పెదవేగి: నిరంతర సాధన, ప్రతిభ, క్రమశిక్షణతోనే విజయాలు సాధ్యపడతాయని పెదవేగిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు అన్నారు. గురువారం కళాశాల ప్రాంగణంలో రాష్ట్రస్థాయి 70వ చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 130 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ టోర్నమెంట్‌లో వివిధ విభాగాలకు చెందిన మేనేజర్లు, 20 మంది అఫీషియల్స్ (నిర్ణేతలు) పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు ఈ పోటీలు కొనసాగుతాయని అండర్–19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ కందికొండ జయరాజు వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 21 నుంచి 25 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్లుగా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ శాఖ నుంచి సముద్రకని, ఏసోబు, శివకృష్ణ తదితరులు హాజరయ్యారు.
దెందులూరు: నాగులదేవునిపాడు బీసీ కాలనీలో గురువారం రాత్రి పది అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షమైంది. ఏరియాలో భారీ కొండచిలువను చూసి స్థానికులు బెంబేలెత్తి, భయాందోళనతో పరుగులు తీస్తూ కేకలు వేశారు. ఆ సమయంలో మోర్ల చిట్టిబాబు ధైర్యంగా ముందుకు వచ్చి, ఆ కొండచిలువను హతమార్చారు.


