వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ అమర్నాథ్
నూజివీడు: త్వరలో జరిగే ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి నూజివీడు మున్సిపాలిటీపై వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం నూజివీడులో నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కార్యాలయం వద్ద ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అమర్నాథ్ మాట్లాడుతూ పేదలకు మంచి జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతాప్ అప్పారావు ఏనాడు వ్యక్తిగత పనులకు సీఎం దగ్గరకు రాలేదని, అయితే ప్రస్తుతం కొండలను కొల్లగొట్టే నాయకులు ఇక్కడ పుట్టుకొచ్చారన్నారు. కూటమి పాలకులకు ప్రజలు వేసిన ఓట్లా, ఎలక్షన్ కమిషన్ వేసిన ఓట్లా అనే చర్చ ప్రజల్లో జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు పలు రకాలుగా ఒత్తిడి చేస్తారని, ఎవరూ బెదరవద్దన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పొందిన వారికి అధికారం వచ్చిన తరువాత నామినేషన్ల పదవుల్లో ప్రాధాన్యమిస్తామన్నా రు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇంటింటా ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు.
కొండలను లూటీ చేస్తున్న కూటమి
మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజవీడు మున్సిపాలిటీ గురించి అవగాహన లేని వారిని దూరం పెట్టాలన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. చంద్రబాబు నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చి, తీరా అధికారం చేపట్టాక ఇచ్చిన హామీని తుంగలో కలిపారన్నారు. కూటమి పాలకులు శుద్ధ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారే తప్ప ఏ ఒక్క పనినీ కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొంది ఆరోసారి విజయబావుటా ఎగురవేయాలన్నారు. ఆగిరిపల్లి మండలంలో కొండలన్నింటినీ లూటీ చేస్తున్నారని, అమరావతి పేరుతో వెంచర్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. టీడీపీలో కూడా నాయకులకు లాభం లేదని, మంత్రికీ, ఆయన చుట్టూ ఉన్న పది మందికేనని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రికి, ఇక్కడి మంత్రికి నూజివీడు మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని, నేటి చంద్రబాబు ప్రభుత్వాన్ని బేరీజు వేసుకోవాలని కోరారు.
ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి
జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం కోసం అహర్నిశలు శ్రమించాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు వాసంశెట్టి గంగాధరరావు, పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ముసునూరు మాజీ జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, ఆగిరిపల్లి మండల అధ్యక్షుడు బెజవాడ రాంబాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ గబ్బర్ తదితరులు పాల్గొన్నారు.


