రూసెల్లోసిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందే మార్గాలను దృష్టిలో ఉంచుకుని గోశాలలో సహజ సంపర్కం ద్వారా సంతానోత్పత్తిని నిలిపివేసి, కృత్రిమ గర్భధారణ(ఏఐ) విధానాన్నే అనుసరించాలని అధికారులు సూచించారు.
దూడలకు వ్యాక్సినేషన్
బ్రూసెల్లోసిస్ నివారణలో భాగంగా 4–8 నెలల వయస్సున్న ఆడ దూడలకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. మిగిలిన పశువులకు వ్యాధి సోకకుండా నిరంతర పర్యవేక్షణతోపాటు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు.


