భీమవరం: ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమిద్దామని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలో జిల్లా అధ్యక్షుడు కేఎస్ రాజు అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి అల్లం సత్యనారాయణ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘స్రీ్త్ర శక్తి’ పథకం అమలుతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, అందుకోసం 4 వేల కొత్త బస్సులు సమకూర్చాలని, సుమారు 15 వేల ఉద్యోగ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అలాగే, ఆర్టీసీయే స్వయంగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎండీఏ అలీ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. ఇదే వేదికపై ఉద్యోగ విరమణ చేసిన ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌వీ రావును ఘనంగా సత్కరించారు.


